- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనారిటీ హక్కుల సాధనకు పోరాటాలే దిక్కు
మైనారిటీ హక్కుల సాధనకు పోరాటాలే దిక్కు... editorial on national minorities rights day

మైనారిటీల హక్కుల ఉల్లంఘన, వారిపట్ల వివక్ష, పక్షపాత విధానాలను ఇలాగే కొనసాగిస్తే అనేక త్యాగాలతో సాధించుకున్న స్వతంత్ర భారత భవిష్యత్తు ఖచ్చితంగా మసక బారిపోతుంది. కనుక ఇప్పటికైనా పాలకవర్గాలు కళ్లు తెరిచి ముస్లిమ్ మైనారిటీల సంక్షేమానికి, స్వతంత్ర భారతంలో న్యాయ వంతమైన, రాజ్యాంగ బద్దమైన వారి హక్కును వారికి అందించడానికి ప్రయత్నించాలి. దానికోసం ఏదో చేయాల్సిన అవసరం లేదు. జస్టిస్ సచార్ నివేదికను అమలు పరిస్తే చాలు. ముస్లింలు కూడా, ఎవరో ఏదో చేస్తారని గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటే సరిపోదు. ఓటుబ్యాంకు రాజకీయాలను తిప్పికొట్టి తమకు కావలసింది, తమకు దక్కాల్సింది సాధించుకునే దిశగా సామాజిక చైతన్యంతో, నిర్దిష్టమైన ప్రణాళికతో వజ్ర సంకల్పం బూనాలి. ప్రజా ప్రాతినిధ్య చట్టాల్లో తమ హక్కు వాటా పొందడానికి కార్యాచరణ రూపొందించుకోవాలి.
నాగరికత ఇంతగా అభివృద్ధి చెందినా, ఇంకా చాలా దేశాల్లో మానవ హక్కులకు, ముఖ్యంగా మైనారిటీల హక్కులకు పూర్తి భరోసా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాచరిక , నియంతృత్వ పాలనలు అంతరించి, ప్రజాస్వామ్యాన్ని పూమాలగా స్వీకరించిన భారత్ లాంటి దేశాల్లో సైతం మానవ హక్కుల హననం కొనసాగుతోంది. కేంద్రంలో నరేంద్రమోడీ అధికార పగ్గాలు చేపట్టాక ఈ ధోరణి మరింతగా పెరిగిపోయింది. యుద్ధాలతో విలవిలలాడుతున్న దేశాల్లో, రాచరిక పాలన కొనసాగుతున్న దేశాల్లో మానవ హక్కులకు భద్రత లేదంటే ఒక అర్థముంది. కానీ, ప్రజాస్వామిక దేశాల్లో కూడా మానవ హక్కుల హననం కొనసాగడం కంటే దారుణం ఇంకేముంటుంది? అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని చెప్పుకొంటున్న భారత్‌లో కొనసాగుతున్న మానవ హక్కుల హననంపై ఐక్యరాజ్య సమితి(UNO) వంటి అంతర్జాతీయ సంస్థలు అక్షింతలు వేసినా మన పాలకుల్లో చలనం లేకపోవడం విడ్డూరం, విషాదం.
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఏడున్నర దశాబ్దాల కాలం గడిచిపోయింది. ఈ 75 యేళ్లలో దేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించింది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మన దేశ ప్రగతి అంబరాన్ని తాకుతోంది. చాలా సంతోషం. కానీ, వాస్తవాభివృధ్ధికి ఇదొక్కటే కొలమానం కాదుగదా! నిజానికి దేశంలోని పౌరులందరికీ ఎలాంటి వివక్ష, పక్షపాతం లేకుండా సమాన హక్కులు, అవకాశాలు లభ్యం కావాలి. ఏ దేశ స్వాతంత్ర్య, అభివృద్ధి ఫలాలైనా ప్రాధమికంగా అన్ని వర్గాలు, అన్ని సముదాయాల ప్రజలకు సమానంగా, నిష్పక్షపాతంగా, న్యాయంగా అందాలి. అప్పుడే దేశ స్వాతంత్య్రానికి, అభివృద్ధికి ఒక అర్ధమనేది ఉంటుంది.
అందరికీ అభివృద్ధి ఫలాలు
భిన్నకులాలకు, మతాలకు, సముదాయాలకు ఆలవాలమైన మన భారతదేశంలో అన్ని సమాజాలవారికి, ముఖ్యంగా ఈ దేశ మూలవాసులైన ముస్లిమ్ మైనారిటీలకు హక్కులు, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయా అంటే, సమాధానం కోసం నీళ్లు నమలాల్సిందే. నిజంగానే ముస్లిమ్ మైనారిటీలకు హక్కులు, అభివృద్ధి ఫలాలు లభించి ఉన్నట్లయితే, లభిస్తున్నట్లయితే ఈనాడు వారి పరిస్థితి ఇంత దయనీయంగా ఉండేది కాదు. దేశ జనాభాలో సుమారు 30 కోట్ల వరకు ముస్లిం జనాభా ఉంది. వీరిలో 60 శాతం మంది నేటికీ దారిద్ర్య రేఖ దిగువన దుర్భరమైన జీవనం గడుపుతున్నారు. దీనికి ప్రధాన కారణం ముస్లిమ్ సముదాయంలోని విద్యా లేమి అంటే అతిశయోక్తి కాక పోవచ్చు. కానీ, పాలకుల పాపాన్ని మనం విస్మరించలేం.
