- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్విచ్ నొక్కగానే.. 200 ఏళ్ల విజ్ఞానం వెలుగు!
స్విచ్ నొక్కిన ఒక్క క్షణంలో వెలిగే బల్బు వెనుక ఉన్న శాస్త్రం. ఫెరడే కనుగొన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి టెస్లా ఏసీ విద్యుత్ వరకు, ట్రాన్స్‌ఫార్మర్లు, వోల్టేజ్ రహస్యాలు, స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీపై సమగ్ర వివరణ.

ఒక చిన్న స్విచ్.. ఒక క్షణం.. అంతే మన ఇంట్లో బల్బు వెలుగుతుంది. మనకు అది సాధారణం. కానీ అదే క్షణంలో, రెండు శతాబ్దాల మానవ మేధస్సు, వేల కిలో మీటర్ల ప్రయాణం, అద్భుతమైన భౌతిక శాస్త్రం నిశ్శబ్దంగా పని చేస్తున్నాయి. 1831లో మైకేల్ ఫెరడే కనుగొన్న ‘ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్’ సూత్రం నుంచి ప్రారంభమైన ప్రయాణం, 1880లలో ఎడిసన్–టెస్లా మధ్య జరిగిన ‘కరెంట్ వార్’తో మరింత వేగం అందుకుంది. చివరికి టెస్లా ప్రతిపాదించిన ఏసీ విద్యుత్తే ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందింది. ఈరోజు మనం స్విచ్ నొక్కిన ఆ ఒక్క క్షణంలో, ఎక్కడో పవర్ ప్లాంట్‌లో పుట్టిన శక్తి, అయస్కాంత క్షేత్రాల మార్గంలో ప్రయాణించి, ట్రాన్స్‌ఫార్మర్ల ద్వారా సమతుల్యంగా మారి, మన ఇంటి వెలుగుగా రూపాంతరం చెందుతుంది.
వోల్టేజ్ రహస్యం..
ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ ఒకే విధంగా ఉండదు, ఇది శాస్త్రం, ఆర్థికం, అవసరాల సమతుల్య నిర్ణయం. అమెరికా వంటి దేశాలు 110 వోల్టులపై ఆధారపడితే, భారత్, యూరప్ దేశాలు 220 వోల్టులను అనుసరి స్తున్నాయి. వోల్టేజ్ పెరిగినప్పుడు, అదే శక్తిని తరలించడానికి తక్కువ విద్యుత్ ప్రవాహం సరిపోతుంది. దీని వల్ల తీగల పరిమాణం తగ్గి, రాగి వినియోగం తగ్గుతుంది. అలాగే, ప్రసార సమయంలో వేడి రూపంలో జరిగే శక్తి నష్టం కూడా తగ్గుతుంది. ప్రారంభ దశలో భద్రత, సాంకేతిక పరిమితుల కారణంగా 110 వోల్టులు ప్రాచుర్యం పొందాయి, తర్వాత సామర్థ్యం కోసం యూరప్ దేశాలు 220 వోల్టులను ఎంచుకున్నాయి. భారత్ కూడా అదే విధానాన్ని అనుసరించడం వల్ల సమర్థవంతమైన విద్యుత్ పంపిణీ సాధ్యమైంది.
నిశ్శబ్ద వీరుడు ‘ట్రాన్స్‌ఫార్మర్’
విద్యుత్ వ్యవస్థలో అత్యంత కీలకమైన భాగం ట్రాన్స్‌ఫార్మర్. ఇది ఎటువంటి కదిలే భాగాలు లేకుండా, అయస్కాంత క్షేత్రాల సూత్రంపై పనిచేస్తూ వోల్టేజ్‌ను పెంచడం, తగ్గించడం చేస్తుంది. సాధారణంగా 11kV పరిధిలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు, దీన్ని సుదూర ప్రాంతాలకు పంపించడానికి స్టెప్-అప్ ట్రాన్స్‌ఫార్మర్ల ద్వారా 2,20,000 వోల్టుల వరకు పెంచుతారు. గమ్య స్థానానికి చేరుకున్న తర్వాత, స్టెప్-డౌన్ ట్రాన్స్‌ఫార్మర్లు దానిని 440 వోల్టులకు, చివరికి మన ఇళ్లలో ఉప యోగించే 220 వోల్టులకు తగ్గిస్తాయి. ఈ ప్రక్రియలో ట్రాన్స్‌ఫార్మర్లు అత్యధిక సామర్థ్యంతో పనిచేస్తూ, విద్యుత్‌ను భద్రంగా, సమర్థవంతంగా మనకు అందజేస్తాయి.
స్మార్ట్ గ్రిడ్ నుండి వైర్‌లెస్ వరకు
ప్రస్తుత కాలంలో విద్యుత్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ‘స్మార్ట్ గ్రిడ్’ సాంకేతికత ద్వారా విద్యుత్ అవసరాన్ని ముందుగానే అంచనా వేసి, సమర్థవంతంగా పంపిణీ చేసే విధానాలు అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే, ‘సాలిడ్ స్టేట్ ట్రాన్స్‌ఫార్మర్లు’ వంటి ఆధునిక పరిజ్ఞానాలు విద్యుత్ నియంత్రణలో కొత్త మార్గాలను చూపిస్తు న్నాయి. వైర్‌లెస్ విద్యుత్ ప్రసారంపై కూడా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలు విద్యుత్ వినియోగాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు, భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన వ్యవస్థలకు దారి తీస్తాయి. నేడు మనం స్మార్ట్ గ్రిడ్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ వీటన్నింటికీ పునాది 200 ఏళ్ల క్రితం పడింది. మనం వాడే ప్రతి యూనిట్ విద్యుత్ వెనుక శతాబ్దాల శాస్త్రీయ పోరాటం, మానవ మేధస్సు వెలుగు దాగి ఉంది.
-ఫిరోజ్ ఖాన్,
96404 66464






