మోడీ పాలనలో‌ ఎమర్జెన్సీ పునరావృతం కాబోతుందా?

by Ravi |   (  Updated:2025-06-25 01:15:38  IST  )

నేటికి సరిగ్గా 50 ఏళ్ల క్రితం (25-6-1975) ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించిన సంగతి అందరికీ తెలుసు.. దానిని దృష్టిలో

మోడీ పాలనలో‌ ఎమర్జెన్సీ పునరావృతం కాబోతుందా?
X

నేటికి సరిగ్గా 50 ఏళ్ల క్రితం (25-6-1975) ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించిన సంగతి అందరికీ తెలుసు.. దానిని దృష్టిలో పెట్టుకొని, 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన ఒక సంవత్సరంలోనే "ఈ దేశానికి మళ్లీ అత్యవసర పరిస్థితి వస్తే ఆశ్చర్యపోను" అంటూ ఎల్. కె. అద్వానీ 2015 జూన్ 19న చేసిన ప్రకటన కొందరికైనా గుర్తు ఉండే ఉంటుంది. నేడు ఇందిరాగాంధీ తరహాలో ప్రకటిత అత్యవసర పరిస్థితి కాకున్నా, పరోక్ష రూపాలలో అత్యవసర పరిస్థితి సాగుతోందని మోడీ భక్త వరేణ్యులు మినహా మిగతా వారందరికీ అర్థమవుతున్న విషయం!

బీజేపీ వారిచేత అభినవ సర్దార్ పటేల్‌గా, సంఘ పరివారీయుల చేత లోహపురుష్‌ (ఉక్కుమనిషి) గా ఒకనాడు విశేషం గా ప్రచారం పొందిన లాల్‌కిషన్‌ అద్వానీ, దేశంలో అత్యవసర పరిస్థితి ప్రమాదం పొంచి ఉంది సుమా.. అని హెచ్చరిం చటంపై బయటకు ఎక్కువమంది మాట్లాడకున్నా చాలా మందిని లోలోపల ఉలిక్కిపడేట్టు చేసింది. ప్రస్తుత సమయంలో రాజ్యాంగ చట్టపరమైన రక్షణలకు కట్టుబడని, ప్రజాస్వామ్యాన్ని అణచివేయగల శక్తులు బలంగా ఉన్నాయని అద్వానీ నాడు పేర్కొన్నారు. పౌరహక్కులు రద్దు కావని, మళ్లీ దెబ్బతినబోవనీ తాను భావించటం లేదన్నారు. అలా చేయటం అంత తేలిక కాదనీ, అయితే మళ్లీ అలా జరగదని చెప్పలేననీ, ప్రాథ మిక హక్కులను తిరిగి హరించవచ్చని అద్వానీ వ్యాఖ్యానించారు..

అద్వానీ వ్యాఖ్యలు ఎవరిపై..?

అద్వానీ ప్రకటన సాక్షాత్తూ దేశ ప్రధానిగా ఉన్న బీజేపీ అధినేత నరేంద్ర మోడీని ఉద్దేశించి మాట్లాడినదేనని ప్రత్యేకంగా చెప్పనవనరం లేదు. అయితే ఆ ప్రకటన పాలక వర్గాలలో పెరిగిపోతున్న అంతర్గత సంక్షోభానికి, వారి ముఠా ల నడుమ వైరుధ్యాల తీవ్రతకూ అద్దం పట్టింది. అద్వానీ హెచ్చరించినట్లుగానే గత పాలకులు నిర్మించుకుంటూ వస్తు న్న వివిధ రాజ్య వ్యవస్థలను నయానో, భయానో లొంగదీసుకుని పాదాక్రాంతం చేసుకునే ప్రక్రియ చట్టబద్ధంగా జరిగిపోయింది. చట్టబద్ధంగా ఏర్పడిన రాజ్యాంగ వ్యవస్థలైన ఎన్ఐ‌ఏ, సీబీఐ, ఈడీ, ఐటీ, ఈసీ, రిజర్వ్ బ్యాంకు, ఆర్‌టీఐ ఆఖరికి గవర్నర్ల వ్యవస్థను కూడా తమ గుప్పెట పెట్టుకుని భిన్నాభిప్రాయాల వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు..

ప్రధాని పదవి కోల్పోయి..

2014లో తాను ఆశించిన ప్రధానమంత్రి పదవిని ఎల్‌.కే అద్వానీ ఇతరేతర కారణాల వల్ల కోల్పోయారు.. అందులో 2005లో అద్వానీ పాకిస్తాన్‌లోని తన జన్మ స్థలాన్ని సందర్శించడానికి పర్యటించి, ఆ సందర్భంగా మహమ్మద్ అలీ జిన్నాను లౌకికవాది అని ప్రశంసలు కురిపించడం ఒకటి. ఆ వ్యాఖ్యలతో బీజేపీ అధ్యక్ష పదవిని కూడా ఆయన కోల్పోవలసి వచ్చింది. ఇక ఉన్నత పదవి పై అన్ని ఆశలూ వదులుకున్న పిదప 2015లో దేశానికి ఒక హెచ్చరికతో అద్వానీ ముందు కు వచ్చారు. తన పదవికి పోటీకి రాలేరని తేలిపోయిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో 2024 మార్చి 31న అద్వానీని సత్కరించింది.

