- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్వాంటం వ్యాలీ నుంచి గూగుల్ ఏఐ హబ్‌దాకా.. టెక్నాలజీ విప్లవానికి ఏపీ వేదిక
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించి, సామాజిక పురోగతి, పర్యావరణ స్థిరత్వం, సుపరిపాలన

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించి, సామాజిక పురోగతి, పర్యావరణ స్థిరత్వం, సుపరిపాలన, ఉపాధి కల్పన, నవ్యావిష్కరణలకు నెలవైన అభివృద్ధి చెందిన దేశంగా రూపొందాలనే ప్రధాని నరేంద్ర మోడీ ‘వికసిత భారత్ @2047’ లక్ష్యాన్ని చేరాలంటే ఆధునిక ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారకమౌతున్న ఏఐ, క్వాంటం కంప్యూటింగ్‌లపై పట్టు సాధించాలి. ఈ దిశగా దేశ ప్రస్థానాన్ని కీలక మలుపు తిప్పే రెండు చారిత్రాత్మక ఘట్టాలకు చంద్రబాబు నాయ కత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేదికయ్యింది.
మొదటిది క్వాంటం టెక్నాలజీ పరిశోధనలకు, ఆవిష్క రణలకు కేంద్రంగా అమరావతిలో భారతదేశపు మొట్ట మొదటి క్వాంటం వ్యాలీ ప్రారంభానికి పునాది పడటం, రెండవది భారత్ పరిణామ క్రమానికి నాందిగా విశాఖ పట్నంలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మైక్రోసాఫ్ట్ రాకతో ఐటీ రంగం ఊపందుకున్నట్లే, ఈ కంపెనీల ఆగమనంతో ప్రపంచ డిజిటల్ మౌలిక వసతులకు కేంద్రంగా ఏపీ భాసిల్లబోతోంది.
డేటా సెంటర్ అనివార్యం కావడంతో..
గతంలో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైటెక్ సిటీ నిర్మాణ సమయంలో కంప్యూటర్లు కూడు పెడతాయా? అని కొందరు అవహేళన చేసినట్లే ప్రస్తుత డేటా సెంటర్ కేంద్రంపై కొందరు కువిమర్శలు చేస్తూ ఒక గొప్ప అవకాశాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. అంతర్జాలంలోని సమాచారాన్ని పెద్ద మొత్తంలో ఒకే చోట భద్రపరచి, క్రమబద్దీకరించి, పంపిణీ చేయడానికి ఉప యోగించే కేంద్రాలే డేటా సెంటర్లు. ఇతర దేశాలలో వందలాది డేటా సెంటర్లు ఉన్నాయి. తాజాగా భారత ప్రభుత్వం మన డేటా వేరే దేశాల్లో ఉండకూడదనే నిబంధన విధించడం వలన మన దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటు అనివార్యం అయింది. అయితే ఈ డేటా సెంటర్లలో విద్యుత్, నీటి వినియోగం అధికంగా ఉంటుందనేది నిజం. కానీ విశాఖలో స్థాపిస్తున్న గూగుల్ డేటా సెంటర్‌లో అత్యంత సమర్ధమైన, ఆధునిక లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ వినియోగించడం వలన నీటి వినియోగం తగ్గడంతో పాటు విద్యుత్ వినియోగం కూడా 20 శాతం తగ్గుతుంది. అలాగే ఈ డేటా సెంటర్ నిర్వహణకు కావలసిన 80 శాతం విద్యుత్ తమ స్వంత సౌర శక్తి ప్లాంట్ల ద్వారా వారే సమకూ ర్చుకోవడం వలన రాష్ట్రానికి అదనపు విద్యుత్ భారం ఉండదు. గ్లోబల్ నెట్‌వర్క్‌తో సముద్ర గర్భ, భూభాగపు కేబుల్ ద్వారా అనుసంధానించి, క్లీన్ ఎనర్జీతో పనిచేసే విధంగా గూగుల్ ఏఐ హబ్ డిజైన్ చేశారు.
ఉత్పత్తి పరిమాణం పెరగడంతో..
