ఓపీఎస్ పెన్షన్‌ అమలుపై ఆ టీచర్లకు గుడ్ న్యూస్

by Ravi |   (  Updated:2025-08-21 00:45:43  IST  )

పెన్షన్ ప్రభుత్వం వేసే బిక్ష కాదు. అది ఉద్యోగుల హక్కు అని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైబి చంద్రచూడ్

ఓపీఎస్ పెన్షన్‌ అమలుపై ఆ టీచర్లకు గుడ్ న్యూస్
X

పెన్షన్ ప్రభుత్వం వేసే బిక్ష కాదు. అది ఉద్యోగుల హక్కు అని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైబి చంద్రచూడ్ 1982 డిసెంబర్ 17న చారిత్రక తీర్పును వెలువరించినా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెట్టడం విచారకరం. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో సీపీఎస్ విధానం కొనసాగుతుండడం బాధాకరం. మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర‌ప్రదేశ్‌లో సీపీఎస్ విధానానికి బదులుగా యూపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టిన గత సర్కారు అధికారాన్ని కోల్పోవడం జరిగింది. ఉద్యోగ సంఘాల ప్రాతి నిధ్యాలు, నిరంతర పోరాటాల ఫలితంగా డీఎస్సీ 2003 ఉపాధ్యాయుల కల నెరవేరింది. వారందరికీ పాత పింఛను విధానాన్ని వర్తింపజేయాలని ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. రెండు దశాబ్దాల పోరాటం వృధా పోలేదని ఉపాధ్యాయులు సంబరాలు జరుపుకుంటున్నారు.

సీపీఎస్ విధానం డేంజర్!

2003 నవంబర్ లో డీఎస్సీ-2003 నోటిఫికేషన్ జారీ చేయబడింది. ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను 2004 జూన్‌లో ప్రభుత్వం పూర్తి చేసింది. అపాయింట్‌మెంట్ ఆర్డర్లు మాత్రం 2005 నవంబర్‌లో జారీ చేసింది. అప్పటికే రాష్ట్రంలో జీవో 653 ద్వారా నూతన పెన్షన్ విధానం సెప్టెంబర్ ఒకటి 2004 నుండి అమల్లోకి వచ్చింది. అభ్యర్థులు అర్హత సాధించిన నాటికి పాత పెన్షన్ విధానం అమల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం అపాయింట్‌మెంట్ ఆర్డర్లు జారీ చేయడంలో అలసత్వం చూపడంతో బలవంతంగా సీపీఎస్ విధానంలోకి నెట్టివేయబడ్డారు.

పాత ఫించన్ విధానం బెస్ట్!

2004 కన్నా ముందు ఉద్యోగంలో చేరిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పింఛను విధానంలో రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 వర్తించేవి. ఈ రూల్స్ ప్రకారం ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో పెన్షన్‌తో పాటు గ్రాట్యుటీ, కమ్యుటేషన్ తదితర బెనిఫిట్స్ లభించేవి. అదే సీపీఎస్ విధానంలో అయితే ఉద్యోగి వేతనం నుండి పది శాతం మొత్తాన్ని మినహాయించి దానికి సరి సమానంగా ప్రభుత్వం కూడా మొత్తాన్ని జమచేసి మార్కెట్లోని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేది. దీంతో మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి అతి తక్కువ పెన్షన్ ఉద్యోగికి అందుతుంది.

ఆ తీర్పు అమలు ఎప్పుడు?

2003లో చేరిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ విధానం అమలు చేయమని ఉన్నత న్యాయస్థానం తీర్పునివ్వడం ముదావహం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ మ్యానిఫెస్టోలో సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాగే కోర్టు తీర్పును అమలు చేస్తూ 2003 డీఎస్సీ ఉపాధ్యా యులకు పాత పెన్షన్ విధానం తక్షణమే అమలు చేయాలి.

సీపీఎస్ రద్దే పోరాట లక్ష్యం!

2003లో ఎంపికైన డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం కోర్టు తీర్పుననుసరించి అమలుకై ప్రభుత్వంపై ఉపాధ్యాయ సంఘాలు ఒత్తిడి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. వెంటనే జీపీఎఫ్ ఖాతాలు తెరిచే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. జీవో 336 ప్రకారం సీపీఎస్‌లో జమయిన మొత్తాన్ని జీపీఎఫ్ ఖాతాలోకి మళ్లించాలి. కేవలం సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం నిర్వహించడమే కాకుండా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. ప్రతి ఉపాధ్యాయుడూ సంఘాల పిలుపు మేరకు నిరసన దీక్షలో పాల్గొన్నపుడే సమస్య తీవ్రత ప్రభుత్వానికి చేరుతుందనే విషయాన్ని గుర్తించిననాడు సీపీఎస్ రద్దు తథ్యం. ఆ దిశగా మనమంతా అడుగులు వేద్దాం.

సుధాకర్.ఏ.వి

రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS

90006 74747

Next Story