విద్వేషపూరిత దాడులు..

సామాజిక మాధ్యమాలలో పచ్చి అబద్ధాలమయమైన మత విద్వేష వ్యాప్తిని కావించే గోబెల్ ప్రచార యంత్రాంగం నిర్మించి, తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో బుల్డోజర్ పరిపాలన సాగిస్తూ, కింద నుండి చట్టవిరుద్ధంగా పరివార్ దళాలను ప్రయోగిస్తూ.. ప్రతిపక్ష రాజకీయ పార్టీలనీ, ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను లొంగతీసుకోవడం, విద్వేషపూరిత దాడులు సాగిం చటం ఒక ఫాసిస్టు కళగా అభివృద్ధి పరచుకుని, అప్రకటిత అత్యవసర పరిస్థితిని నడిపిస్తున్న సంగతి మనందరం ఎరిగినదే!

నాటికీ నేటికీ.. పాలనలో తేడా ఏంటి?

ఇక ప్రజా ఉద్యమాల సంగతి చెప్పేదేముంది? ప్రశ్నించడమే నేరం! నిజం మాట్లాడటమే ద్రోహం!! బ్రిటిష్ వలస పాలకుల రాజద్రోహ చట్టం, రౌలట్ చట్టం, ప్రజా భద్రతా చట్టం, దేశంలో మొదటి ఎన్నికలు జరగకముందే తెచ్చిన ముందస్తు నిర్బంధాల చట్టం (ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1950) కలగలిపి 'ఉపా' పేరుతో నేడు నిరసననే యథేచ్ఛగా నిలిపివేయడం చేస్తూ భయోత్పాతపూరిత అణచివేత సాగు తోంది. కొండ కోనలలో జీవించే ఆదివాసీల నుండి, గ్రామీణ రైతాంగం, పట్టణ కార్మిక వర్గాల హక్కులపై దాడి అణచివేత రోజువారీ ప్రక్రియ అయింది. విపరీత అసమానతల వ్యవస్థను పెంచి పోషిస్తున్నారు.. ఇదంతా పరోక్ష అత్యవసర పరిస్థితి, ప్రత్యక్ష ఫాసిస్టు తరహా పాలన కాక మరేమిటి?

కొత్తను హతమార్చడానికి పాత కత్తులు..

55 ఏళ్ల క్రితం 1970లో మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు పాతను బతికించడానికి కొత్త చిట్కాలు వెతుకుతున్నారు.. కొత్తను హతమార్చడానికి పాత కత్తులు నూరుతున్నారు. అబద్ధాల ఫ్యాక్టరీ ప్రచారంపై ఆధారపడి మత విద్వేషాలను విపరీతంగా పెంచి, కార్పొరేట్ శక్తులను బలిపించడమే కార్యక్రమంగా సాగుతున్నారు. తమ వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వాలపై అశ్వమేధయాగం తలపెట్టిన, ఫెడరల్ వ్యతిరేక నిరంకుశ కేంద్ర పాల కుల ఆశలు దురాశలు కాక తప్పదు!

విషాదాంతమూ.. ప్రహసనమూ..!

170 సంవత్సరాల క్రితం, (1852) ఫ్రాన్స్‌ దేశాధ్యక్షుడైన లూయీ బోనపార్టీ గురించీ, చరిత్ర పునరావృతం కావటం గురించీ రాస్తూ కారల్‌మార్క్స్ 'Eighteenth Broumier of Lyee Bonaparte' అనే తన ప్రసిద్ధ గ్రంథంలో అన్న మాటలు జ్ఞాపకం చేసుకుందాం! 'ప్రపంచ చరిత్రలో అధిక ప్రాముఖ్యం కలిగిన అన్ని ఘటనలూ పునస్సంభవిస్తూ వుంటాయనీ, వ్యక్తులు- పునరావిర్భవిస్తూ ఉంటారనిపిస్తుందనీ హెగెల్‌ ఒకమారు ఎక్కడోగానీ అన్నాడు. అయితే మొదటిసారి విషాదాంతంగానూ, రెండవసారి ప్రహసనంగానూ అని చేర్చటం ఆయన మరిచిపోయాడు. ఇందిరాగాంధీకి 1977 ఎన్నికల ఓటమితో అత్యవసర పరిస్థితి ఆమెకు అప్పుడే విషాదాంతమైంది. నరేంద్రమోడీ కూడా అలాంటి ప్రయత్నమే కనుక చేయతలపెడితే ప్రహసనం (ఫార్స్‌)గా ముగియక తప్పదు.

దివికుమార్

94401 67891

Next Story