- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శైశవం శిథిలం.. పాలస్తీనా విలాపం!
గాజా యుద్ధంలో చిన్నారులపై పడుతున్న తీవ్ర ప్రభావం, ఐక్యరాజ్యసమితి స్వతంత్ర విచారణ కమిషన్ నివేదికలోని ప్రధాన అంశాలు, ఇజ్రాయెల్ భద్రతా వాదనలు, ఉగ్రవాద దాడుల నేపథ్యం, అంతర్జాతీయ న్యాయపరమైన అంశాలు, మానవత్వం కోసం ప్రపంచం తీసుకోవాల్సిన బాధ్యత

ప్రపంచం విజ్ఞానంలో ఎంత ముందుకు వెళ్లినా, యుద్ధం ముందు మానవత్వం ఇంకా బలహీనంగానే నిలుస్తోంది. తుపాకీ గుండ్లు సరిహద్దులను మాత్రమే కాదు, పిల్లల భవిష్యత్తును కూడా చీల్చివేస్తున్నాయి. గాజాలో కొనసాగుతున్న యుద్ధం ఇందుకు అత్యంత విషాదకర ఉదాహరణ. ఐక్యరాజ్యసమితి స్వతంత్ర విచారణ కమిషన్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రపంచ మనస్సాక్షిని కదిలించింది. అదే సమయంలో యుద్ధానికి దారితీసిన ఉగ్రవాద దాడులు, భద్రతా ఆందోళనలు, అంతర్జాతీయ రాజకీయ వాస్తవాలను కూడా విస్మరించలేం.
నెత్తురోడుతున్న బాల్యం..
భారత మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసన్ మురళీధర్ నేతృత్వంలోని స్వతంత్ర విచారణ కమిషన్ సమర్పించిన నివేదిక ప్రకారం, 2023 అక్టోబర్ 7 నుంచి 2026 మార్చి 31 వరకు జరిగిన యుద్ధంలో 18 ఏళ్ల లోపు 20,179 మంది పాలస్తీనా చిన్నారులు మరణించగా, 44,143 మంది గాయ పడ్డారు. మొత్తం మరణాల్లో దాదాపు 30 శాతం చిన్నారులే. మృతుల్లో 5,031 మంది ఐదేళ్లలోపు పిల్లలు, 1,029 మంది ఏడాది లోపు పసికందులు, వారిలో 420 మంది నవజాత శిశువులు ఉన్నారు. అక్టోబర్ 2025లో కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ దాడులు కొనసాగాయని, ఆసుపత్రులు, పాఠశాలలు, శరణాలయాలు, నిరాశ్రయ శిబిరాలు కూడా దాడులకు గురయ్యాయని కమిషన్ పేర్కొంది.
కమిషన్ ఆరోపణలు..
వైద్య రికార్డులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలించిన కమిషన్ పలు తీవ్రమైన ఆరో పణలు చేసింది. పిల్లలను లక్ష్యంగా చేసుకుని స్నైపర్ కాల్పులు, డ్రోన్ దాడులు జరిగాయని, వెస్ట్ బ్యాంక్‌లో అక్రమ అరెస్టులు, నిర్బంధాల్లో చిన్నారులపై హింస, లైంగిక దాడులు జరిగినట్లు పేర్కొంది. ఆసుపత్రులు, ప్రసూతి కేంద్రాలు, పాఠశాలలు ధ్వంసం కావడంతో ఆకలి, వ్యాధులు, అనాథత్వం పెరిగాయని తెలిపింది. ఈ చర్యలు అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘనలే కాకుండా యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేక నేరాలు, జాతి నిర్మూలన ఆరోపణల పరిధిలోకి వస్తాయని కమిషన్ అభిప్రాయపడింది.
మానవత్వం గెలిచినప్పుడే నిజమైన శాంతి
ఈ నివేదికపై విమర్శలూ ఉన్నాయి.. మరణాల గణాంకాలు ప్రధానంగా గాజా ఆరోగ్య శాఖ సమాచారంపై ఆధారపడ్డాయని, సాయుధ పోరాట యోధులను కూడా పౌరులుగా లెక్కిస్తున్నారని ఇజ్రాయెల్, కొందరు విశ్లేషకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. ఇజ్రాయెల్ వాదన ప్రకారం, 2023 అక్టోబర్ 7న హమాస్ దాడిలో సుమారు 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు, చిన్నారులతో సహా, మరణించారు. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారన్నది చరిత్ర నిర్ణ యిస్తుంది. కానీ మరణించిన ఒక్క చిన్నారి కూడా తిరిగి రాడు. ప్రతి చిన్నారి ప్రాణం మానవాళి భవిష్యత్తు. అందుకే ప్రపంచ దేశాలు రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మానవత్వాన్ని కేంద్రంగా పెట్టి శాంతి కోసం కృషి చేయాలి. ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే కాదు, అమాయకుల ప్రాణాలను కాపాడటమూ అంతే ముఖ్యమైన బాధ్యత. తుపాకులు మౌనం పాటించినప్పుడే పిల్లల నవ్వులు తిరిగి వినిపిస్తాయి.. మానవత్వం గెలిచినప్పుడే నిజమైన శాంతి సాధ్యమవుతుంది.
మానవత్వమే అసలు బాధితుడు..
యుద్ధం ఎవరి మధ్య జరిగినా ఓడిపోయేది మానవత్వమే. ఉగ్రవాదం ఎంతటి ఘోర నేరమో, దానికి ప్రతిస్పందనగా అమాయక పౌరులు, ముఖ్యంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా అంతే విషాదకరం. భద్రత పేరుతో పిల్లల ప్రాణాలను బలిగొట్టే హక్కు ఏ దేశానికీ లేదు. అదే సమయంలో హమాస్ వంటి సంస్థలు ఉగ్రదాడులు, బందీల అపహరణ, పౌర ప్రాంతాలను యుద్ధ కేంద్రాలుగా మార్చడం కూడా తీవ్రంగా ఖండించాల్సిందే. ఈ ఆరోపణలపై తుది తీర్పు చెప్పాల్సింది అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజే), అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) వంటి స్వతంత్ర సంస్థలే.
(ఐరాస నివేదిక ఆధారంగా ప్రత్యేక కథనం)
- కాలగిరి శ్రీనివాస్ రెడ్డి,
90101 28884






