ఎబోలా వైరస్‌పై ఆందోళన వద్దు.. అప్రమత్తతే ముద్దు..!

by Ravi |   (  Updated:2026-06-09 00:45:15  IST  )

ఎబోలా వైరస్ లక్షణాలు, వ్యాప్తి మార్గాలు, నివారణ చర్యలు, చికిత్సకు సంబంధించిన కీలక సమాచారం ఈ వ్యాసంలో పొందుపరచబడింది. భయపడకుండా సరైన జాగ్రత్తలు పాటించడం, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా ఎబోలాను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.

ఎబోలా వైరస్‌పై ఆందోళన వద్దు.. అప్రమత్తతే ముద్దు..!
X

కోవిడ్-19 విషాదం నుంచి దేశ ప్రజలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాం అనుకుంటున్న తరుణంలో మరొక వైరస్ కలకలం సృష్టిస్తోంది. అదే ఎబోలా వైరస్. ఇతర దేశాల నుండి ఇప్పుడిప్పుడే భారత్‌లోకి ప్రవేశిస్తున్న ఈ వైరస్ పట్ల అప్రమత్తత అవసరం.

ఈ వైరస్‌కు సహజ వాహకాలు..

గబ్బిలాలు, కోతులు, చింపాంజీలు, అడవి దుప్పులు లాంటి జంతువులు ఈ వైరస్‌కు సహజ వాహకాలు. వాటి మాంసాన్ని సరిగా ఉడికించకుండా తినడం, అనారోగ్య జంతువును తాకడం ద్వారా వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. వ్యాధిగ్రస్తుడి శరీర ద్రవాల ద్వారా, అంటే రక్తం, చెమట, ఉమ్మి, వాంతి, విరేచనాలు, వీర్యం ద్వారా ఇతరులకు సోకుతుంది. రోగి ఉపయోగించిన సూది, సిరంజి, బట్టలు, పరుపులు తాకినా వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. ముఖ్యంగా వైద్యశాలల్లో పరిశుభ్రత లేకుండా సూదులు మళ్లీ మళ్లీ వాడడం వల్ల వేగంగా వ్యాప్తి చెందుతుంది. గాలి ద్వారా, ఆహారం లేదా నీటి ద్వారా మాత్రం ఎబోలా వ్యాపించదు.

లక్షణాలు..

వైరస్ శరీరంలోకి ప్రవేశించిన 2 నుండి 21 రోజుల మధ్య లక్షణాలు బయటపడతాయి. మొదటి దశలో సాధారణ వైరల్ జ్వరం లాగానే ఉంటుంది. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కీళ్ల నొప్పులు, గొంతు నొప్పి, కడుపు నొప్పి, బలహీనతతో రోగి నీరసించిపోతాడు. రెండవ దశలో వాంతులు, విరేచనాలు మొదలై శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కొంత మందిలో చర్మంపై దద్దుర్లు, కళ్లలో రక్తం, ముక్కు, చిగుళ్ల నుండి రక్తస్రావం కనిపిస్తుంది. ఈ దశలోనే మరణాలు ఎక్కువగా సంభవిస్తాయి. అందుకే జ్వరంతో పాటు అనుమానాస్పద లక్షణాలు కనిపించగానే స్వీయ వైద్యం చేసుకోకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆసుప త్రికి వెళ్లాలి. ముందుగా గుర్తించి శరీరంలో నీటి శాతం నిలబెట్టి, ఇతర ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త తీసుకుంటే కోలుకునే శాతం గణనీయంగా పెరుగుతుంది.

నివారణ మార్గం..

వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రజలందరికీ వేయడం సాధ్యం కాదు. అందుకే వ్యక్తిగత జాగ్రత్తలే మనకు పెద్ద రక్షణ. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని, వారి శరీర ద్రవాలను తాకకూడదు. చేతులు సబ్బుతో రోజుకు అనేక సార్లు కడుక్కోవాలి. రోగులకు సేవ చేసే వైద్యులు, నర్సులు, కుటుంబ సభ్యులు తప్పకుండా గ్లౌజులు, మాస్క్, గౌన్, కళ్లద్దాలు ధరించాలి. రోగి మరణించిన తర్వాత కూడా అతని శరీరం నుండి వైరస్ వ్యాపిస్తుంది కాబట్టి, అంత్యక్రియలు ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం మాత్రమే చేయాలి. సాంప్రదాయ పద్ధతిలో శవాన్ని కడగడం, ముద్దు పెట్టుకోవడం లాంటి ఆచారాల వల్ల గ్రామాల్లో వేగంగా వ్యాపించిన ఉదంతాలు ఉన్నాయి.

వ్యాధి సోకితే దాచిపెట్టవద్దు!

దేశంలో ఇప్పటివరకు ఎబోలా వ్యాప్తి జరగలేదు. అంత ర్జాతీయ విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్, ప్రయాణ చరిత్ర పరిశీలన ద్వారా ప్రమాదాన్ని అడ్డుకుంటున్నారు. విదేశాల నుండి వచ్చే వారు తమకు జ్వరం, అలసట లాంటి లక్షణాలు ఉన్నా దాచిపెట్టకుండా అధికారులకు నిజం చెప్పాలి. పుకార్లు, వాట్సాప్ మెసేజ్‌లు చదివి భయపడకుండా, కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య శాఖల అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలి.

రోగిని వెలి వేయడం పెద్ద తప్పు!

ఎబోలా రోగిని సమాజం నుండి వెలివేయడం మరో పెద్ద తప్పు. వ్యాధి కారణంగా అతను, ఆమె అప్పటికే శారీరకంగా బాధపడుతుంటే, మానసికంగా కూడా కుంగిపోయేలా చేయడం సరికాదు. జాగ్రత్తలు పాటిస్తూ వారికి ధైర్యం చెప్పాలి. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలి. బడి పిల్లలకు చేతులు కడుక్కోవడం, అపరిశుభ్రంగా ఉండకుండా ఉండడం నేర్పాలి. ఎబోలా భయపెట్టే వ్యాధే కానీ అజేయమైనది కాదు. శుభ్రత, సకాలంలో చికిత్స, సరైన సమాచారం ఈ మూడింటితో దాన్ని జయించవచ్చు. అనుమానం వచ్చిన వెంటనే దాచిపెట్టకుండా 104 హెల్ప్‌లైన్ లేదా సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించండి. మీ చిన్న జాగ్రత్త మీ కుటుంబాన్ని, మీ ఊరిని కాపాడుతుంది. అప్రమత్తంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం.

-సుధాకర్.ఏ.వి

90006 74747

Next Story