ఈనాటికీ ముస్లిమ్ జనాభాలో సుమారు 43 శాతం నిరక్షరాస్యత ఉంది. 2001లో ముస్లిమ్ లలో నిరక్షరాస్యతా శాతం 42. 5 ఉంటే ఇప్పుడు 42. 7 శాతం. అంటే ఇంతటి సుదీర్ఘ ప్రస్థానంలో కేవలం 0. 2 శాతం మాత్రమే పెరుగుదల నమోదైందన్న మాట. ముస్లింలలో గ్రాడ్యుయేషన్, ఆపై చదువులు చదువుతున్న వారి సంఖ్య 6.96 శాతం మాత్రమేనని అప్పట్లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన ముఖ్తార్ అబ్బాస్ నక్వీ చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 43 శాతం ముస్లిం జనాభాలో కేవలం 2.75 శాతం మాత్రమే గ్రాడ్యుయేట్లు ఉన్న విషయం వాస్తవమేనా? అని రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి(vijayasai reddy) అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి (ఇప్పుడు మాజీ) ఈ విషయం తెలిపారు.
ఇందుకు కారణాలేమిటి?
వివిధ పథకాలు, కార్యక్రమాల కింద ముస్లిమ్‌లలో అక్షరాస్యత సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని చెప్పుకుంటున్నప్పటికీ ఇలాంటి దయనీయ స్థితికి కారణాలేమిటన్న ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం లేదు. ఇక దీన్ని బట్టి మైనారిటీల విద్యాభివృద్ధికి ప్రభుత్వాలు ఎంత గొప్ప కృషి చేశాయో, చేస్తున్నాయో మనం బాగా అర్థం చేసుకోవచ్చు. ఐదు నుంచి తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కల పిల్లల్లో 50 శాతం ముస్లిమ్ పిల్లలు మాత్రమే పాఠశాలకు వెళుతున్నారు. మధ్యలో బడి మానేస్తున్న పిల్లల జాబితాలో కూడా ముస్లిముల పిల్లలే అధికంగా ఉంటున్నారు. అయితే, ఇక్కడ తమాషా ఏమిటంటే, ముస్లిమ్ మైనారిటీల వెనుకబాటుకు, దుర్భర దారిద్య్రానికి విద్యా లేమి ఎంతకారణమో, వారు తమ పిల్లలను చదివించుకోలేకపోవడానికి ఆర్ధిక వెనుక బాటు కూడా అంతే కారణం. ఈ రెండింటికీ మధ్య అవినాభావ సంబంధమేర్పడి వారి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. సర్కారు బడులేమో బాధ్యతాయుతంగా పనిచేయవు.
కార్పొరేట్ పాఠశాలల్లో చదివించుకోడానికి వారి ఆర్థిక స్థోమత సహకరించదు. ఇదీ పరిస్థితి. ఏదో ఒక రకంగా అష్టకష్టాలు పడి ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు దొరకడం అంత సులభమేంకాదు. ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా వారికి ఉద్యోగాలు లభించవు. భయంకరమైన వివక్ష ఏమిటంటే, కొన్ని విభాగాలు అనధికారికంగా ముస్లిములకు ఉద్యోగాలు ఇవ్వరాదన్న విధానాన్ని పాటిస్తున్నట్లు తెలుస్తోంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ముస్లిములకు హక్కులు ఎలా లభిస్తాయి? వారి సంక్షేమం ఎలా సాధ్యం? ఇక కాస్త ఉన్నత స్థాయి ఉద్యోగాల విషయానికొస్తే, ఐఏఎస్‌లలో 3.0 శాతం, ఐఎఫ్‌ఎస్‌లో 1.8 శాతం, ఐపీ ఎస్‌లలో 4.0 శాతం, రైల్వేస్‌లో 4.5 శాతం, పోలీస్ శాఖలో 6.0 శాతం, ఆరోగ్య శాఖలో 4 శాతం, రవాణా శాఖలో 6.5 శాతం న్యాయశాఖలో 7.8 శాతం మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. మొత్తంగా చూసినప్పటికీ ఏ రంగంలోనూ ముస్లిమ్ మైనారిటీల పరిస్థితి సంతృప్తికరంగా లేదని మనకు అర్థమవుతుంది. జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ (sachar committee) నివేదిక లోని 9 వ అధ్యాయం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
ఓటు బ్యాంకు రాజకీయాలు మానాలి
