- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చరిత్రకు సాక్ష్యాలు మ్యూజియంలు
'మై లైఫ్ ఈజ్ మై మెసేజ్'అన్నారు మహాత్మా గాంధీ. నిజమే కదా! ఒక మ్యూజియం కూడా ఎన్నో రకాల మెసేజ్‌లు ఇస్తుంది. గత చరిత్రకు తార్కాణం మ్యూజియంలు.

ప్రపంచీకరణ నేపథ్యంలో యువత సెల్‌లో మునిగిపోతున్నారు. మ్యూజియంలు దర్శించి, అనేక విషయాలు అవగాహన చేసుకోవడానికి ఆసక్తి చూపకపోవడం బాధాకరం. తల్లిదండ్రులు వారి పిల్లల అలవాట్లు, అభిరుచులు, స్నేహితులపై నిఘా ఉంచాలి. గ్రంథాలయాలు, మ్యూజియంలకు పిల్లలను తీసుకుని వెళ్ళాలి. జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలి. అదే సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మ్యూజియంల ఆవరణలు అన్యాక్రాంతం కాకుండా చూడాలి. మౌలిక సదుపాయాలు పెంపొందించాలి.
'మై లైఫ్ ఈజ్ మై మెసేజ్'అన్నారు మహాత్మా గాంధీ. నిజమే కదా! ఒక మ్యూజియం కూడా ఎన్నో రకాల మెసేజ్‌లు ఇస్తుంది. గత చరిత్రకు తార్కాణం మ్యూజియంలు. గత వైభవం తెలిపే ప్రత్యక్ష సాక్షులుగా దాదాపు అన్ని దేశాలలో వెలసిన ఈ సంగ్రహాలయాలు ఆయా దేశాల సాంస్కృతిక అంశాల ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. ఇతర దేశాలకు తమ ఔన్నత్యాన్ని చాటి చెబుతూ ఏటా కోట్ల మంది తిలకించేందుకు కారణమవుతున్నాయి. భవిష్యత్తు తరాలకు వారధిగా నిలుస్తున్నాయి. అందుచేతనే 'ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ (ఐకామ్)'ఆధ్వర్యంలో 1977 నుంచి ఏటా మే 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం జరుపుతూ సాంస్కృతిక సంబంధాలు మెరుగు పరచే దిశగా అడుగులు వేస్తున్నారు.
ప్రపంచమంతటా వ్యాపించి
ప్రపంచంలో అనేక ప్రముఖ మ్యూజియంలు ఉన్నాయి. ఫ్రాన్స్‌లో లోవ్రా, న్యూయార్క్, చైనా, రష్యాలోని హెర్మిటేజ్ మ్యూజియంలను అనేక కోట్ల మంది వీక్షిస్తూ విజ్ఞానంతోపాటు వినోదం, ఆనందం పొందుతున్నారు. ఒక్క అమెరికాలోనే ఏటా 85 కోట్ల మంది మ్యూజియంలను దర్శిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా యూరప్ ఖండంలో మ్యూజియంలను దర్శించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. విజ్ఞాన, సాంకేతిక, పారిశ్రామిక, హస్తకళ, విద్య, ఆరోగ్య, తపాలా, అటవీ, మత్స్య, గిరిజన మ్యూజియంలతో పాటు ఆర్ట్ గ్యాలరీలు పలు దేశాలలో ఏర్పాటు చేశారు. ఇవి అన్ని రకాల విషయాలు తెలుపుతూ జ్ఞానబోధ చేస్తున్నాయి.
ముఖ్యంగా ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాలు, పరస్పర సహకారం, శాంతి, గొప్పతనం, నైపుణ్యాలు నాగరికతలు తెలుపుతూ, భవిష్యత్తు గురించి నూతన ఆలోచనలు రూపుదిద్దుకొనుటకు మార్గదర్శిగా ఉంటున్నాయి. వివిధ విగ్రహాలు, సింహాసనాలు, వివిధ కాలాలలో వాడిన ఆయుధాలు, ధరించిన వస్త్రాలు, అలంకరించుకున్న ఆభరణాలు ఇలా అనేక వాటిని చూడవచ్చు. ఆనాటి నాగరికత, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంచనా వేయవచ్చు. ఇందిరాగాంధీ మరణ సమయంలో ఆమె ధరించిన వస్త్రాలు, ఆమె బతికిన కాలంలో వాడిన వస్తువులు, గ్రహించిన 'భారతరత్న'అవార్డుతోపాటు వివిధ దేశాలు బహుకరించిన అవార్డులు ఢిల్లీలో మనం చూడవచ్చు.