భారతదేశం ప్రపంచ డేటాలో 20 శాతం ఉత్పత్తి చేస్తున్న ప్పటికీ, డేటా సెంటర్ సామర్థ్యంలో దాని వాటా కేవలం 3 శాతం మాత్రమే. ప్రభుత్వం కార్యక్రమాలు, ఇంటర్నెట్ విస్తరణ, స్మార్ట్‌ఫోన్లు, ఈ-కామర్స్, వేగంగా డిజిటల్ సేవల విస్తరణ వలన డేటా ఉత్పత్తి పరిమాణం విపరీతంగా పెరుగుతోంది. వివిధ రంగాల వ్యాపార సంస్థలు క్లౌడ్ సేవలు, ఏఐ, బిగ్ డేటా అనలిటిక్స్‌ను వేగంగా స్వీకరిస్తున్నాయి. దీనివల్ల బలమైన డేటా సెంటర్ అవసరం మరింత పెరుగుతోంది. నవీ ముంబై ప్రస్తుతం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మూడవ అతిపెద్ద డేటా సెంటర్ మార్కెట్‌గా ఎదిగి షాంఘై, టోక్యో తర్వాత మూడవ స్థానంలో ఉంది. 2025 మార్చి నాటికి, భారతదేశంలో సుమారు 1,352 మెగావాట్లుగా ఉన్న మొత్తం డేటా సెంటర్ సామర్థ్యం.. 2030 నాటికి 4.5 గిగావాట్లు లేదా అంతకంటే ఎక్కువకు చేరుకోవచ్చనే అంచనాను విశాఖ సాకారం చేస్తోంది.
ఈ హబ్.. అవకాశాల గని!
డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి కావలసిన అతి ముఖ్యమైన అంతర్జాతీయ కేబుల్ లాండింగ్ స్టేషన్, సబ్ సీ కేబుల్ నెట్‌వర్క్ ముంబై, చెన్నై తరువాత విశాఖలో ఏర్పాటు కావడం వలన ఆసియా ఫసిఫిక్, అమెరికా దేశాలకు నేరుగా అనుసంధానించబడి విశాఖ ప్రపంచ స్థాయి కనెక్టివిటీ హబ్‌గా అభివృద్ధి చెందుతుంది. గూగుల్, టాటా గ్రూప్, అదానీ స్థాపిస్తున్న 3.5 గిగావాట్ల డేటా సెంటర్లతో విశాఖ భారతదేశ డిజిటల్ గేట్ వేగా రూపు దిద్దుకునే అవకాశం ఉంది. అమెరికా తర్వాత ప్రపంచంలో గూగుల్ నిర్మించబోయే అతిపెద్ద ఏఐ హబ్ అత్యాధునిక ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ సామర్థ్యం, భారీ స్థాయి ఇంధన వనరులు, ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌లను ఒకేచోట సమన్వయ పరిచి విశాఖను కృత్రిమ మేధ పరి వర్తన కేంద్రంగా నిలబెడుతుంది.
స్కిల్ డెవలప్‌మెంట్‌పై దృష్టి పెట్టాలి!
డేటా సెంటర్లు ఏర్పాటు అవుతుండటం వలన ఏఐ పరిశోధనలు, నిర్వహణ, అనుభవం ఉన్న మానవ వనరుల అవసరం చాలా ఎక్కువ. కనీసం లక్షన్నర పైగా ఉద్యోగాలు గూగుల్ ఏఐ హబ్ వలన లభించవచ్చు. అందుకే ప్రభుత్వం గూగుల్ ఏఐ హబ్ నిర్మాణానికి సమాంతరంగా స్కిల్ డెవలప్‌మెంట్ మీద మరింత దృష్టి పెట్టాలి. స్థానికంగా ఏఐ ఎకోసిస్టమ్ సృష్టిస్తే, మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు విశాఖ వైపు ఆకర్షితమవుతాయి. ఇప్పటికే గూగుల్ భారత్‌ను ఔట్ సోర్సింగ్ కేంద్రంగా కాకుండా, తన ప్రధాన ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటిగా చూస్తోంది. ఇక వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా గూగుల్ వంటి సంస్థలు భారత్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, శిక్షణ, ప్రమాణాలు, సాంకేతిక ఆవిష్కరణలు తీసుకురావడం ద్వారా దేశ ఆర్ధిక వృద్ధికి తోడ్పడటమే కాకుండా స్థానిక పరిశ్రమకు లాభం కలిగిస్తాయి. గూగుల్ విశాఖ కేంద్రం విజయవంతమైతే, గ్లోబల్ టెక్నాలజీ లీడర్‌గా, ప్రపంచ ఏఐ శక్తిగా భారత స్థానం సుస్థిరం కావడం ఖాయం.
-లింగమనేని శివరామ ప్రసాద్
రాజకీయ, సామాజిక విశ్లేషకులు
79813 20543






