కన్నీటి సుడిలో రైతులు.. నిందితుల రక్షణలో సీఎం జగన్

by Disha Web Desk 13 |
కన్నీటి సుడిలో రైతులు.. నిందితుల రక్షణలో సీఎం జగన్
X

వివేకా హత్య కేసులో చిక్కుకున్న నిందితులను కాపాడటంపై చూపిస్తున్న పట్టుదల, ప్రేమ, అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంపై చూపడంలేదు జగన్ ప్రభుత్వం. వివేకా హత్య కేసులో నిందితులకు న్యాయ సహాయం అందించే క్రమంలో జగన్ రెడ్డి ప్రభుత్వ పాలనను ఆసాంతం పక్కన పడేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి. పాలన పడకేసిన విషయం బయటకు పొక్కకుండా రోజూ వివిధ శాఖలపై మొక్కుబడి సమీక్షలు జరుపుతున్నారు. ఏ క్షణంలోనైనా అవినాశ్‌ను సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉండడంతో ముఖ్యమంత్రి ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. వివేకా హత్య పరిణామాలు జగన్‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి అనడంలో సందేహంలేదు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అకాల వర్షాలకు చేతికొచ్చిన పంటలు నీటమునిగి రైతులు కన్నీరు మున్నీరు అవుతుంటే ప్రభుత్వం మాత్రం పట్టనట్లు వివేకా హత్య పరిణామాల నుండి ఎలా బయట పడాలన్న ప్రయత్నాలు బలంగా చేస్తుంది.

రాష్ట్రంలో కష్టాల్లో వున్న రైతులను ఆదుకొనే దిక్కు లేదు. ఆరుగాలం శ్రమించి, అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి పండించిన పంటలు చేతికి వస్తున్న సమయంలో అకాల వర్షాలు విరుచుకు పడి పంటలు నీటి పాలు కావడంతో రైతుల ఆశలు అడియాసలయ్యాయి. ఏటా ప్రకృతి ప్రకోపానికి పంట చేతికొచ్చిన తరుణంలో వచ్చిన అకాల వర్షాలకు పంటలు దక్కక పోగా, పెట్టిన పెట్టుబడులు కోల్పోయి అప్పుల పాలు అవుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.


మారుతున్న వాతావరణ పరిస్థితులు వ్యవసాయరంగ మనుగడకే ముప్పుగా పరిణమిస్తున్నాయి. రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాలకు పైగా పంటలు నీటమునిగి తీవ్ర నష్టం జరిగినట్లు సమాచారం. నిండా మునిగి దిక్కుతోచని స్థితి లో పడిన అన్నదాతని ఉదారంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం అడ్రస్ లేదు. అన్నదాతకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం వారిని గాలికి వదిలేసింది. కనీసం రైతులను పరామర్శించిన దిక్కు లేదు. మంత్రులు అందరూ రజనీ కాంత్‌ను, చంద్రబాబుని తిట్టే పనిలో వున్నారు.

వరుస అకాల వర్షాలు..

రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలకు వరి మిరప, పసుపు, తదితర పంటలు, మామిడి, బొప్పాయి, అరటి ఇతర ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. అక్కడక్కడా వడగళ్లు పడడంతో గాలులకు మామిడికాయలు నేలరాలాయి. మార్చిలో కురిసిన అకాల వర్షాలకే రైతులు తీవ్రంగా నష్టపోగా దానినుంచి కోలు కోకముందే ఏప్రియల్‌లో వచ్చిన అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. మార్చిలో దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించలేదు ప్రభుత్వం. అంతేకాదు ఇప్పటివరకు ఎంత విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయో కూడా అంచనా వెయ్యలేదంటే జగన్ ప్రభుత్వానికి రైతులంటే ఎంత లెక్కలేనితనమో అర్ధం అవుతుంది. రబీ వరిసాగు చేసి కోసిన పరి పంట పనలు నీటమునిగి తేలియాడుతున్నాయి. కోతకు వచ్చిన వరి వర్షానికి గాలులకు,రాళ్ళ వర్షానికి ఒరిగిపోయి నీటమునిగింది. కొన్ని చోట్ల వర్షాలకు ముందు కోసి నూర్పిడి చేసి అరబెట్టిన ధాన్యం లక్షల టన్నుల తడిచి ముద్ద అయింది. కళ్లాల్లో ఆరబెట్టిన మిర్చి, పసుపు, ఉద్యాన పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది.

వర్షాలకు ఒక్కొక్క రైతు ఎకరాకు రూ 30 వేల నుండిరూ లక్ష వరకు నష్టపోయారు. రైతులకు మద్దతు ధర దక్కడంలేదు. ఆర్బీకేలు వైసీపీ నేతల అవినీతికి కేంద్రాలుగా మారాయి. తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చెయ్యాలని రైతులు కోరుతున్నారు. కష్టపడి పండించి పంటలు కళ్ల ఎదుటే తడిసిపోతున్నా రైతులు ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారు. పంటలు కోల్పోయిన రైతుల ఆవేదన అంతులేనిది. రైతులకు కష్టాలే పెట్టుబడి, కన్నీళ్లే దిగుబడిగా మారింది. రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయింది. రూ 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తు నిధిని ఏర్పాటు చేస్తామని, రూ 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామన్న జగన్ ప్రభుత్వ హామీ ఏమైందో తెలియదు.

ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఒక పక్కన అకాల వర్షాలు విరుచుకు పడుతున్నాయి. నూర్చిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టలేక, పరదాలకు అద్దెలు చెల్లించలేక వచ్చిన ధరకు రైతులు అమ్ముకొంటున్నారు. రాష్ట్రంలో నేటికీ ప్రధాన పంట వరి. దీనిని పండించే వారిలో అత్యధికులు కౌలు రైతులే. నిజమైన ఈ సాగుదార్ల పేర్లు ఇ- క్రాప్‌ బుకింగ్‌లో ప్రభుత్వం నమోదు చేయడం లేదు. భూ యజమానుల పేర్లు అందులో నమోదు చేయడంతో కౌలుదారులు పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్ముకోలేక కమిషన్‌ ఏజెంట్లు, మిల్లర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతున్నారు.

చేసిన సాయం కంటే వంచనే జాస్తి..

జగన్మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయం గాలిలో దీపమైంది. విత్తనం వేసిన దగ్గర నుండి ఉత్పత్తులు మార్కెట్‌లో అమ్ముకోనే దాకా ప్రతి దశలోనూ రైతులను చెయ్యి పట్టి నడిపిస్తానని బులిపించి అధికారంలోకి వచ్చిన జగన్ జమానాలో రైతులకు చేసిన సాయం కంటే చేసిన వంచనలే ఎక్కువని చెప్పాలి. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత అప్పులు ఊబిలో కూరుకుపోయి దిక్కులు చూస్తున్నాడు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు రైతులను మభ్యపెట్టడానికే తప్ప వారిని ఆదుకొనేవి కావు. పకృతి పగ, ప్రభుత్వ దగా రైతులోకాన్ని అతలాకుతలం చేస్తోంది.

జగన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో ఇన్ సబ్సిడీ కింద రైతులకు ఇచ్చింది కేవలం రూ.1911 కోట్లు మాత్రమే. రైతులు దాదాపు రూ 20 వేల కోట్ల పంట ఉత్పత్తులు నష్టపోయారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో రూ 3,759,51 కోట్లు చెల్లించడం జరిగింది. ఒక్క 2016-17 లోనే రూ 1820 చెల్లించడం జరిగింది. నేడు ఈ- క్రాప్ నమోదుతో పాటు అనేక కొర్రీలతో రైతులకు పరిహారంలో కోతపెడుతున్నారు. 33 శాతం పంట నష్టపోతేనే పంట పరిహారం చెల్లిస్తున్నారు.

వ్యవసాయ రంగానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాం అంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తున్నా ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది రైతుల దుస్థితి. రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్నాం అని ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకొంటున్నా ఆ సాయం ఏ మూలకూ చాలని పరిస్థితులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దేశంలోనే రైతు, వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో రాష్ట్రంగా నిలవగా, నేషనల్ శాంపిల్ సర్వే రైతు రుణగ్రస్తులున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కితాబు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో సగటున ఒక్కొక్క రైతుపై రూ 2,45 లక్షల మేరకు రుణం ఉండగా, అదే తెలంగాణలో 1,52 లక్షల మాత్రమే వున్నది. రాష్ట్రంలో వరుస రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాపెట్టుబడి సాయం చేస్తున్నాం అని, ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నాం అని ప్రగల్భాలు పలకడం తప్ప నిండు ప్రాణాలు తీసుకుంటున్న రైతుల దుస్థితిని, రోడ్డున పడుతున్న రైతు కుటుంబాల జీవన స్థితిగతుల గురించి ప్రభుత్వం మచ్చుకైనా స్పందించడం లేదు.

నాలుగేళ్లుగా వర్షాలు.. కానీ సంక్షోభమే..

రాష్ట్రంలో నాలుగేళ్లుగా వర్షాలు సమృద్ధిగా పడినా, వ్యవసాయానికి అనుకూల వాతావరణం వున్నా వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టింది జగన్ ప్రభుత్వం. గత టీడీపీ ప్రభుత్వం రైతాంగానికి భూసార పరీక్షలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలు, కల్తీలేని, కొరత లేకుండా ఎరువులు, 7 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు, నీరు-మీరు కింద వాటర్ షెడ్ పధకాలు, సాగునీటి సంఘాలు ద్వారా వాటర్ మేనేజ్ మెంట్, పంట కుంటలు, వ్యవసాయ యాంత్రీకరణ యంత్రాలు, రైతు మిత్ర గ్రూపులు ఏర్పాటు, పంటల బీమా, వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకం, తోటల పెంపకం, మైక్రో ఇరిగేషన్ అమలు వంటి పథకాలు అమలు చేసింది.

వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు తగ్గించి దిగుబడులు పెంచేందుకు అత్యాధునిక వ్యవసాయం ఆవిష్కరణకు చంద్రబాబు ప్రభుత్వం కృషి చేసింది. సాగు బాగే లక్ష్యంగా సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అయిదేళ్లలో సాగు నీటి రంగానికి రూ.70 వేలకోట్లు ఖర్చు చేసింది. వ్యవసాయానికి, రైతులకు వెన్నుదన్నుగా నిలవడం కోసం చంద్రబాబు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డింది. కానీ జగన్ ప్రభుత్వం వ్యవసాయానికి పైపై మెరుగులు దిద్ది రైతులను ఉద్దరించినట్లు దగా చేస్తున్నారు. కావున ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత ప్రకటనలను రైతులు గుర్తించాలి. జగన్ రెడ్డి అసమర్ధ పాలనలో రైతు లోగిళ్ళలో చీకట్లు అలుము కొన్నాయి. రైతుల గురించి జగన్ రెడ్డి చెప్పింది కొండంత, చేసింది గోరంత అని చెప్పాలి. ఏది ఏమైనా రైతులు కన్నీటి సుడిలో ఉంటే, జగన్ ప్రభుత్వం వివేకా హత్య నిందితులను రక్షించే పనిలో వుంది.

నీరుకొండ ప్రసాద్,

9849625610




Next Story

Most Viewed