వృద్ధులు... అనుభవాల సింధువులు

by Ravi |   (  Updated:2025-10-01 00:45:37  IST  )

ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం మన సమాజంలో వృద్ధుల స్థానం, వారి హక్కులు

వృద్ధులు... అనుభవాల సింధువులు
X

ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం మన సమాజంలో వృద్ధుల స్థానం, వారి హక్కులు, శ్రేయస్సుపై దృష్టి సారించేందుకు ఒక ముఖ్యమైన వేదిక. వృద్ధులు కేవలం అనుభవపు సింధువులు మాత్రమే కాదు, సమాజానికి వెలకట్టలేని సంపద అని, వారిని వేరుపరచకుండా క్రియాశీల భాగస్వాములుగా చేర్చాల్సిన అవసరం ఉందని ఈ దినోత్సవం మనకు గుర్తు చేస్తుంది. వృద్ధులు భారం కారు, వారు బలం. వారి హక్కులను గౌరవించడం, అవసరాలను గుర్తించడం మనందరి సామాజిక బాధ్యత.

ప్రజల ఆయుర్దాయం పెరిగింది!

21వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా వృద్ధాప్య జనాభా వేగంగా పెరుగుతుండడం కీలకమైన అంశం. మెరుగైన ఆరోగ్య సంరక్షణ, తగ్గిన మరణాల రేటు సంతానోత్పత్తి రేట్ల తగ్గుదల కారణంగా ప్రజల ఆయుర్దాయం పెరిగింది. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం, 2050 నాటికి, వృద్ధులు మొత్తం ప్రపంచ జనాభాలో 15 శాతానికి పైగా ఉంటారు. ప్రస్తుతం, జపాన్‌లో దాదాపు 30 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారున్నారు. 2050 నాటికి, వృద్ధుల జనాభాలో దాదాపు 80 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో నివసిస్తారని అంచనా.

పెరుగుతున్న వృద్ధుల జనాభా..

భారతదేశంలోనూ వృద్ధుల జనాభాలో గణనీయమైన పెరుగుదల నమోదవుతోంది. భారతదేశంలో 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధుల సంఖ్య 2001లో 77 మిలియన్ల నుండి 2051 నాటికి 301 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. మొత్తం జనాభాలో వారి నిష్పత్తి 2051 నాటికి 17 శాతానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, సంతానోత్పత్తి రేట్లు తగ్గడం, వలసలు, న్యూక్లియర్ కుటుంబాల పెరుగుదల కారణంగా ప్రతి ఇంటికి వ్యక్తుల సంఖ్య తగ్గింది. దీనివల్ల వృద్ధుల జీవన ఏర్పాట్లు మారుతున్నాయి, ముఖ్యంగా ఒంటరిగా లేదా జీవిత భాగస్వామితో నివసించే వారి సంఖ్య తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పెరుగుతోంది.

ఈ రంగాలలో వృద్ధుల పాత్ర..

వృద్ధులు నేటికీ వివిధ రంగాల్లో తమ అనుభవంతో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ తమ జీవితానుభవాలను పంచుకోవడం ద్వారా ఇతరులకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులను ఎలా నియంత్రించాలో మార్గనిర్దేశం చేస్తున్నారు. ఆర్థిక రంగం పెన్షన్ హక్కుల కోసం పోరాటాలు చేయడం, యువతకు ఆర్థిక సలహాలు ఇవ్వడం చిన్న వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇది ప్రశంసనీయ చర్య

వృద్ధుల ఆర్థిక భద్రతను మెరుగుపరచడంలో ప్రభుత్వాల చర్యలు చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రశంసనీయమైనవి. 2024లో పునరుద్ధరించిన వృద్ధాప్య పింఛన్ పథకం ద్వారా, సీనియర్ సిటిజన్‌లకు పింఛన్ మొత్తాన్ని ₹3,000 నుండి ₹4,000కి పెంచారు. ఈ పెంపు జూలై 2024 నుంచి అమల్లోకి వచ్చింది, ఇది వృద్ధులకు ఆర్థిక భద్రత కలిగించడంలో ఒక ముఖ్యమైన ముందడుగు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా, వృద్ధుల పట్ల గౌరవం, వారి పట్ల శ్రద్ధ, వారి హక్కుల పరిరక్షణ కేవలం ఒక రోజుకే పరిమితం కాకుండా, నిత్య జీవితంలో భాగం కావాలని మనమందరం ప్రతిజ్ఞ చేయాలి. వృద్ధులే మన బలం, వారే మన సమాజానికి వెలుగు.

(నేడు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం)

-డాక్టర్ బాబు నంబూరు

83411 94551

Next Story