- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆచారాల ఆనందం... సంబరాల దసరా
సంబరాలకు చిరునామా... ఆచారాలను ఆదరించేది.. సాంప్రదాయాలు వెల్లివిరిసేది.. పిల్లలకు వినోదాన్ని పంచేది... అదే సరదాల దసరా పండగ!

సంబరాలకు చిరునామా... ఆచారాలను ఆదరించేది.. సాంప్రదాయాలు వెల్లివిరిసేది.. పిల్లలకు వినోదాన్ని పంచేది... అదే సరదాల దసరా పండగ! రావణున్ని రాముడు చంపిన రోజు, మహిషాసురుణ్ని దుర్గమ్మ హతమార్చిన రోజు, చెడుపై మంచి గెలిచిన రోజు. అదే విజయదశమి. నవరాత్రి అనేది దైవిక స్త్రీత్వాన్ని గౌరవించే తొమ్మిది రోజుల హిందూ పండుగ. ఈ పండుగ తొమ్మిది రూపాల ఆరాధనకు అంకితం చేయబడింది, వీటిలో ప్రతి ఒక్కటి బలం, జ్ఞానం, ధైర్యం, భక్తి, రక్షణ వంటి వివిధ దైవిక లక్షణాలను సూచిస్తుంది. దసరా నవరాత్రులు ఏటా శరదృతువులో ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు జరుగుతాయి. అందుకే వీటిని శరన్నవరాత్రులని అంటారు. మహిషాసురుడిపై విజయం సాధించిన రోజు గనుక విజయదశమిగా, దసరాగా ఈ పండుగను దేశ విదే శాల్లోని వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల్లో జరుపుకుంటారు.
వైవిధ్యభరితంగా వేడుకలు..
దేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో దసరా వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి.. సప్తమి, అష్టమి, నవమి తిథులలో బెంగాలీలు దుర్గామాతకు విశేష పూజలు చేస్తారు. దశమినాడు కాళీమాతను పూజిస్తారు. కోల్‌కతాలో కొలువుతీర్చిన దేవీవిగ్రహాలను నవరాత్రుల చివరిరోజున హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు.. ఒడియా మహిళలు నవరాత్రుల సందర్భంగా మానికలో వడ్లు నింపి, ఆ మానికను లక్ష్మీదేవిలా భావించి పూజిస్తారు.. విజయదశమి తర్వాత వచ్చే పున్నమి వరకు ఒడిశాలో మహిళలు ‘జొహ్ని ఉసా’ వేడుకలను జరుపుకుంటారు. గౌరీదేవిని ఆరాధిస్తూ జరిపే ఈ వేడుకలు తెలంగాణలోని ‘బతుకమ్మ పండుగ’ వేడుకలను పోలి ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో దసరా వైవిధ్యం..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ వివిధ ప్రాంతాల్లో దసరా వేడుకలు వైవిధ్యభరితంగా సాగుతాయి. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం గ్రామంలో దసరా సందర్భంగా ఏనుగు సంబరాలను నిర్వహిస్తారు.. విజయనగరంలో గజపతుల ఆడపడుచు పైడితల్లికి పూజలు చేస్తారు.. కృష్ణాజిల్లా రేవు పట్టణం బందరులో దసరా సందర్భంగా శక్తి పటాల ఊరేగింపు నిర్వహిస్తారు. తెలంగాణలో దసరా నవరా త్రులలో బతుకమ్మ ఉత్సవాలు జరుపుకొంటారు. తంగేడు, గునుగు వంటి రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది మహిళలంతా ఉత్సాహంగా ఆటపాటలతో ఆనంది స్తారు. చివరి రోజున నిమజ్జనం చేసిన తర్వాత పండుగ జరుపుకుంటారు. ఆడపడుచులు ఈ వేడుకలను కన్నవారిళ్లలో జరుపుకోవడం ఆనవాయితీ. ప్రకృతికి దేవతాకృతినిచ్చి ప్రకృతితో మమేకమై ప్రకృతిని పరిరక్షిస్తేనే జగతి మనుగడ అన్న సందేశాన్ని ఇచ్చే పండుగ.
పగటి వేషాల పండుగ...
గంగిరెద్దుల మేళం, బొమ్మల కొలువు, దసరా వేషాలు.. అన్నీ పండుగ శోభను పెంచే అంశాలు. ముఖ్యంగా చెప్పుకో వలసింది పగటివేషాలు (లేదా పైటే వేషాలు). వేషధారణ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే లక్ష్యం. ఇవి పగటిపూట ప్రదర్శించబడతాయి కాబట్టి ‘పగటివేషాలు’ అనే పేరు వచ్చింది. మొదటిది భిక్షుక వృత్తిగా ప్రారంభమై, ఆ తరువాత పౌరాణిక, కల్పిత, హాస్య వేషాల రూపంలో ప్రాచుర్యం పొందింది. ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తేవడానికి, వర్తమానాలపై స్పందించడానికి ఈ వేషాలు ఉపయోగపడేవి. కాలక్రమంలో ఆదరణ తగ్గి, ఈ కళ మళ్లీ భిక్షుక వృత్తిగా మారింది.
దసరా సందర్భంగా చాముండేశ్వరి దేవిని తొమ్మిది అవతారాల్లో అలంకరించి పూజించడం ఆనవాయితీగా ఉంది. చాముండేశ్వరి పుణ్యక్షేత్రాన్ని హోయసలులు 12వ శతాబ్దంలో నిర్మించినట్లు ఆధారాలున్నాయి. నవరాత్రి ఏడో రోజు నుంచి 12 రోజులు దేవిని సర్వాభరణాలతో అలంకరించడం విశేషం. ఈ ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మికత, సంగీతం, సాహిత్యం, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా మారతాయి. ఆధ్యాత్మికం ఆనందం సాంసృతి సాంప్రదాయాల సరదాల సమూహం దసరా.
- వాడవల్లి శ్రీధర్
99898 55445
- Tags
- Dussera Festival






