చట్టాలలో అన్నీ ఉన్నా... పట్టించుకున్న వారే సున్నా

by Ravi |   (  Updated:2025-11-06 00:00:53  IST  )

సిర్పూర్ కాగజ్ నగర్‌లోని ఈ.ఎస్.ఐ. ఆస్పత్రి కార్మిక రాజ్య బీమా చట్టం వర్తించే మున్సిపల్ కార్మికులకు చికిత్స నిరాకరించిన వార్త 'దిశ'లో చదివాను.

చట్టాలలో అన్నీ ఉన్నా... పట్టించుకున్న వారే సున్నా
X

సిర్పూర్ కాగజ్ నగర్‌లోని ఈ.ఎస్.ఐ. ఆస్పత్రి కార్మిక రాజ్య బీమా చట్టం వర్తించే మున్సిపల్ కార్మికులకు చికిత్స నిరాకరించిన వార్త 'దిశ'లో చదివాను. ఇది బాధాకరమే కాక, చట్ట ఉల్లంఘన కూడా. యజమాని చందా చెల్లించకపోయినా‌ చట్టం పరిధిలో ఉన్న కార్మికులకు వైద్య చికిత్స అందించాలి.‌

ఏయే ప్రాంతాలకు ఈ చట్టం వర్తింప చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేస్తుందో, అక్కడ నెలకొన్న కర్మాగారాలు సంస్థలు ఏడాదిలో ఏదో ఒక రోజైనా, కనీసం పది మంది ఉద్యోగులను నియమిస్తే, వాటికి ఈ చట్టం వర్తిస్తుంది. ఒకసారి ఈ చట్టం వర్తిస్తే, తదనంతరం ఉద్యోగుల సంఖ్య తగ్గినా, చట్టం వర్తింపు కొనసాగుతుంది. ఐతే, ప్రస్తుత నిబంధనల ప్రకారం నెలసరి వేతనం రూ. 21,000 మించని బీమా వ్యక్తులు (ఇన్ సూర్యుడ్ పర్సన్స్) మాత్రమే ఈ చట్టం పరిధిలోకి వస్తారు.‌ వారికే గాక, బీమావ్యక్తి (ఇన్షూర్డ్ పర్సన్) భార్య లేదా భర్త, ఆ వ్యక్తిపై ఆధారపడిన మైనర్ సంతానం, చట్టబద్ధంగా దత్తత తీసుకున్నవారితో సహా, కుటుంబ సభ్యులుగా పరిగణించబడతారు.

అక్కడా నగదు రహిత ఉచిత వైద్యం

వారేకాక, బీమా వ్యక్తిపై పూర్తిగా ఆధారపడి, చదువుకుంటున్న 21 సంవత్సరాలు దాటని పిల్లలూ, లేదా ఇంకా పెళ్లి కాని కుమార్తె, ఏదైనా శారీరక లేదా మాన సిక స్థితి సరిగా లేని లేదా భిన్న ప్రతిభావంతులైన సంతా నం, అన్ని మార్గాల ద్వారా నెలకు రూ. 9,000 కు మించని ఆదాయం గల తల్లిదండ్రులు, పెళ్లి కాని బీమా వ్యక్తి తల్లిదండ్రులు మరణిస్తే, ఆ వ్యక్తి మైనర్ సోదరుడు లేదా సోదరి, ఈ చట్టం ప్రకారం కుటుంబ సభ్యులుగా పరిగణించబడతారు. వారందరూ కార్మిక వైద్యశాలలలోనూ, ఆస్పత్రులలోనూ, కొన్ని నిబంధనలకు లోబడి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో నిర్వహించబడే గుర్తించబడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలోనూ, నగదు రహిత ఉచిత వైద్యానికి హక్కుదారులు అవుతారు. ఈ వైద్య హిత లాభం (మెడికల్ బెనిఫిట్)కి ద్రవ్య పరిమితి లేదు. వేతన స్థాయితో నిమిత్తం లేదు.‌ చెల్లించిన లేదా చెల్లించవలసిన చందా పరిగణించకుండా చికిత్స అందించాలి.

