పదకొండేళ్లయినా.. తెలంగాణ ఉద్యమకారుల కల నెరవేరదా?

by Ravi |   (  Updated:2025-09-11 01:00:52  IST  )

తెలంగాణ ఉద్యమాన్ని తన జీవితం నిండా మోసిన యోధుడు విలియం. 2025, సెప్టెంబర్ 7న ఆయన మృతి చెందడంతో తెలంగాణ

పదకొండేళ్లయినా.. తెలంగాణ ఉద్యమకారుల కల నెరవేరదా?
X

తెలంగాణ ఉద్యమాన్ని తన జీవితం నిండా మోసిన యోధుడు విలియం. 2025, సెప్టెంబర్ 7న ఆయన మృతి చెందడంతో, తెలంగాణ ఉద్యమ గాథలో ఓ బడుగు శబ్దం మౌనంగా మిగిలిపోయింది. ఈ రాష్ట్రం కోసం పోరాడిన వారు ఎందరో ఉన్నా, వెన్నెముకలాగా నిలిచిన వీరుల త్యాగానికి న్యాయం జరగకపోవడమే బాధాకరం.

తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ఉద్యమ‌కారులు తమ వ్యక్తిగత జీవితాన్ని విస్మరించి, నిరంతరం పోరాటాలకే అంకితమై, తెలంగాణ సాధించుకున్నా, ఈ రోజు దీన స్థితిలో కాలం గడుపుతున్నారు. నిస్సహాయంగా మిగిలిపోయి కాలం చెల్లిస్తున్నారు. అందులో విలియం ఒక ఉదాహరణ.

ఉద్యమానికి జీవంగా నిలిచిన యోధుడు..

విలియం కేవలం తెలంగాణ ఉద్యమ యోధుడే కాదు. 1962లో గోవా విమోచన పోరాటంలో పాల్గొని జైలులో ఉన్న చరిత్ర కలిగిన వ్యక్తి. రామ్ మనోహర్ లోహియా సోషలిస్టు సిద్ధాంతాలకు నిబద్ధుడుగా, శ్రమజీవుల హక్కుల కోసం పోరాడిన యోధుడు. 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో, అప్పటి నాయకులైన కేశవ్ రావు, మదన్ మోహన్, ప్రతాప్ కిషోర్, బద్రి విశాల్, ఆరీఫుద్దీన్, పీజే సూరి, చిరంజీవి లాంటి వారితో కలిసి పనిచేసిన నాయకుడు. గుణ పార్క్‌లో అమరవీరుల స్మారక స్తూపం కట్టినప్పుడు అమరవీరులకు చెందిన పుస్తకాలను, బట్టలను సేకరించి, వారి జ్ఞాపకార్ధంగా అందులో పొందుపరిచాడని ఉద్యమకారులు చెప్పుకుంటున్నారు. మలిదశ ఉద్యమంలో, తను నివాసముండే అల్వాల్ నే ఉద్యమ కేంద్రంగా మార్చి, 1136 రోజుల రిలే దీక్షలు నిర్వహించిన నిరంతర స్ఫూర్తి. అందులో 200 రోజులకు పైగా స్వయంగా నిరాహార దీక్షలో పాల్గొనడం ఉద్యమం పట్ల ఆయనలో ఉన్న నిజమైన నిబద్ధతకు నిదర్శనం.

ఆయనతో వ్యక్తిగత అనుబంధం..

