- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉచిత బస్సు.. స్త్రీ భవితకు కొత్త వెలుగు
ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమం. ఢిల్లీలో మొదలైన ఈ పథకం

ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమం. ఢిల్లీలో మొదలైన ఈ పథకం దక్షిణాది రాష్ట్రాలలోనూ గేమ్ చేంజర్‌గా మారింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల సమయంలో ఉచిత బస్సు పథకం కల్పిస్తామని చెప్పిన పార్టీలు, ఆ తర్వాత ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టి అధికార పగ్గాలు చేపట్టాయి. ఇదే సంప్రదాయం ఏపీలోనూ కొనసాగింది. సూపర్ సిక్స్ హామీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్ట్ 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. తెలంగాణలో మహాలక్ష్మి పథకం పేరుతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మహిళలకు అందుబాటులో ఉంది. ఏపీలో స్త్రీ శక్తి పేరుతో దీనిని అమలు చేస్తున్నారు.
ఆగస్టు 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో కొత్త అధ్యాయానికి సాక్షిగా నిలిచింది. స్త్రీ శక్తి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక ప్రయాణ సదుపాయం మాత్రమే కాదు. ఇది మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన, సమాజంలో లింగ సమానత్వం వంటి అంశాల్ని బలపరచే పెద్ద అడుగుగా భావించాలి. ఈ పథకం ద్వారా మహిళలు, ట్రాన్స్‌జెండర్‌లు ఏపీఎస్‌ఆర్‌టీసీకి చెందిన పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చు.
ఏపీఎస్ఆర్టీసీపై వార్షిక భారం
ఆర్థికంగా చూస్తే, ఈ పథకం APSRTCపై సుమారు రూ.1,950 కోట్లు వార్షిక భారం వేసే అవకాశం ఉంది. దీనిలో ఉచిత టికెట్ల విలువ రూ.1,453 కోట్లు కాగా, నిర్వహణ ఖర్చులు రూ.201 కోట్లు. ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఏపీఎస్ఆర్టీసీకి తిరిగి చెల్లించనుంది.
ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు..
ఇప్పటికే 8,459 బస్సులను ఈ పథకానికి కేటాయించి, 700 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేశారు. రాబోయే రెండు సంవత్సరాల్లో మరో 1,400 బస్సుల కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. ఈ పథకం వల్ల మహిళల ప్రయాణ శాతం గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం ఆర్‌టీసీల్లో ప్రయాణిస్తున్నవారిలో 40% మహిళలు కాగా, ఇది 67%కి పెరగవచ్చని అంచనా.
మహిళల ఆర్థిక స్వతంత్రత
ఈ మార్పు తాత్కాలిక ప్రయోజనానికి పరిమితం కాదు. ఇది ఉద్యోగం, విద్య, వ్యాపారం వంటి రంగాల్లో మహిళల పాల్గొనదలచిన సమర్థతను పెంచుతుంది. రోజువారీ బస్సు ఛార్జీలు ఆదా కావడం వల్ల, ఆ డబ్బును కుటుంబ ఖర్చులు, పిల్లల చదువు, ఆరోగ్య సంరక్షణ వంటి అవసరాలకు వినియోగించవచ్చు. ఇదే మహిళల ఆర్థిక స్వతంత్రతను మన్నించే దారిగా నిలుస్తుంది. భద్రత కోణంలోనూ ప్రభుత్వం నూతన చర్యలు తీసుకుంటోంది. మహిళా కండక్టర్లకు బాడీ వార్న్ కెమెరాలు, బస్సుల్లో సీసీ కెమెరాలు అమరికతో పాటు, బస్ స్టేషన్లలో ఫ్యాన్లు, కుర్చీలు, తాగునీరు, శౌచాలయాల వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
సంస్థ ఆదాయం కోల్పోవద్దంటే..
స్త్రీ శక్తి పథకం మహిళల ప్రయాణ సౌకర్యానికి దోహదపడగా, పురుష ప్రయాణికుల వల్ల సంస్థ ఆదాయం కోల్పోకుండా ఉండాలంటే పురుషులకు ఆదనపు బస్సు సౌకర్యాలు కల్పించాలి. ఆటో, టాక్సీ డ్రైవర్ల ఆదాయ నష్టాన్ని తగ్గించేందుకు సబ్సిడీలు, రుణాలు ఇవ్వాలి. ఈ చర్యల ద్వారా మహిళల సాధికారతతో పాటు పురుష ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు కూడా నష్టపడకుండా, సమతౌల్యమైన వాహన వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు.
మహిళల భవితకు వెలుగు..
అయితే ఈ పథకం రాష్ట్రానికి కొంత ఆర్థిక భారం తెచ్చిపెడుతుందన్నది తథ్యం. సేవల నాణ్యత తగ్గే ప్రమాదం ఉంది. బస్సుల్లో రద్దీ పెరగవచ్చు. పురుషుల ప్రయాణశాతం తగ్గి ప్రైవేట్ వాహనాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడవచ్చు. అలాగే, పథకం దుర్వినియోగం జరగకుండా పర్యవేక్షణ, నియంత్రణ కీలకం. దీన్ని ఒక సంక్షేమ పథకంగా మాత్రమే చూడకూడదు. ఇది మహిళల భవిష్యత్తును వెలుగు చూపే మార్గం. ఈ పథకం విజయవంతం కావాలంటే పక్కా ప్రణాళిక, సమర్థవంతమైన అమలు, సమగ్ర పర్యవేక్షణ అవసరం. ప్రభుత్వానికి ఇది తక్షణ ఆర్థిక భారంగా ఉన్నా, దీర్ఘకాలంలో సామాజికంగా, ఆర్థికంగా రాష్ట్రానికి గొప్ప లాభాన్ని తెచ్చిపెడుతుంది. మొత్తానికి, స్త్రీ శక్తి పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళా సాధికారత పట్ల చూపుతున్న ఆత్మీయతకు ప్రతిరూపం. ఇది ఒక ప్రయాణ సదుపాయం కాదు మహిళల పురోగతికి, సమాజ సమతా స్థితికి, సమగ్ర అభివృద్ధికి దోహదపడే సామాజిక విప్లవానికి నాంది.
‘స్త్రీ శక్తి’.. అద్భుత రెస్పాన్స్
ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఉచిత బస్సు పథకానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం 30 గంటల్లో ఏపీ ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికులు 12 లక్షల మందికి పైగా ఉచితంగా ప్రయాణించారని ప్రభుత్వ వర్గాల సమాచారం. పథకం తొలిరోజే ఉచిత బస్సు ప్రయాణాలతో మహిళలు రూ.5 కోట్ల మేర ఆదా చేసుకున్నారు. ఆధార్, ఓటరు, రేషన్ కార్డు చూపించి బస్సులో ప్రయాణించొచ్చు. 'స్త్రీ శక్తి' పథకం ద్వారా దాదాపు 2.62 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుండగా, పథకం అమలు వల్ల ప్రభుత్వంపై ప్రతి ఏటా 1,942 కోట్ల భారం పడనుంది. ఉచిత బస్సు ప్రయాణాన్ని ట్రాన్స్‌జెండర్లకు సైతం వర్తింపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
శ్రీధర్ వాడవల్లి
99898 55445