కార్మిక రాజ్య బీమా.. ఒక వరం

భరత్ ఇంజనీరింగ్ వర్సెస్ ఆర్. రంగనాయకి వ్యాజ్యంలో మన దేశ సర్వోన్నత న్యాయస్థానం డిసెంబర్ 20, 2002న వెలువరించిన తీర్పులో, ఒక సంస్థ కార్మిక రాజ్య బీమా పరిధిలోకి వచ్చిన నాటి నుండి, ఆ సంస్థకు‌ చట్టం అమలవుతుందనీ, ఆ సంస్థలలో నియమించబడిన వారికి ఉద్యోగంలో చేరిన రోజు నుండే చట్టం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇందుకు కార్మికులను యాజమాన్యం నమోదు చేయడం, వారి పక్షాన చందా చెల్లించడంతో నిమిత్తం లేదని నిర్ధారించింది. పలు బీమా సంస్థలు అమలు చేస్తున్న పథకాలలో ఇది అనూహ్యం.

ఉద్యోగంలో చేరిన రోజే వైద్య సదుపాయం

మరో అద్వితీయ ఘనత. ఈ చట్టం వర్తించే బీమా వ్యక్తులకు వైద్య సదుపాయ హక్కు ఉద్యోగంలో చేరిన రోజు నుండే లభిస్తుంది.‌ చందా చెల్లింపుతో సంబంధం లేదు. చెల్లించాల్సి ఉంటే చాలు. బీమా వ్యక్తి నమోదుతో నిమిత్తం లేదు. ఆనాటికి చట్టం పరిధిలోకి వచ్చే ఉపాధిలో ఉంటే చాలు. అంతేకాదు. విధి నిర్వహణలో ఉండగా ప్రమాదం సంభవిస్తే, చికిత్స, ఆ కారణంగా విధులకు రాలేని కాలమంతటికీ, వైకల్య ప్రయోజనం (డిజేబుల్ బెనిఫిట్)గా జీవితంలో దాదాపు 90 శాతం నగదు చెల్లింపు జరుగుతుంది. కృత్రిమ అవయవాల ఏర్పాటు అవసరమని వైద్యులు నిర్ధారిస్తే, ఆ సదుపాయమూ‌‌ ఉంది. ఉద్యోగంలో చేరిన మొదటి రోజునే పనిలో జరిగిన ప్రమాదం కారణంగా గాయపడిన వారికి ఉచిత చికిత్సతో పాటు, పనికి వెళ్లలేనన్ని రోజు లకు జీతంలో దాదాపు 90 శాతం చెల్లించబడుతుంది. శాశ్వత అంగవైకల్యానికి లోనైన కార్మికులకు యావ జ్జీవం అంగవైకల్య హిత లాభం చెల్లించబడుతుంది. ఎవరైనా మరణిస్తే, ఆ బీమా వ్యక్తిపై ఆధారపడిన, నెలసరి ఆదాయం రూ. 9000 మించని, ఆశ్రితులకు(డిపెండెన్స్) నెలవారీ పింఛను వలె ఆశ్రిత ప్రయోజనం (డిపెండెంట్ బెనిఫిట్) లభిస్తుంది.

ఈ వైద్య హిత లాభం, ఆశ్రిత హిత లాభం మాత్రమే కాక, కొన్ని నిబంధనలకు లోబడి, అస్వస్థత కారణంగా విధులకు హాజరు కాని రోజులకు అనారోగ్య సదు పాయం, స్త్రీ కార్మికులకు వర్తించే మాతృత్వ సదు పాయం, (మెటర్నిటీ బెనిఫిట్) వంటి హిత లాభాలు మరికొన్ని ఉన్నాయి. మరోసారి చెప్పుకుందాం.

-మల్లాప్రగడ రామారావు

99898 63398

Next Story