- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన జీవితానికి ఆధారం కుటుంబం!
కుటుంబ విలువలు, తల్లిదండ్రుల ప్రేమ, మనిషి జీవితంలో సంబంధాల ప్రాముఖ్యత గురించి తెలియజేసే భావోద్వేగ వ్యాసం. డబ్బు కంటే మనిషి ప్రాణం, ప్రేమ, బంధాల విలువ ఎంత గొప్పదో వివరిస్తుంది.

“కుటుంబమే మన మొదటి పాఠశాల, తల్లిదండ్రులే మన మొదటి గురువులు” అనే మాట ఒక సామెత మాత్రమే కాదు, మన జీవిత సత్యం. మనం ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, మంచి చెడు ఏమిటో తెలుసుకునే స్థలం కుటుంబమే. కానీ నేటి ఆధునిక ప్రపంచంలో మనం చాలా విషయాల్లో ముందుకు వెళ్లినా, కుటుంబ విలువల విషయంలో మాత్రం కొంత వెనక్కి వెళ్లుతున్నాం అనే బాధాకరమైన నిజం మన ముందుంది.
వారు కోరేది చిరు పరామర్శే..
ఒక రోజు తల్లిదండ్రులు వృద్ధులవుతారు.. వారి చేతులు బలహీనపడతాయి.. కళ్లు మందగిస్తాయి.. అప్పుడు వారికి అవసరమయ్యేది డబ్బు కాదు, పిల్లల ప్రేమ, పరామర్శ. తల్లి తండ్రి కష్టాన్ని అర్థం చేసుకోలేని పిల్లలు మానవత్వం లేని వారిగా మారే ప్రమాదం ఉంది. చిన్నప్పటి నుండి అల్లారుముద్దుగా పెంచితే, బాధ్యత తెలియని పిల్లలు తయారవుతారు. అందుకే కష్టంతోనే పెంచి, బాధ్యత తెలియజేసి, డబ్బు విలువ కూడా నేర్పించడం నేటి తరానికి చాలా అవసరం.
డబ్బుతో కొనలేనివి..
మన కుటుంబం, మన విలువలు, మన సంప్రదాయం, కట్టుబాట్లు.. ఇవన్నీ మన కోసమే. ఒకసారి తల్లి వల్లనో తండ్రి వల్లనో తప్పు జరిగితే, ఆ పిల్లల కన్నీళ్లు, తల్లిదండ్రుల బాధ.. ఇవి ఏ డబ్బుతోనూ కొనలేం. ఈ విషయం ఒకసారి ఆలోచిస్తే, తప్పటడుగు వేసే వారు ఆ అడుగు వేయగలరా? మరొక బాధాకరమైన మార్పు ఏమిటంటే పక్క మనిషి బాధను పట్టించుకోకపోవడం. ఒకప్పుడు పక్కింట్లో ఎవరికైనా కష్టం వస్తే, అందరూ కలిసి సహాయం చేసేవారు. కానీ ఇప్పుడు చాలా మంది తమ పనుల్లో మాత్రమే బిజీగా ఉండి, ఇతరుల సమస్యలను పట్టించుకోవడం తగ్గిపోయింది. మనిషి మనిషికి దూరమవుతున్నాడు.. హృదయాలు దగ్గరగా ఉండాల్సిన చోట గోడలు పెరుగుతున్నాయి.
మనిషి ప్రాణానికి విలువ ఇద్దాం..!
ఈ రోజుల్లో చాలా మంది డబ్బు ఉంటే గౌరవం ఇస్తున్నారు, లేకపోతే అసలు మనిషిగా కూడా చూడటం లేదు. డబ్బు ఉంటేనే విలువ, లేకపోతే బతికే అర్హత లేనట్టుగా చూడటం ఒక ప్రమాదకరమైన ధోరణి. ఇది సమాజంలో అసమానతలు, బాధలు పెరగడానికి కారణం అవుతోంది. మనిషి ప్రాణం కంటే డబ్బు పెద్దది కాదు. డబ్బు మన జీవితంలో అవసరం, కానీ అది మనిషి ప్రాణం కన్నా గొప్పది కాదు. డబ్బు పోతే మళ్లీ సంపాదించవచ్చు, కానీ ఒక మనిషి ప్రాణం పోతే తిరిగి రాదు. తల్లిదం డ్రులను గౌరవించడం, భార్యాభర్తల మధ్య నమ్మకాన్ని కాపాడుకోవడం, ఇతరుల బాధను అర్థం చేసుకోవడం, డబ్బు కంటే మనిషి ప్రాణానికి విలువ ఇవ్వడం.. ఇవన్నీ కలిసి ఒక మంచి కుటుంబాన్ని, మంచి సమాజాన్ని నిర్మిస్తాయి.
కన్నీళ్లు తుడిచేది మన కుటుంబమే!
ఈ రోజుల్లో మనం డబ్బు కోసం పరుగులు తీస్తూ, సంబంధాలను మర్చిపోతున్నాం. కానీ ఒకసారి మన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే కష్ట సుఖాల్లో మన వెంట నిల బడేది డబ్బు కాదు, మన కుటుంబమే అని అర్థమవుతుంది. మనకు ఆనందం వచ్చినప్పుడు చప్పట్లు కొట్టేది సమాజం కావచ్చు.. కానీ మనకు బాధ వచ్చినప్పుడు కన్నీళ్లు తుడిచేది మన కుటుంబం మాత్రమే. కాబట్టి మనం ఈ రోజు నుంచే ఒక సంకల్పం తీసుకుందాం. కుటుంబ విలువలను కాపాడుకుందాం.. సంబంధాలను ప్రేమతో నిలబెట్టుకుందాం.. మనసుతో జీవిద్దాం. ‘కుటుంబం బలంగా ఉంటే మనిషి బలంగా ఉంటాడు.. మనిషి బలంగా ఉంటే సమాజం బలంగా ఉంటుంది.’
-జి. రజని రెడ్డి
నవలా రచయిత.






