- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెరపై దోస్తీ.. వెనుక కుస్తీ ..ఇదే చైనా దుర్నీతి!
వాస్తవాదీన రేఖ వెంబడి 2020 నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు చరమగీతం పాడుతూ ఇండియా, చైనాలు కీలక పెట్రోలింగ్ గస్తీలు ఇక నుంచి స్వేచ్ఛగా చేసుకోవచ్చనే అంగీకారం కుదరడం ఆహ్వానించదగిన పరిణామమే..

వాస్తవాదీన రేఖ వెంబడి 2020 నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు చరమగీతం పాడుతూ ఇండియా, చైనాలు కీలక పెట్రోలింగ్ గస్తీలు ఇక నుంచి స్వేచ్ఛగా చేసుకోవచ్చనే అంగీకారం కుదరడం ఆహ్వానించదగిన పరిణామమే.. అయినా చైనా లోగుట్టును అంచనా వేయడం అతి కష్టమేనని గత చరిత్ర చెబుతోంది. గత కొన్నేళ్లుగా బీజీంగ్ ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’లో భాగంగా కొనసాగుతున్న ‘చైనా- పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అనైతిక మైత్రి వేదికగా జమ్మూ- కశ్మీర్ ప్రాంతంతో పాటు భారతదేశ నలుమూలల నుంచి చైనా భూదురాక్రమణ పర్వం కొనసాగుతున్నదనే విషయం మనందరికీ తెలుసు..
1962 నుంచి డ్రాగన్ చొరబాట్లు..
1962 ఇండో - చైనా యుద్ధం జరిగి 62 ఏండ్లు దాటుతున్నా డ్రాగన్ దుర్బుద్ధి దాహానికి అంతమే కనిపించడం లేదని జయశంకర్ ప్రకటించడం సముచితంగా ఉన్నది. 2020 నుంచి నేటి వరకు దాదాపు 2000 చ.కిమీ భారత భూభాగాన్ని చైనా ఆక్రమించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. భారత దేశానికి చుట్టూ 360 డిగ్రీల్లో ఇరుగు పొరుగు దేశాలతో చేతులు కలుపుతూ చైనా దురాక్రమణల ప్రయత్నాలు చేయడంతో పాటు దేశ భద్రతకు భంగం కలిగించే కుయుక్తులు కోకొల్లలుగా కొనసాగడం చూస్తున్నాం. చైనా అనైతిక లాబీయింగ్ పర్వాలే కాకుండా చైనా మేడ్ చవకైన వస్తువులు ఇప్పటికే భారత్ మార్కెట్‌లోకి చొరబడి మన ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి పావులు కదపడం దశాబ్దాలుగా సాగుతున్నది. నేడు అంతర్జాతీయ వేదికపై యూఎస్, యూరోప్ దేశాల ఒత్తిడితో చైనా కొంత వెనకడుగు వేస్తున్నప్పటికీ డ్రాగన్ దురాక్రమణల కాళ్లకు పూర్తిగా బంధాలు వేయలేక పోతున్నట్లు విధితమవుతున్నది.
గాల్వాన్ లోయ సాక్షిగా పెరిగిన ఉద్రిక్తతలు..
జూన్ 2020లో లడక్ గల్వాన్ లోయలో చేసిన చైనా దురాక్రమణ సాహసానికి కల్నల్‌తో సహా 20 మంది భారతీయ జవాన్లు, అధిక సంఖ్యలో 45కు పైగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఏ) జవాన్లు ప్రాణాలు కోల్పోవడం చూసాం. భారత్ తన భూభాగాన్ని కావాడుకోవడానికి ఉపేక్షించకుండా తగు కఠినమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని గమనించాలి. భారత్ చుట్టూ ఉన్న చిన్నచిన్న అభివృద్ధి చెందుతున్న దేశాల అంతర్గత బలహీనతలను సొమ్ము చేసుకుంటూ, వారికి ఆర్థిక సహాయం చేస్తామనే ముసుగులో వారిని కొంగు ముడేసుకొని భారత్‌పై దురాక్రమణల పర్వానికి తెరలేపడంతో తన దేశ సరిహద్దులను కాపా డుకోవడానికి భారత్ అహరహం భద్రత విషయంలో అతి జాగ్రత్తగా ఉండాల్సి వస్తున్నది. జమ్మూ-కశ్మీర్, అరుణాచల్, లడక్ ప్రాంతాల్లో చైనా భారత్‌ల మధ్య అర్థం లేని భూవి వాదాలు నిత్యం రగులుకుంటూనే ఉన్నాయి. బీజింగ్ దూకుడుకు ముకుతాడు వేసే ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సి ఉంటుందని భారత విదేశాంగ నిపుణులు సూచిస్తున్నారు.
దేశం అన్ని విధాలా ఎదగాలి..
తన దేశ ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమాధికారాలకు భంగం కలుగకుండా భారత్ స్పష్టమైన విదేశాంగ విధానంతో ముందుకు సాగాల్సి ఉంది. చైనా దూకుడును ముందే పసిగట్టి విరుగుడు మంత్రాంగం అమలు చేయాలని, దక్షిణ ఆసియా ప్రాంత దేశాల్లో చైనాకు దిటుగా బలమైన శక్తిగా భారత్ ఎదగాలని, చైనా ఉత్పత్తుల దిగుబడుల వరదలను క్రమంగా కత్తిరించడం జరగాలని, ముందు ముందు జరగనున్న ప్రపంచ దేశాల సదస్సు సాక్షిగా ఇరు దేశాల మధ్య ‘వాస్తవాధీన రేఖ’ లేదా ‘ఎల్ఏసి’పై చర్చల ద్వారా సరైన పరిష్కారాలు వెతకాలని, భారత్ కన్న చైనా పై చేయిగా ఉందనే దుస్థితిని రూపుమాపాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు.
-డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి
99497 00037