ఇక రాజకీయ ప్రాతినిధ్యం విషయానికొస్తే, లోక్ సభ, రాజ్య సభలలో మొత్తం సభ్యుల సంఖ్య 790. ఇందులో 51 మంది మాత్రమే ముస్లిమ్ సభ్యులు. 245 మంది రాజ్య సభ సభ్యులకు 24 మంది , 545 మంది లోక్ సభ సభ్యులకు 27 మంది మాత్రమే ముస్లిమ్ మైనారిటీలున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. శాసన సభల్లో ప్రాతినిధ్యం కూడా దీనికి భిన్నంకాదు. దేశం మొత్తం మీద నాలుగు వేల పైచిలుకు శాసనసభ్యులుంటే, కనీసం నాలుగు వందల మంది కూడా ముస్లిమ్ శాసన సభ్యులు లేరు. సుమారు పదిహేను రాష్ట్రాలలో ఒక్క శాసనసభలో కూడా ముస్లిముల ప్రాతినిధ్యం లేదు. అసలు అదీ, ఇదీ అని కాకుండా ఏ రంగంలో కూడా ముస్లిమ్ మైనారిటీల ప్రాతినిధ్యం ఏమాత్రం సంతృప్తికరంగా లేదన్నది నిర్వివాదాంశం. దేశంలోని అతి పెద్ద రెండవ మెజారిటీ సముదాయ ప్రజలు అన్ని రంగాలలో తమ హక్కుల నిరాకరణకు గురవుతుంటే, ఇక దేశ స్వాతంత్య్రానికి, దేశ నాగరికతకు, ప్రగతి వికాసాలకు ఏమైనా అర్థం ఉంటుందా? భారత్ లాంటి లౌకిక, ప్రజాస్వామ్య దేశానికి ఇది మాయని మచ్చకాదా? మైనారిటీల హక్కుల ఉల్లంఘన, వారి పట్ల వివక్ష, పక్షపాత విధానాలను ఇలాగే కొనసాగిస్తే అనేక త్యాగాలతో సాధించుకున్న స్వతంత్ర భారత భవిష్యత్తు ఖచ్చితంగా మసక బారిపోతుంది.
కనుక ఇప్పటికైనా పాలకవర్గాలు కళ్లు తెరిచి ముస్లిమ్ మైనారిటీల సంక్షేమానికి, స్వతంత్ర భారతంలో న్యాయవంతమైన, రాజ్యాంగ బద్దమైన వారి హక్కును వారికి అందించడానికి ప్రయత్నించాలి. దానికోసం ఏదో చేయాల్సిన అవసరం లేదు. జస్టిస్ సచార్ నివేదికను అమలు పరిస్తే చాలు. ముస్లింలు కూడా, ఎవరో ఏదో చేస్తారని గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటే సరిపోదు. ఓటుబ్యాంకు రాజకీయాలను తిప్పికొట్టి తమకు కావలసింది, తమకు దక్కాల్సింది సాధించుకునే దిశగా సామాజిక చైతన్యంతో, నిర్దిష్టమైన ప్రణాళికతో వజ్ర సంకల్పం బూనాలి. ప్రజా ప్రాతినిధ్య చట్టాల్లో తమ హక్కు వాటా పొందడానికి కార్యాచరణ రూపొందించుకోవాలి. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక, మౌలిక హక్కుల సాధనకు, జనాభా ప్రాతిపదికన సామాజిక, రాజకీయ, ఆర్థిక, ప్రైవేట్ , పబ్లిక్ జీవన రంగాలన్నిటిలో అందరితో పాటు ముస్లింల ప్రాతినిధ్యానికి, అవకాశాలు కల్పించాలి. మైనారిటీ అత్యాచార నిరోధక చట్టం తీసుకురావాలి. ముస్లింల వ్యక్తిగత చట్టాల పరిరక్షణకు హామీ ఉండాలి.
చివరగా
అన్యాక్రాంతమై పోయిన వేలాది ఎకరాల వక్ఫ్ భూములు, కోట్లాది రూపాయల విలువ చేసే ఇతరేతర ఆస్తుల్ని బాధ్యుల నుండి రాబట్టాలి. ఆస్తులు రికవరీ చేయలేని పరిస్థితిలో నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వాలే మైనారిటీలకు నష్టపరిహారం చెల్లించాలి. ఉద్యోగ ఉపాధి రంగాలతోపాటు, పంచాయితీ మొదలు పార్లమెంటు వరకు ముస్లిములకు వారి జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలి. ఇంకా ఇలాంటి అనేక హక్కులు సాధించుకోడానికి దేశంలోని విశాల హృదయులు, లౌకిక వాదులు, ప్రజాస్వామ్య ప్రేమికులు, హక్కుల నేతలు, బహుజనులతో కలిసి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకు రావాలి. ఈ విధంగా సమిష్టి కృషి, పోరాటాల ద్వారానే తప్ప, తమకు తాముగా ప్రభుత్వాలే బలహీనుల హక్కుల్ని గుర్తిస్తాయనుకోవడం అమాయకత్వమే అవుతుంది.
(నేడు జాతీయ మైనారిటీ హక్కుల దినోత్సవం)
ఎండీ ఉస్మాన్‌ఖాన్
సీనియర్ జర్నలిస్ట్
99125 80645






