సాహిత్య చరిత్ర దిశనే మార్చిన కలం

by Ravi |   (  Updated:2026-07-01 00:31:08  IST  )

పురుష కలం పేరుతో సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశించి, మహిళా స్వేచ్ఛ, సమానత్వం, మానవీయ విలువలకు తన రచనల ద్వారా గొంతుకగా నిలిచిన ఫ్రెంచ్ రచయిత్రి జార్జ్ శాండ్ జీవితం, సాహిత్యం, ఆలోచనలపై ప్రత్యేక కథనం.

సాహిత్య చరిత్ర దిశనే మార్చిన కలం
X

కొంతమంది రచయితలు గొప్ప పుస్తకాలు రాస్తారు. మరికొందరు గొప్ప ఆలోచనలు అందిస్తారు. కానీ అరుదుగా కొందరు మాత్రమే తమ ఉనికినే ఒక ప్రశ్నగా, తమ కలాన్నే ఒక విప్లవంగా నిలబెడతారు. అలాంటి అసాధారణ వ్యక్తిత్వమే ఫ్రెంచ్ సాహిత్యవేత్త జార్జ్ శాండ్. ఆమె జీవితం ఒక రచయిత్రి ప్రయాణం మాత్రమే కాదు.. సమాజం మహిళకు గీసిన గీతలను కలంతో చెరిపేసిన ఆలోచనా యాత్ర. పంతొమ్మిదో శతాబ్దపు యూరప్‌లో స్త్రీకి రచన ఒక హక్కు కాకుండా సాహసం. ప్రతిభను చూడకముందే లింగాన్ని బట్టి తీర్పు చెప్పే కాలం అది. అలాంటి సమయంలో జార్జ్ శాండ్ తన అసలు పేరును పక్కనపెట్టి పురుష కలం పేరుతో సాహిత్య ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అది దాక్కోవడం కాదు.. తన ఆలోచనలను సమాజం వినాల్సిందేననే వ్యూహం. ఆ పేరు వెనుక ఒక వ్యక్తి కాదు, ఒక యుగానికి ఎదురొడ్డి నిలిచిన ధైర్యం ఉంది. ఆమె రచనలు కుటుంబాన్ని కేవలం బంధాల సమాహారంగా కాకుండా పరస్పర గౌరవానికి నిలయంగా చిత్రించాయి. మహిళను జాలిపడాల్సిన పాత్రగా కాకుండా తన జీవితాన్ని తానే నిర్మించుకునే వ్యక్తిగా చూపించాయి. అందుకే ఆమె రచనలు కథలుగా ముగియకుండా సమాజంతో సాగిన సంభాషణలుగా నిలిచాయి. జార్జ్ శాండ్‌ను కేవలం తొలి స్త్రీ వాద రచయిత్రుల్లో ఒకరిగా చూడడం సరిపోదు. ఆమె అసలు గొప్పదనం మనిషిని కేంద్రంగా చూసిన దృక్పథం. అన్యాయం ఎవరికైనా అన్యాయమే.. స్వేచ్ఛ అందరికీ సమానమే అనే మానవీయ విలువలను ఆమె సాహిత్యానికి ఆధారంగా చేసుకుంది. నేటి కాలంలో సమా‌చారానికి హద్దులు లేవు. కానీ ఆలోచనలకు స్వేచ్ఛ ఎంతవరకు ఉందన్న ప్రశ్న ఇంకా ఉంది. ఈ నేపథ్యంలో శాండ్‌ను స్మరించడం అంటే రచన బాధ్యతను గుర్తు చేసుకోవడం. రచయితకు కలం ఒక అద్దం. అది సమాజంలోని అందాన్ని మాత్రమే కాదు, అసమానతలను కూడా చూపాలి. జార్జ్ శాండ్ అదే చేసింది. అందుకే ఆమె సాహిత్యం నేటికీ జీవిస్తుంది.

- చిటికెన కిరణ్ కుమార్

94908 41284

Next Story