ఆయనను మొదటిసారి కలిసిన సందర్భం, నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నా దర్శకత్వంలో రూపొందిన ఫీచర్ ఫిల్మ్ “ఇంకెన్నాళ్లు- వాయిస్ ఆఫ్ తెలంగాణ” ప్రివ్యూ ప్రదర్శనకు ఆయన రావడం, ఆయనను ఆహ్వానించినవారు ప్రముఖ ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు. ఆ సినిమాలో చూపించిన మూడు తరాల, వివిధ పోరాటాలను (తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, 1969 ఉద్యమం, నక్సల్ ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం) ఒక కుటుంబ చిత్రంగా మలిచిన విధానం, భావోద్వేగాలను, ఉన్నదున్నట్లు సహజ సిద్ధంగా చిత్రీకరించిన తీరుని మెచ్చుకొని ప్రోత్సహించారు. ఆ సినిమాలో ఉన్న ఒక ప్రధాన పాత్ర “బుచ్చి రాములు” ఆ పేరుతోనే నన్ను సంబోధించారు. వారు అల్వాల్‌లో నిర్వహించిన నిరాహార దీక్షకు సంఘీభావంగా 588వ రోజున, నేను పాల్గొని సెప్టెంబర్ 30న జరగబోయే తెలంగాణ మార్చ్‌లో పాల్గొనాలని ఆ వేదికపై నుండి పిలుపునిచ్చాను. అవన్నీ మరవలేని మహత్తర గడియలు. ఆ సందర్భంలో జరిగిన పరిచయం, తరువాత మేం కలిసి అనేక ఉద్యమ సమావేశాల్లో పాల్గొనడం. వయసులో తేడా ఉన్నా, ఉద్యమం పట్ల ఉన్న మమకారం మమ్మల్ని ఒకే తరానికి చెందినవారిలా చేసిందన్నది నా అనుభూతి.

ఉద్యమం విజయం సాధించినా…

తెలంగాణ వచ్చి పదకొండు సంవత్సరాలు గడిచినా, ఉద్యమ యోధులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు కాలేదు. 250 గజాల స్థలం లేదు. ఉద్యోగ హామీలు.. ఊహల్లోనే ఉంటున్నాయి. పింఛన్, వైద్యం, గౌరవ గుర్తింపు. మాటలకే పరిమితం. ఉద్యమంలో మృతి చెందిన కుటుంబాలకు కనీస ఆదరణ లేదు. ఈ విఫల హామీలే అప్పటి ఇప్పటి తెలంగాణ పాలకులపై ప్రజల అసంతృప్తికి ప్రధాన కారణం అవుతున్నాయి. విలియంని పోలిన ఉద్యమ వీరులు గుమ్మాల కొద్దీ మౌనంగా మరణిస్తున్నారు. వారు బ్రతికి ఉండగానే తెలంగాణ రాష్ట్ర సాధన ఫలాలను అనుభవించి పోతే సంతృప్తిగా ఉంటుంది.

ప్రభుత్వానికి స్పష్టమైన సందేశం

తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటికైనా మెలుకువ రావాలి. వీరిని గుర్తించడం అనేది ఉపకారం కాదు. అదొక చారిత్రక బాధ్యత. ఎన్నికల ముందు మీరే కదా వాగ్దానం చేసింది! వీలైనంత త్వరగా ఉద్యమకారులకు కింది మౌలిక హక్కులు, సహాయాలు ఇవ్వాలి. నివాస స్థలం, ఉద్యోగ ప్రాధాన్యత, ఉచిత వైద్య సహాయం, ఉద్యమ గుర్తింపు పత్రం, గౌరవ వేతనం. ఉద్యమం గురించి బహిరంగంగా ఆవిష్కరించేందుకు జ్ఞాపక స్మారకాలు, ఉద్యమ కేంద్రాల అభివృద్ధి చేయాలి

ఉద్యమం ఒక చరిత్ర కాదు, బాధ

విలియం జీవితం... ఉద్యమం గురించి మా త్రమే కాదు, మన రాజ్యాంగం, మన సమాజం ఎంతగా శ్రమజీవుల కోసం పని చేయాలన్న సందేశాన్ని చెప్పేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా, ఉద్యమ స్ఫూర్తి నిలిచేది ఇలాంటి యోధుల వల్లే. వారిని మరచిపోతే, అది చరిత్రను ద్రోహం చేసి నట్లే. వారికి న్యాయం జరిగితే మాత్రమే, తెలంగాణ అనే కల నిజమౌతుంది.

-సయ్యద్ రఫీ

సినిమా దర్శకుడు

99660 25325

Next Story