విప్లవం నుంచి వ్యవస్థలోకి.. మావోయిస్టు ఉద్యమం కొత్త మలుపు

by Ravi |   (  Updated:2026-02-27 01:15:33  IST  )

ఇటీవల తెలంగాణ డీజీపీ ఎదుట అగ్రనేతలైన దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నర్సింహారెడ్డిలు లొంగిపోవడం సాధారణ ఘటన కాదు.. ఇది కేవలం వ్యక్తుల నిర్ణయం కాదు. ఒక సిద్ధాంత ప్రయాణం అలసటకు గురైన సంకేతం.

విప్లవం నుంచి వ్యవస్థలోకి.. మావోయిస్టు ఉద్యమం కొత్త మలుపు
X

ఇటీవల తెలంగాణ డీజీపీ ఎదుట అగ్రనేతలైన దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నర్సింహారెడ్డిలు లొంగిపోవడం సాధారణ ఘటన కాదు.. ఇది కేవలం వ్యక్తుల నిర్ణయం కాదు. ఒక సిద్ధాంత ప్రయాణం అలసటకు గురైన సంకేతం. దశాబ్దాలుగా అరణ్యాలలో గడిపిన నాయకత్వం ఇప్పుడు ప్రధాన ప్రవాహంలోకి రావడం చరిత్రాత్మక పరిణామం..

లొంగిపోయిన నేతలకు ప్రభుత్వం ప్రకటించిన నగదు బహుమతులు, పునరావాస పథకాలు.. ఇవి ‘బుల్లెట్‌కు బదులు బ్యాలెట్’ అనే ప్రజాస్వామ్య ఆహ్వానానికి సంకేతాలు.. మావోయిస్టు ఉద్యమం పూర్తిగా అంతరించిపోతుందా? లేక ఇది కొత్త రూపంలో మార్పు చెందుతుందా? అనే ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి.

మూలాలను ఛేదించిన బలగాలు..

ఒక విషయం స్పష్టం, దశాబ్దాలుగా కొనసాగిన సాయుధ పోరాటం ప్రజాస్వామ్య వ్యవస్థను కూలదోసే దిశగా ముందుకు సాగలేకపోయింది. అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, రహదారులు.. ఇవి అటవీ ప్రాంతాల్లో చేరడం ప్రారంభమవడంతో ప్రజల ఆశలు మారుతున్నాయి. దశాబ్దాలుగా దేశ అంతర్గత భద్రతకు సవాలుగా నిలిచిన మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలిచింది. ఒకప్పుడు విప్లవ భావజాలానికి అభేద్య కోటగా పేరుగాంచిన దండకారణ్యం, బస్తర్ అటవీ ప్రాంతాలు నేడు భద్రతా దళాల పటిష్ట ఆపరేషన్లకు వేదిక అవు తున్నాయి. ముఖ్యంగా ‘ఆపరేషన్ కగార్’ రూపంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర వ్యూహం ఉద్యమాన్ని మూలాల వరకు కుదించే ప్రయత్నంగా కనిపిస్తోంది.

దశాబ్దాల దార్శనిక ప్రయాణం..

భూసంస్కరణల లోపం, గిరిజనుల నిర్లక్ష్యం, వనరుల దోపిడీ, సామాజిక అసమానతలు... ఇలాంటి అంశాలు మావోయిస్టు సిద్ధాంతానికి నేలవేసిన వాస్తవాలు.. 1967లో నక్సల్బరీ ఘటనతో మొదలైన ఈ దార్శనిక ప్రయాణం, తర్వాత వివిధ దశల్లో మార్పులు చెంది, చివరకు 2004లో Communist Party of India (Maoist)గా ఐక్యరూపం దాల్చింది. దండకారణ్యాన్ని కేంద్రంగా చేసుకుని, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో పార్టీ ప్రభావాన్ని విస్తరించింది.

హింసాత్మక చర్యలు రేపిన ప్రశ్నలు..

ఉద్యమం తొలి దశలో ‘వర్గపోరాటం’ అనే సిద్ధాంతంతో గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించింది. అయితే కాల క్రమేణా హింస, మౌలిక వసతుల ధ్వంసం, ప్రజాప్రతి నిధుల హత్యలు.. ఇవన్నీ సామాన్య ప్రజల్లో భయాన్ని పెంచాయి. విప్లవం పేరుతో జరిగిన హింసాత్మక చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతో మావోయిస్టులపై బహుముఖ దాడులు ప్రారంభమయ్యాయి. ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ బలోపేతం, డ్రోన్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రోడ్డు, సంవాహన సదుపాయాల విస్తరణ వంటి వాటితో మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి.

