పరీక్షలో ఫెయిల్.. జీవితంలో కాదు!

by Ravi |   (  Updated:2026-04-15 01:00:43  IST  )

పరీక్షలో ఫెయిల్ అవడం జీవితంలో ఓటమి కాదు.. మార్కుల ఒత్తిడి, సమాజ అంచనాలు విద్యార్థులపై ఎంతటి ప్రభావం చూపుతున్నాయి? విద్యార్థుల ఆత్మహత్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోండి.

పరీక్షలో ఫెయిల్.. జీవితంలో కాదు!
X

పరీక్షా ఫలితాల రోజు.. కొందరి ఇళ్లలో నవ్వులు పూస్తుంటే, మరికొందరి ఇళ్లలో నిశ్శబ్దం భారంగా కూర్చుంటుంది. ‘ఫెయిల్’ అన్న చిన్న పదం యువ మనసులో ఎంత పెద్ద తుఫాను సృష్టిస్తుంది. అది కేవలం మార్కుల తేడా కాదు.. అది ఒక పిల్లాడి ఆత్మగౌరవం, ఆశలు, భవిష్యత్తుపై నమ్మకం అన్నింటినీ ఒకేసారి కుదిపేస్తుంది. ఒక పరీక్ష ఫలితం నిజంగా జీవితాన్ని నిర్ణయించగలదా? లేక మనం నిర్మించిన ఈ వ్యవస్థే ఒక యువ మనసును అంచునకు నెడుతోందా?

మన సమాజం, విద్యా వ్యవస్థ, కుటుంబాల అంచనాలు కలిసి విద్యార్థికి ఒక అప్రత్యక్ష ఒత్తిడి వలయం తయారు చేస్తున్నాయి.. ఈ వలయంలో చిక్కుకున్న విద్యార్థి, ఒక ఫలితంతో తన జీవితాన్ని కొలుస్తూ, ఓడిపోయాననే భావనతో తననే తాను శిక్షించుకుంటున్నాడు. ఇది ఒక్క వ్యక్తి విషాదం కాదు.. నిశ్శబ్దంగా పెరుగుతున్న ఒక మానసిక మహమ్మారి. ఈ నేపథ్యంలో, మనం ఒక ప్రశ్న వేసుకోవాలి.. పరీక్షలో ఫెయిల్ అయినది విద్యార్థా? లేక మన సమాజమేనా?

ప్రాణాల కంటే మార్కులే ఎక్కువా?

దేశంలో విద్యార్థి ఆత్మహత్యలు ఒక భయానక స్థాయికి చేరుకున్నాయి.. ప్రతి సంవత్సరం ఇంటర్, పదో తరగతి ఫలితాల సమయంలో ఈ ఆత్మహత్యల సంఖ్య పెరుగు తుందని ఎన్‌సీఆర్‌బీ నివేదికలు చెబుతున్నాయి.. 2022లో మాత్రమే దేశవ్యాప్తంగా 13,000కు పైగా విద్యార్థుల ఆత్మహత్యలు నమోదయ్యాయి, అంటే ప్రతి రోజూ సగటున 35 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షల ప్రెషర్ మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకంగా ఫలితాల సమయంలో ఈ సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. మన సమాజంలో ఒక ప్రమాదకరమైన భావజాలం పెరిగింది. మార్కులు = జీవితం అనే ప్రమాదకర భ్రమ, మార్కులు ఉంటేనే విలువ. ఒక విద్యార్థి ఫెయిల్ అయితే పనికిరానివాడిని, నా జీవితం ముగిసిందనే భావనలు అతని మనసులో పుడుతున్నాయి. ఇది నిజం కాదు. ఇది మనం అతనిలో నాటిన భయం. నిజానికి మన విద్యావిధానంలో పెద్ద లోపాలు ఉన్నాయి. మార్కుల ఆధారంగా ఒక్క పరీక్షతో జీవితాన్ని నిర్ణయించడం సరికాదు. దానికి తోడు కాలేజీల్లో కౌన్సిలర్లు లేకపోవడం, కోచింగ్ సంస్కృతి పెరిగి ఉదయం నుంచి రాత్రి వరకు చదువు, నిరంతర పరీక్షలు, విశ్రాంతి లేకపోవడం, విద్యార్థి ఒక యంత్రంలా మారిపోతాడు.. కానీ మనం మర్చిపోతున్నది అది యంత్రం కాదు.. ఒక మనిషి అని. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు.. వ్యవస్థా వైఫల్యం.

ఎందుకు ఈ స్థాయికి వెళ్తున్నారు?

మానసిక శాస్త్ర దృష్టికోణంలో ఒక విద్యార్థి ఫెయిల్ అయితే చనిపోవాలనే నిర్ణయం ఒక్కసారిగా తీసుకోడు. ఇది ఒక ప్రాసెస్, అందులో మొదటిది Identity Collapse (తమ విలువ మార్కులతోనే అనుకోవడం) నేను పనికిరాని వాడిననే ఆలోచనలు, దీనిని Cognitive distortion అంటారు.. రెండింటిని కలిపి Catastrophic Thinking అంటారు. అంటే ఇక నా జీవితమే ముగిసింది అనే అతిశయ భావనలు, మూడు Social Shame (సమాజ భయం) అంటే పెయిలయితే ఎవరికి ఎదురుగా నిలబడలేను అనే shame-based thinking వస్తోంది. తర్వాత Parental Pressure + Comparison ఇదీ మరి భయంకరం పక్కింటి పిల్లాడు 95% తెచ్చాడు, నువ్వు? ఈ ఒక వాక్యం చాలాసార్లు ప్రాణాలు తీస్తుంది, చరిత్రలో ఫెయిల్ అయినవాళ్లు – తరువాత ప్రపంచాన్ని మార్చినవాళ్లు ఎందరో ఉన్నారు.. పరీక్షల్లో ఫెయిల్ అవడం అంటే జీవితంలో ఫెయిల్ కాదు. ఉదాహరణకు చాలానే ఉన్నారు.. ఐన్‌స్టీన్, థామస్ అల్వా ఎడిసన్ మరి వాళ్లు అప్పుడే ఆత్మహత్య చేసుకుని ఉంటే ప్రపంచం వాళ్లను చూసేది కాదు కదా!

ఎలా అరికట్టాలి?

నిజానికి విద్యార్థి బలహీనుడు కాదు. అతడిని బలహీనుడిగా ఫీలయ్యేలా చేసినది మనం. అందుకే విద్యార్థికి నీ మార్కులు నీ విలువ కాదు.. ఈ రోజు ఫెయిల్ అయినా, రేపు గెలవచ్చు. జీవితం ఒక పరీక్ష కాదు.. అనేక అవకాశాల సమాహారమనే విషయం తెలియజెప్పాలి. ఫలితాల రోజును మానసిక అత్యవసర దినంగా చూడాలి. ప్రతి కాలేజీలో కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేసి తల్లిదండ్రులతో కలిసి ఫెయిల్ అయిన వారికి వెంటనే మార్గదర్శనం చేయాలి, రీ-ఎగ్జామ్, కెరీర్ ఆప్షన్లు గురించి వివరించాలి. ఎమోషనల్ ఎడ్యుకేషన్, స్ట్రెస్ హ్యాండ్లింగ్, ఫెయిల్యూర్‌ను తీసుకోవడం నేర్పాలి. ఒక్క పరీక్షతో భవిష్యత్తు నిర్ణయం కాకూడదు.

-డాక్టర్. హర్షిణి ఎండీ.

కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్

[email protected]

Next Story