మాకు విద్యార్థులకు చదువు చెప్పే టైం ఇవ్వండి!

by Ravi |   (  Updated:2025-07-20 01:00:31  IST  )

రాష్ట్రంలో విద్య ప్రాధాన్యతాంశంగా, ప్రక్షాళన దిశగా సాగుతున్నట్టుగా, శిక్షణలతో మంచి రోజులు రానున్నట్లుగా, నమోదు శాతం

మాకు విద్యార్థులకు చదువు చెప్పే టైం ఇవ్వండి!
X

రాష్ట్రంలో విద్య ప్రాధాన్యతాంశంగా, ప్రక్షాళన దిశగా సాగుతున్నట్టుగా, శిక్షణలతో మంచి రోజులు రానున్నట్లుగా, నమోదు శాతం పెరిగినట్లుగా ప్రచారంలో ఉన్న కథనాలకు, వాస్తవిక అంశాలకు మధ్య తీవ్ర అంతరాయం ఉన్నట్లుగా క్షేత్రస్థాయి పరిశీలనలో అనేక విషయాలు బయటపడుతున్నాయి.. విద్యాశాఖ అధికారుల అత్యుత్సాహం, ప్రభుత్వ పెద్దల మెప్పుకోసం కలెక్టర్లతో సహా అధికారులు చేస్తున్న అర్ధరహిత చర్యల పట్ల సగటు ఉపాధ్యాయుడు విసుగెత్తి ఉన్నారు. ఎవరికీ చెప్పుకోలేని బాధలతో సత మతమవుతున్నారు..

విద్యాశాఖ పెద్దలు ఎవరికి వారుగా ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న రీతిలో విద్యా విభాగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. వాస్తవ విషయాలు సీఎం దృష్టికి ఏనాటికి చేరి, తమ బంట్రోతు పనికి ఎన్నడు మోక్షం లభించి నిజమైన ఉపాధ్యాయులుగా ఎప్పుడు అవతారం ఎత్తుతామోనని టీచర్లు ఎదురు చూస్తున్నారు. జూన్ 12 నుండి విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఆ రోజు నుండి బడిబాట దగ్గరి నుండి, ప్రోగ్రెషన్ యాక్టివిటీ, యూడైస్ అప్డేషన్, టెక్స్ట్‌బుక్ ఎంట్రీ, నోట్ బుక్స్ ఎంట్రీ, యూనిఫారాల ఎంట్రీ పేరు మీదుగా ట్యాబ్, మొబైల్ ఫోన్లకు అనేక గంటలు అంకితమయ్యారు. ఇదే కాక FRS రిజిస్ట్రేషన్, రోజు అటెండెన్స్ క్యా‌ప్చర్‌తో పాటు MDMలో నింపడం, కాంప్లెక్స్ గ్రూపులో వివరాలు షేర్ చెయ్యడం వంటి పనులకు గంట పైగా సమయం వ‌ృధా అవుతోంది. ఇంత సమాచారం పుంఖానుపుంకాలుగా పాఠశాల నుండి రాష్ట్రం, కేంద్రం వరకు పంపుతుంటే బోధనకు సమయం ఉంటుందా?

వారిని సొంత పనులకు వాడుతుండటంతో..

సమాచార సేకరణకు, మానిటరింగ్‌కు, పాఠశాలకు విద్యాశాఖకు సమన్వయంగా పనిచేయాల్సిన CRPలు ఎక్కడ భౌతికంగా కనిపించడం లేదు. ఫోన్లో, వాట్సాప్‌లో మినహా ఉపాధ్యాయులతో నేరుగా కలిసే అవకాశం వారికి లేదు. ఉపాధ్యాయులు ఎవరైనా సెలవు పెడితే వారిని పాఠశాలకు పంపడం లేదు. CRPలను వారి సొంత పనులకు వినియోగించుకోవడం విచారకరంగా మారింది. ఏవైనా రిపోర్టులు ఇవ్వాల్సి వస్తే టీచర్లు ఓ పూట ఆన్ డ్యూటీలో MRCలకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది.

కలెక్టర్ల విపరీత జోక్యంతో..

పాఠశాలలు సజావుగా నడవడానికి, సౌకర్యాల కల్పన కోసం, పర్యవేక్షణకు, సలహాలు, సూచనలకు, సమీక్షలకు కలెక్టర్ల జోక్యం అవసరమే. కానీ పేరు కోసం, అధికారుల దృష్టిలో పడి మంచి పోస్టింగులు పొందడం కోసం కొందరు కలెక్టర్లు శృతి మించిన పనులు చేస్తున్నారు. ఒక జిల్లా కలెక్టర్ ఎఫ్‌ఎల్ఎన్ ప్రగతి కోసం స్నేహపూరితంగా "కాఫీ విత్ కలెక్టర్" కార్యక్రమం నిర్వహించి ఉపాధ్యాయుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి అటు ఎఫ్‌ఎల్ఎన్ ప్రగతికి, ఉపాధ్యాయుల ప్రేమకు పాత్రులయ్యారు. కానీ కొన్ని జిల్లాల్లో ఇచ్చిన బూట్లు, సాక్సులు రోజు వేసుకొస్తున్నారా? లేదా అంటూ గూగుల్ ఫారంలో నింపమనడం, వారు వెళ్లిన రోజు ఎవరైనా విద్యార్థులు షూస్, సాక్సులు లేకుండా ఉంటే టీచర్లను మందలించడం, మెమోలివ్వడం, వారు నిర్వహించే యూట్యూబ్ ఛానల్‌ను బలవంతంగా సబ్ స్కయిబ్ చేసుకోమని పలుమార్లు ఆదేశించడం కాస్త విడ్డూరంగా మారింది. ఇదే సమయాన్ని ఇదే అధికార యంత్రాంగాన్ని మరిన్ని పనులకు వినియోగిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

బోధనకు స్వేచ్ఛ ఇవ్వండి!

ఫలానా పాఠం ఇలాగే బోధించాలని, పాఠానికి వర్క్ బుక్‌కు సమన్వయం ఉండాలని, అన్నింటికీ రోజులు కావాలని అడగడం కన్నా మా మానాన మమ్మల్ని వదిలేస్తే, బోధన చేసుకుంటామని సగటు ఉపాధ్యాయులు కోరుతున్నారు. రోజువారీ లెక్కలు, సమాచారం, ఆన్లైన్ రోజుల తర్వాత అలసిపోతున్నామని, స్వేచ్ఛ ఇవ్వకుండా సమ యాన్ని అధికారులు హరించి వేస్తున్నారని, రిపోర్టులు రికార్డులు సరిగా లేకుంటే ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని భయభ్రాంతులకు గురవుతున్నామని, తద్వా రా బోధన కన్నా వాటిపైనే ఎక్కువ దృష్టి కేటాయిస్తున్నామని తెలియజేస్తున్నారు. అధికారులు కాగితా లు, సమా చారం కేవలం ప్రచార ఆర్భాటానికే తప్ప ప్రగతికి సూచి కలు కాజాలవు అన్న సత్యాన్ని గ్రహించాలి. దీనిని చిన్న నుండి పెద్ద అధికారి వరకు ప్రస్తుత విధానాలను పున:సమీక్షించుకోవాలి. బడులు బతికే రోజులు రావాలి.

-రావుల రాజేశం

77801 85674

Next Story