విద్యాసంస్థల బంద్‌లు.. ఎవరి ప్రయోజనాల కోసం?

by Ravi |   (  Updated:2025-07-01 01:15:45  IST  )

ప్రతి ఏటా అకడమిక్ ఇయర్ ప్రారంభం కాగానే విద్యా సంస్థల బంద్‌కు పిలుపునివ్వడం విద్యార్థి సంఘాల ప్రాథమిక విధిగా మారింది.

విద్యాసంస్థల బంద్‌లు.. ఎవరి ప్రయోజనాల కోసం?
X

ప్రతి ఏటా అకడమిక్ ఇయర్ ప్రారంభం కాగానే విద్యా సంస్థల బంద్‌కు పిలుపునివ్వడం విద్యార్థి సంఘాల ప్రాథమిక విధిగా మారింది. అయితే వారు గత దశాబ్ద కాలంగా పోరాడుతున్న విద్యార్థి సంఘాల కారణంగా ఏదైనా మార్పు వచ్చిందా? అయినా విద్యార్థి సంఘాలు ఎందుకు బంద్‌లను ప్రోత్సహిస్తున్నాయి? ఈ బంద్‌లు చేయడం వలన ఎవరికి నష్టం?

ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో మౌలిక వసతులలేమి, ఫీజుల దోపిడీకి నిరసనగా ప్రతీ ఏడాది విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునివ్వడం ఓ సంప్రదాయంగా వస్తోంది.

ఎందుకు బంద్‌లకు పిలుపునిస్తున్నారు?

గత ఇరవై ఏళ్లుగా ఈ బంద్‌ల పరంపర కొనసాగుతూనే ఉన్నా, ఇప్పటివరకు విద్యార్థి సంఘాలు సాధించిన ఫలితం చెప్పుకోదగ్గ స్థాయిలో ఏం లేదు. పైగా, నానాటికీ విద్యా సంస్థల పనితీరు, మౌలిక వసతులు మరింత దిగజారుతున్నాయి. అయినా విద్యార్థి సంఘాలు మాత్రం మూస ధోరణిలో విద్యాసంస్థలు ప్రారంభం కాగానే బంద్‌కు పిలుపునివ్వడం కర్తవ్యంగా పెట్టుకున్నాయి.. ఈ బంద్‌లు విద్యార్థి సంఘాల ఉనికిని చాటేవిగా భావిస్తున్నట్టు ఉన్నారు. అసలెందుకు వారు బంద్‌కు పిలుపునిస్తున్నారు.. ఈ బంద్‌ల ద్వారా ప్రభుత్వంపై ఎలా ఒత్తిడి సాధ్యమో? ఒక్క విద్యార్థి సంఘం చెప్పదు.

ఉనికి చాటింపునకేనా?

బంద్‌ల వలన సామాన్య, పేద విద్యార్థులు ఒకటి, రెండు రోజుల క్లాసులను కోల్పోవడం తప్పితే ఈ దశాబ్దంలో వచ్చిన ఫలితం శూన్యం. ఇరవై ఏళ్లుగా పాఠశాలలు, కాలేజీలలో ఏమైనా మార్పు వచ్చిందా? అంటే అదీ లేదు. అయినా ఇదే ఎజెండాతో ప్రతి ఏడాది పిలుపునివ్వడం ఓ తంతుగా ఎందుకు కొనసాగుతోంది. కార్పొరేటీకరణ, ప్రపంచీకరణ తర్వాత ప్రభుత్వరంగ వ్యవస్థలను పట్టించుకోవడం ప్రభు త్వాలు మానేశాయి.. విద్యా వ్యవస్థ ఇందుకు మినహాయింపు ఏమి కాదు.. విప్లవ, ప్రగతిశీల విద్యార్థి సంఘాలకు ఈ విషయంలో సంపూర్ణ అవగాహన ఉండి ఉంటుంది. అయినా, మతోన్మాద విద్యార్థి సంఘాల బాటలోనే ప్రగతిశీల విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునివ్వడం మానడం లేదు.. వాటితో ఒరిగేదేం లేదని తెలిసీ కూడా పిలుపునిస్తున్నారంటే, దీన్ని ఉనికి చాటింపు వ్యవహారంగా భావిస్తున్నారని చెప్పక తప్పదు.

