- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘గోదారి గట్టున’.. సాగిన ప్రేమకథ
గోదావరి నేపథ్యంలో తెరకెక్కిన ‘గోదారి గట్టుపైన’ ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని చూపించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. జగపతిబాబు, సుమంత్ ప్రభాస్ నటనపై పూర్తి రివ్యూ.

ప్రేమకథలు నిత్య నూతనమయినవి. యువతను సినిమా థియేటర్ వైపు రప్పించే తరతరాల సినీ ఫార్ములానే దర్శకుడు సుభాష్ చంద్ర కూడా నమ్ముకొని ‘సేఫ్ గేమ్’ ఆడే ప్రయత్నం చేశాడు. కొత్తదనం కోసం కాకుండా ‘గోదారి గట్టున’ ఉన్న ఫ్రెష్ నెస్ కోసం సినిమా చూడవచ్చు. ఇది క్లీన్ చిట్ సినిమా. కుటుంబ సపరివారంగా సినిమాకు వెళ్లవచ్చు. (టికెట్ ధరలు, పాప్ కార్న్ ధరలు భయపెట్టకపోతే)
కథేంటంటే..
ఇది.. ‘గోదావరి గట్టున’ జరిగిన కథ. రాజు ఒక ఆటో డ్రైవరు. సరదాగా కాలం గడుపుతుంటాడు. స్నేహితులు కూడా అటువంటివారే. మంచి అబ్బాయి. ఇటువంటి కుర్రాడు ‘మాయ’ను చూసి ప్రేమ మాయలో పడతాడు. మాయ కూడా డిటో.. ఈ క్రమంలో జరిగిన కొన్ని సినిమాటిక్ పరిణామాల పర్యవసానమే సినిమా. వీరిద్దరి ప్రేమకు మాయ తండ్రి అడ్డుపడతాడు. కూతురు జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుదామనుకొనే మధ్యతరగతి తండ్రి అతడు. అతడు ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు, రాజు (సుమంత్ ప్రభాస్) మాయ (నిధి ప్రదీప్) లు కలిసారా? లేదా? అనేవి తెరపై చూడాలి.
సన్నివేశాల్లో బలం..?
సినిమాలో పాత్రలను తీర్చిదిద్దడంలో దర్శకుడు తడబాటుకు లోనయినాడు. ముఖ్యంగా మాయ తండ్రిగా నటించిన ‘జగపతిబాబు’ పాత్రలో ఇది కనిపిస్తుంది. ఎమోషన్స్‌ను బ్యాలెన్స్‌గా రాసుకున్న దర్శకుడు కథ, కథన గమనాన్ని జనరంజకం చేయలేకపోయాడనిపిస్తుంది. కొన్ని ఆసక్తికరమయిన సన్నివేశాలు ఇంకా బాగా తీయవచ్చుననిపిస్తుంది. కథలో ఉన్న ‘సంఘర్షణ’ను బాగానే చెప్పగలిగాడు. ఇందుకు తగ్గ సన్నివేశాలలో మరికొంచం ‘బలం’ అవసరమని చూసేవారికి అనిపిస్తుంది. రాజు – జగపతిబాబు పాత్రల మధ్య ఎమోషన్ సన్నివేశాలు ఇందుకు ఉదాహరణ. చిత్రం మొదటి సగంలో కనిపించే బిగువు రెండవ సగంలో తగ్గిందనిపించడానికి కారణం కూడా ఇదే. చిత్ర ముగింపులో తండ్రీ కూతుర్ల మధ్య సన్నివేశం చిత్రీకరణలో బరువు తగ్గింది.
ప్రాణం పోసిన నటీనటుల అనుభవం..
చిత్రంలో సగటు తండ్రి పాత్రను బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అందుకు తగ్గ విధంగానే జగపతిబాబు చక్కగా నటించారు. కూతురును మిస్ అవుతున్న బాధను, ప్రేమించిన వ్యక్తి దూరమయితే కలిగే బాధను దర్శకుడు చక్కగా చిత్రించాడు. ఆ సన్నివేశాలలోని నాటకీయత కూడా బాగుంది. జగపతిబాబు చుట్టూ అల్లిన సన్ని వేశాలు ఎంతో అందంగా అమిరాయనవచ్చు. ఈ మధ్యలో కథానాయిక, నాయకుల మధ్య లవ్ ట్రాక్, వీటితో కలిసిన ఫ్యామిలీ డ్రామా, సుదర్శన్ కామిడీ వంటివి సినిమాకు అదనపు ఆకర్షణలు. దర్శకుడు పనితనం ఇక్కడ ప్రదర్శితమవుతుంది. సుమంత ప్రభాస్ తనదైన నటనతో ఆకట్టుకుంటాడు. హీరోయిన్ నిధి ప్రదీప్ తన నటనతో, క్యూట్‌నెస్‌తో అలరిస్తుంది. కీలక పాత్రలో రాజీవ్ కనకాల తన అనుభవంతో నటించి మెప్పించాడు. లైలా, దేవి ప్రసాద్, రాజకుమార్ కశిరెడ్డి మిగిలిన నటీ నటులు ఆయా పాత్రలకు తగిన విధంగా నటించారు.
నిర్మాత అభినవ్ చిత్రానికి ఎంత అవసరమో అంతా చేశారు. కాంప్రమైజ్ కాలేదు. దర్శకుడు స్టోరీలైన్‌కు తగిన స్క్రీన్ ప్లే రాయలేద నిపిస్తుంది. నాగవంశీ కృష్ణ అందించిన సంగీతంలో పాటలు ఓ. కె. సాయి సంతోష్ ఛాయాగ్రహణం దృశ్యాలను ఎంతో అందంగా చూపించారు. ఎడిటర్ అనిల్ కుమార్ తన కత్తికి మరింత పదును పెట్టవలసింది. కొన్ని సన్నివేశాల్లో ‘సాగతీత’ కాస్త ఎక్కువగా ఉంది. చక్కని థీమ్, ప్రేమ సన్నివేశాలు, తండ్రీ కూతుళ్ల సంబంధం వంటి సన్నివేశాలు బాగుంటాయి. ఫర్వాలేదు.. ఒకసారి చూడవచ్చు.
-భమిడిపాటి గౌరీశంకర్
94928 58395