అలసిన సిద్ధాంత ప్రయాణం..

‘ఆపరేషన్ కగార్’ ఈ వ్యూహంలో కీలక ఘట్టం. ఛత్తీస్‌గఢ్ కేంద్రంగా భద్రతా బలగాలు జరుపుతున్న క్రమబద్ధమైన దాడులు అగ్రనాయకత్వాన్ని లక్ష్యంగా చేసు కున్నాయి. అత్యంత కీలక నేతల మరణం, అరెస్టులు, వరుస లొంగుబాట్లు... ఇవి ఉద్యమాన్ని కకావికలం చేశాయి. అగ్రశ్రేణి నాయకత్వం కోల్పోవడం వల్ల పార్టీకి వ్యూహాత్మక దిశ కనిపించలేదని స్పష్టమవుతోంది. ఇటీవల తెలంగాణ డీజీపీ ఎదుట అగ్రనేతలైన దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నర్సింహారెడ్డిలు లొంగిపోవడం సాధారణ ఘటన కాదు. ఇది కేవలం వ్యక్తుల నిర్ణయం కాదు.. ఒక సిద్ధాంత ప్రయాణం అలసటకు గురైన సంకేతం. దశాబ్దాలుగా అరణ్యాలలో గడిపిన నాయకత్వం ఇప్పుడు ప్రధాన ప్రవాహంలోకి రావడం చరిత్రాత్మక పరిణామం.

శాంతియుత మార్గానికి గుర్తింపు!

లొంగిపోయిన నేతలకు ప్రభుత్వం ప్రకటించిన నగదు బహుమతులు, పునరావాస పథకాలు.. ఇవి ‘బుల్లెట్‌కు బదులు బ్యాలెట్’ అనే ప్రజాస్వామ్య ఆహ్వానానికి సంకేతాలు. దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డిపై ₹25 లక్షలు చొప్పున, బడే చొక్కారావు, నూనె నర్సింహారెడ్డిపై ₹20 లక్షలు చొప్పున ప్రకటించిన మొత్తాలు కేవలం బహుమతులు మాత్రమే కాదు.. హింసాత్మక మార్గం విడిచిపెట్టి సామాన్య జీవితంలోకి అడుగుపెట్టే అవకాశానికి గుర్తింపు. అయితే మావోయిస్టు ఉద్యమం పూర్తిగా అంతరించిపోతుందా? లేక ఇది కొత్త రూపంలో మార్పు చెందుతుందా? అనే ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. అయితే ఒక విషయం స్పష్టం, దశాబ్దాలుగా కొనసాగిన సాయుధ పోరాటం ప్రజాస్వామ్య వ్యవస్థను కూలదోసే దిశగా ముందుకు సాగలేకపోయింది. అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, రహదారులు.. ఇవి అటవీ ప్రాంతాల్లో చేరడం ప్రారంభ మవడంతో ప్రజల ఆశలు మారుతున్నాయి.

అసమానతలు తొలిగితే కదా..

విప్లవ భావజాలం పుట్టుకకు కారణమైన అసమానతలు పూర్తిగా తొలగిపోయాయని చెప్పలేం.. కానీ వాటి పరిష్కారం కోసం ఆయుధాలు కాదు, రాజ్యాంగబద్ధమైన మార్గాలే సమాధానమని తాజా పరిణామాలు సూచి స్తున్నాయి. దండకారణ్యాన్ని శాసించిన ఉద్యమం ఇప్పుడు చరిత్ర పుటల్లోకి జారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక దశ ముగుస్తోంది. కానీ ఇది కేవలం భద్రతా విజయగాథగా మిగలకూడదు.. అసమానతలను తగ్గించే సార్థక అభివృద్ధి, అట్ట‌డుగు వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడే విధానాలు, ప్రజాస్వామ్య భాగస్వామ్యం.. ఇవి బలోపేతం అయితేనే శాశ్వత శాంతి సాధ్యం. దశాబ్దాల పోరాటానికి ఇది ముగింపు దశ కావచ్చు. అయితే సమగ్ర న్యాయం, సమాన అభివృద్ధి సాధించగలిగితేనే ఈ ముగింపు చరిత్రలో శాంతి అధ్యాయంగా నిలుస్తుంది.

- సిద్ధగౌని సుద‌ర్శ‌న్

97017 03684

Next Story