- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మలక్‌పేట నుంచి వర్జీనియాకి.. గజాలా హష్మీ చరిత్రాత్మక పయనం
తొలి అడుగులు... చరిత్ర సృష్టించే పయనం! హైదరాబాద్‌లోని మలక్‌పేటలో మొదలైన ఒక చిన్నారి ప్రయాణం, అమెరికాలోని వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ పదవి వరకు సాగింది.

తొలి అడుగులు... చరిత్ర సృష్టించే పయనం! హైదరాబాద్‌లోని మలక్‌పేటలో మొదలైన ఒక చిన్నారి ప్రయాణం, అమెరికాలోని వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ పదవి వరకు సాగింది. ఆమే గజాలా హష్మీ. ఆమె విజయం కేవలం ఒక ఎన్నికల గెలుపు కాదు, అది కలలకు హద్దులు లేవని నిరూపించే ఒక చారిత్రక ఘట్టం, అసంఖ్యాక ప్రజలకు స్ఫూర్తినిచ్చే విజయగాథ!
చరిత్రలో చెరగని ముద్ర
గజాలా హష్మీ... ఈ పేరు వర్జీనియా రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలికింది. ఆమె ఆ రాష్ట్ర మొదటి ముస్లిం, మొదటి దక్షిణాసియా అమెరికన్, పైగా ఆ పదవిని చేపట్టిన మొదటి భారతీయ సంతతి మహిళగా చరిత్ర సృష్టించారు. 61 ఏళ్ల వయసులో, ఆమె రిపబ్లికన్ జాన్ రీడ్‌ను ఓడించి, వర్జీనియాకు లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ఆరు సంవత్సరాల క్రితం, వర్జీనియా రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికైనప్పుడు కూడా ఆమె మొదటి ముస్లిం - అమెరికన్, మొదటి భారతీయ - అమెరికన్‌గా రికార్డు సృష్టించారు.
ట్రంప్‌కు ఎదురుదెబ్బ
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏదో ఒక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. ఆయన తీసుకునే నిర్ణయాల పట్ల అమెరికన్లకు విసుగొచ్చినట్టుంది.. అందుకే తొలిసారి ట్రంప్‌కు భారీ దెబ్బే వేశారు. అమెరికాలో జరిగిన మూడు ఎన్నికల్లో రిపబ్లికన్లను ఓడించి డెమోక్రాట్లను గెలిపించారు. హైదరాబాదులోని మలక్ పేటకు చెందిన మహిళ వర్జీనియా స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా గెలవడం అమెరికన్ రాజకీయాల్లో అరుదైన విషయం.
విద్యతో సాగిన ప్రయాణం..
1964లో హైదరాబాద్‌లో జన్మించిన గజాలా హష్మీ, చిన్నతనంలోనే తన తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లారు. ఆమె ప్రయాణం సామాజిక న్యాయం పట్ల బలమైన నిబద్ధతతో, విద్య ద్వారా సాధికారత అనే విలువపై ఆధారపడింది. జార్జియా సదరన్ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, అట్లాంటాలోని ఎమోరీ విశ్వవిద్యాలయం నుండి అమెరికన్ సాహిత్యంలో పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు. దాదాపు 30 సంవత్సరాలు ఆమె ప్రొఫెసర్‌గా, విద్యావేత్తగా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు. రిచ్‌మండ్ విశ్వవిద్యాలయంలో, రేనాల్డ్స్ కమ్యూనిటీ కళాశాలలో బోధించారు, అంతేకాక సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ (CETL)ను స్థాపించి, నాయకత్వం వహించారు. ఒక విద్యావేత్తగా ఆమె సేవలు సమాజం పట్ల ఆమె అంకిత భావాన్ని తెలియజేస్తాయి.
సేవలో స్ఫూర్తి..
ప్రొఫెసర్‌గా ఉన్న గజాలా హష్మీ, అమెరికా రాజకీయాల్లోకి అడుగుపెట్టింది కేవలం అధికారం కోసమే కాదు, సామాజిక న్యాయం, మార్పు కోసం. ప్రజలకు సేవ చేయాలనే బలమైన సంకల్పంతోనే ఆమె ప్రజా జీవితంలోకి వచ్చారు. ప్రజా విద్య, ఓటింగ్ హక్కులు, పర్యావరణం, చవకగా ఆరోగ్య సంరక్షణ, గన్ హింస నివారణ వంటి ముఖ్య అంశాలను తన శాసన ప్రాధాన్యతలుగా ఎంచుకున్నారు. రాష్ట్ర సెనేటర్‌గా, గృహనిర్మాణం, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి విషయాలలో అసమానత సమస్యలపై దృష్టి సారించి, ఇతరుల జీవితాలను మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేశారు. ఆమె తన పోరాటాన్ని సెనేట్ విద్య, ఆరోగ్య కమిటీ చైర్‌పర్సన్‌గా కొనసాగిస్తున్నారు.
ఆమె విజయం - ప్రతీ ఒక్కరికీ ఓ సందేశం!
మలక్‌పేట నుండి వర్జీనియా వరకు సాగిన గజాలా హష్మీ ప్రయాణం, పట్టుదల, నిజాయితీ మరియు సేవా నిబద్ధత ఉంటే, ఏ నేపథ్యం నుండి వచ్చిన వారైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరని నిరూపించింది. ఈ విజయగాథ ఎందరో ప్రవాసులకు, యువతకు, ముఖ్యంగా మహిళలకు పెద్ద కలలు కనడానికి మరియు వాటిని సాధించడానికి ఒక శక్తివంతమైన స్ఫూర్తిగా నిలుస్తుంది.
-ముహమ్మద్ ముజాహిద్
96406 22076






