- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రీల్ ట్రెండ్స్ నుండి.. రియల్ ప్రజాస్వామ్యం వైపు!
సోషల్ మీడియా యుగంలో నిరసనల స్వరూపం ఎలా మారుతోంది? రీల్స్, హ్యాష్‌ట్యాగ్‌లు, డిజిటల్ ఉద్యమాలు ప్రజాస్వామ్యంపై చూపుతున్న ప్రభావం, శాంతియుత నిరసనల ప్రాధాన్యం, వాస్తవాల పట్ల బాధ్యత..

ఒకప్పుడు నిరసనలు గ్రామ సభల చర్చల్లో, కళాశాల ప్రాంగణాల్లో, కార్మిక సంఘాల సమావేశాల్లో పుట్టి, వీధులపై అడుగులు వేస్తూ సమాజాన్ని కదిలించేవి. నేడు అదే ఉద్యమాలు ఒక మొబైల్ స్క్రీన్‌పై మొదలై, కేవలం కొన్ని గంటల్లోనే గ్రామం నుంచి దేశ రాజధాని వరకు, అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒక రీల్, ఒక పోస్టు, ఒక హ్యాష్‌ట్యాగ్ లక్షలాది మందిని ఒకే సమస్య చుట్టూ ఏకం చేసే శక్తిగా మారింది.
డిజిటల్ మీడియా.. సమాచార సాధనాలే కాదు..
డిజిటల్ వేదికలు ఇప్పుడు కేవలం సమాచార సాధనాలు కాదు, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే, నిరసనల దిశను మలిచే కొత్త ప్రజా వేదికలుగా రూపాంతరం చెందుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ ఇప్పటికీ ప్రజాస్వామ్య నిరసనలకు ప్రతీకగా నిలుస్తుండగా, దానికి సమాంతరంగా సోషల్ మీడియా ప్రజా చర్చలు, ప్రజా సమీకరణాలకు వేదికగా మారుతోందని పలువురు పరిశీలకులు భావిస్తున్నారు. ఇక్కడే ఒక కీలకమైన ప్రశ్న ఎదురవుతోంది. నేటి సాంకేతిక పరిణామాలు నిరసనల స్వరూపాన్ని కొత్త దిశగా మలుస్తున్నాయా లేక వేగవంతమైన స్పందనలను ఉద్యమాలుగా మార్చేస్తున్నాయా?
మారుతున్న నిరసనల స్వరూపం..
సోషల్ మీడియా యువతను సామాజిక, రాజకీయ చర్చల్లో మరింత చురుకుగా భాగస్వామ్యం చేస్తోందని అంతర్జాతీయ సంస్థల పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక సామాజిక ఉద్యమాల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించినప్పటికీ, ప్రతి వైరల్ సందేశాన్ని వాస్తవాలతో ధృవీ కరించడం ప్రజాస్వామ్య చైతన్యంలో అత్యంత అవసరమైన అంశంగా మారింది. సమాచారం వేగంగా వ్యాపించే ఈ కాలంలో ప్రజాస్వామ్యానికి అసలు బలం కేవలం వైరల్ ప్రభావంలో కాదు, రాజ్యాంగబద్ధమైన స్వేచ్ఛ, బాధ్యత, వాస్తవాల పట్ల నిబద్ధతలోనే దాగి ఉంది.
నిరసన హక్కు.. ప్రజా ప్రయోజనం!
ప్రపంచ ప్రజాస్వామ్యాల అనుభవం కూడా ఒకే విషయాన్ని చెబుతోంది. శాంతియుత నిరసన ప్రజాస్వామ్యానికి అంతర్భాగం, కానీ అది ప్రజా ప్రయోజనం, చట్టబద్ధతతో కలిసి నడవాలి. 1963లో అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో జరిగిన చారిత్రాత్మక పౌరహక్కుల మహా శాంతియుత ర్యాలీ పౌరహక్కుల ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచి, శాంతియుత ప్రజా భాగస్వామ్యం సామాజిక మార్పుకు ఎంత శక్తివంతమైన సాధనమో చూపించింది. 1989లో తూర్పు జర్మనీలో జరిగిన శాంతియుత ప్రజా ఉద్యమాలు బెర్లిన్ గోడ పతనానికి దారి తీసిన విస్తృత రాజకీయ, సామాజిక పరి ణామాల్లో ముఖ్యమైన అంశంగా చరిత్రకారులు గుర్తిస్తారు.. మరోవైపు 2019లో హాంకాంగ్‌లో జరిగిన భారీ ప్రజా నిర సనలు పౌర స్వేచ్ఛలు, ప్రజా శాంతి, చట్ట అమలు మధ్య సమతుల్యతపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత న్యాయ, విధాన చర్చలకు దారితీశాయి. అంతర్జాతీయ అనుభవాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు, ప్రజా ప్రయోజనం రెండూ పరస్పర విరుద్ధాలు కావు, అవి సమతుల్యంగా పరిరక్షించాల్సిన విలువలు..
ట్రెండ్ కంటే బాధ్యత గొప్పది!
రీల్స్ తరం తమ ఆలోచనలను వేగంగా ప్రపంచానికి చేర వేయగలుగుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొప్ప అవకాశం కూడా, ఒక పెద్ద బాధ్యత కూడా. నిరసనల లక్ష్యం కేవలం వైరల్ కావడం కాదు.. సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడం. భావోద్వేగం అవసరమే, కానీ వాస్తవాల ఆధారంగా ఆలోచించడం మరింత అవసరం. చర్చలు ఉండాలి, విభేదాలు ఉండవచ్చు, విమర్శలు కూడా సహజమే. అయితే అవన్నీ రాజ్యాంగబద్ధమైన, శాంతియుతమైన, బాధ్యతాయుతమైన మార్గంలో సాగినప్పుడే ప్రజా స్వామ్యం మరింత బలపడుతుంది. రీల్స్ తరం ప్రజాస్వామ్య చరిత్రలో తన ముద్ర వేయాలంటే ప్రతి వైరల్ వీడియోతో పాటు ప్రతి పౌరుడు వాస్తవాలను గౌరవించే సంస్కృతిని కూడా వైరల్ చేయాలి. అదే రియల్ నిరసన.. అదే రియల్ ప్రజాస్వామ్యం.
-ఫిరోజ్ ఖాన్
96404 66464