మూసధోరణి బంద్‌లు ఎందుకు?

ఒకప్పుడు విద్యార్థి సంఘాలు బంద్‌లకు పిలుపునిచ్చినా.. వాటికి సమాంతరంగా రాడికల్ ఉద్యమాలు చేపట్టారు.. ఫలితంగా ప్రభుత్వాల మెడలు వంచి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసుకున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. విద్యార్థి సంఘాలు తమ బాధ్యతను గాలికి వదిలేసి, ఆర్థిక చక్రబంధంలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం ఓ కొత్త విద్యార్థి సంఘం ఏర్పాటు అవుతుందంటే దాన్ని పర్య వ సానం ఆర్థిక మూలాలే అయి ఉండవచ్చు అనే స్థాయికి విద్యార్థి సంఘాల విశ్వసనీయత చేరుకున్నది. ప్రస్తుతం నీతి, నిజాయితీ, చిత్తశుద్దితో ముందుకు వెళ్లే విద్యార్థి సంఘాలు లేవు.. ఆ నాయకత్వం కూడా కనిపించడం లేదు. అందుకే ఇంకా మూసధోరణిలో బంద్‌ల వ్యవహారం కొనసాగుతోంది. నిజానికి, ఈ బంద్‌లను గతంలో కమ్యూనిస్ట్, ప్రగతిశీల నేపథ్యం ఉన్న విద్యార్థి సంఘం నాయకత్వం వ్యతిరేకించింది. ఆ నాయకత్వం వైదొలిగాక ఆ సంఘాలు మళ్లీ అదే బాటను అనుసరిస్తున్నాయి.

ఈ పిలుపుతో పేద పిల్లలకే నష్టం!

తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మె జరిగింది. ఈ ఉద్యమానికి మనమంతా సాక్షులం. అప్పుడు బడులను బంద్ పెట్టి, ఉద్యమాన్ని కొనసాగిస్తే మందకృష్ణ ఒక్కరే ఈ విద్యా సంస్థల బంద్‌ను వ్యతిరేకించారు. విద్యార్థి సంఘాలు కూడా నాడు మందకృష్ణను వ్యతిరేకించాయి. అయినా ఆయన చేసిన ప్రకటనకు చివరి వరకు కట్టుబడి ఉన్నారు. ‘ఈ సకల జనుల సమ్మె సారధి కోదండరాం రెడ్డి మనవడు అమెరికాలో క్రమం తప్పకుండా క్లాసులకు హాజరు అవుతాడు.. తెలంగాణలో నివసిస్తున్న పేద, మధ్య తరగతి తల్లిదండ్రుల పిల్లలు మాత్రం ఉద్యమం వలన తరగతులను కోల్పోవాలా? ఇదెక్కడి న్యాయం’ అని మందకృష్ణ ఆనాడే ప్రశ్నించారు.. ఇప్పుడూ ఈ బంద్‌ల వ్యవహారం కొనసాగుతుంటే మందకృష్ణ ప్రకటన మళ్లీ గుర్తొస్తోంది. మన కర్తవ్యాన్ని యాదిజేస్తోంది. నిజంగా, విద్యార్ధి సంఘాలకు చిత్తశుద్ది ఉంటే...రాడికల్ ఉద్యమాలతో విద్యా సంస్థల రూపురేఖలు మార్చాలి. అంతేకాని, బంద్‌లతో కాదు. అది జరగని పని అని అందుకు ఈ రెండు దశాబ్దాల కాలమే తిరుగులేని సాక్ష్యం.

ప్రశాంత్ పగిళ్ళ

ఓయూ, సోషియాలజీ విద్యార్థి

95812 62429

Next Story