కళాఖండాలకు నిలయాలు
వివిధ మ్యూజియంలలో పురాతన వస్తువులు, నాణేలు, కళాఖండాలు చూడవచ్చు. గుజరాత్‌లోని 'సబర్మతి ఆశ్రమం'దర్శిస్తే హుందాగా, సామాన్యంగా మహాత్మా గాంధీ వలే బతకడానికి, పరమత సహనం, శాంతితో సమాజంలో సహ జీవనం గడపడానికి ఇష్టపడతారు. అనగా ఒక మ్యూజియం సందర్శన అంత పెద్ద మార్పునకు పూలబాట వేస్తుంది. మనదేశంలో అతి పురాతన మ్యూజియం కోల్‌కతాలోని 'ఇండియన్ మ్యూజియం'1814లో ప్రారంభమైంది. మన దేశంలోనే కాక, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అతిపెద్ద మ్యూజియంగా భాసిల్లుతోంది.
1949లో ఏర్పాటు చేసిన ఢిల్లీలోని జాతీయ మ్యూజియం, హైదరాబాద్ సాలార్‌జంగ్ మ్యూజియం, బిర్లా సైన్స్ మ్యూజియం, నాగార్జునకొండ మ్యూజియం, పాట్నాలో గాంధీ స్మృతి మ్యూజియం, తమిళనాడు, మహారాష్ట్రలోని సంగ్రహాలయాలను రోజూ వేల మంది దర్శిస్తూ అనేక విషయాలు తమ తమ మస్తిష్కంలో భధ్రపరచుకుంటున్నారు. మ్యూజియం దినోత్సవం సందర్భంగా మే 16 నుంచి 21 వరకూ సాలార్‌జంగ్ మ్యూజియం దర్శించడానికి 'ఉచిత ప్రవేశం'కల్పించుట ఆనందాయకం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి.
సెల్ ఫోన్‌లో మునిగిపోతూ
ప్రపంచీకరణ నేపథ్యంలో యువత సెల్‌లో మునిగిపోతున్నారు. మ్యూజియంలు దర్శించి, అనేక విషయాలు అవగాహన చేసుకోవడానికి ఆసక్తి చూపకపోవడం బాధాకరం. తల్లిదండ్రులు వారి పిల్లల అలవాట్లు, అభిరుచులు, స్నేహితులపై నిఘా ఉంచాలి. గ్రంథాలయాలు, మ్యూజియంలకు పిల్లలను తీసుకుని వెళ్ళాలి. జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలి. అదే సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మ్యూజియంల ఆవరణలు అన్యాక్రాంతం కాకుండా చూడాలి. మౌలిక సదుపాయాలు పెంపొందించాలి. తగిన నిధులు, సిబ్బందిని మంజూరు చేయాలి.
1956లో కేంద్ర విద్యా శాఖ కేంద్ర సలహా బోర్డు, 1984లో ఏర్పాటు చేసిన 'భారత జాతీయ సాంస్కృతిక వారసత్వ ట్రస్ట్ (ఇంటాచ్)'ఆధ్వర్యంలో దేశంలో వివిధ మ్యూజియంలో ఉన్న వసతులు, వస్తువుల పరిరక్షణ, సేకరణ వంటి విషయాలలో మరింత కృషి చేయాలి. కొత్త సంగ్రహాలయాలు ఏర్పాటు చేయాలి. ఇంటరాక్టివ్, మల్టీ మీడియా వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ రూపంలో అందరికీ ఈ సంగ్రహాలయాలు అందేటట్లు చూడాలి. మన పూర్వీకులు మనకు అందించిన సాహిత్యం, సాంస్కృతిక వారసత్వాన్ని నేటి తరానికి, వీటిని పరిరక్షించుట ద్వారా భవిష్యత్తు తరాలకు ఈ వారసత్వాన్ని అందించుటకు మనం అందరం, ప్రభుత్వాలు వారధిగా బాధ్యత స్వీకరించుటయే మన కర్తవ్యం.
(నేడు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం)
ఐ.ప్రసాదరావు
63056 82733






