మన అస్తిత్వానికి ప్రతీక ఇదేనా..?

by Ravi |   (  Updated:2025-02-27 01:00:38  IST  )

ఎస్సీ రిజర్వేషన్లలో మాదిగ వర్గానికి దాని ఉపకులాలకు అన్యాయం జరుగుతోందని, గత మూడు దశాబ్దాలుగా పోరాడుతున్న ఆ వర్గానికి

మన అస్తిత్వానికి ప్రతీక ఇదేనా..?
X

ఎస్సీ రిజర్వేషన్లలో మాదిగ వర్గానికి దాని ఉపకులాలకు అన్యాయం జరుగుతోందని, గత మూడు దశాబ్దాలుగా పోరాడుతున్న ఆ వర్గానికి సుప్రీంకోర్టు గతేడాది ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ వర్గీకరణ కోసం జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ వేసింది. ఈ కమిషన్ 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించి, వర్గీకరణను ప్రతిపాదించింది.

అయితే కమిషన్ అధ్యయనం జరుగుతున్న సమయంలోనే ఎమ్మార్పీఎస్ మాదిగల అస్తిత్వాన్ని చూపెట్టడానికి ‘లక్ష డప్పులు, వేయ్యి గొంతుకల’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం జరిగేలోగా వర్గీకరణ సమస్య కొలిక్కి రావడంతో ఇది వాయిదా పడింది. కానీ, ఈ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహిస్తామని ఎమ్మార్పీఎస్ అధినాయకత్వం చెపుతోంది. ఈ నేపథ్యంలో లక్ష డప్పుల కార్యక్రమ ఆవశ్యకతను పరిశీలించాల్సిన అవసరం ఉంది.

డప్పులు.. మన అస్తిత్వాన్ని పెంచుతాయా?

నేటి ఆధునిక యుగంలో సమాజం ఉన్నత చదువులు చదివి ముందుకు వెళ్తుంటే మాదిగ జాతి ఇంకా డప్పులు కొడుతూ ఆత్మగౌరవం లేని కళ ప్రదర్శన చేయాలనడం సబబేనా? మాదిగలకు జనాభా ప్రకారం విద్య, ఉద్యోగాలలో వర్గీకరణ వర్తింపచేయాలనడం కరెక్టే. ప్రభుత్వం వర్గీకరణకు సానుకూలంగా స్పందించినప్పుడు లక్ష డప్పులతోని సాంస్కృతిక ప్రదర్శన చేస్తామనడం వెనక ఉద్దేశ్యం ఏమిటి? ఇప్పటికే రాజకీయ సొయి లేకుండా కొందరు మాదిగలు ఆధిపత్య రాజకీయ పార్టీల మీటింగ్‌లలో డప్పుల ప్రదర్శనలు ఇవ్వడం, పాటల పాడుతూ మన జాతి గౌరవాన్ని దిగజార్చుతున్నారు. నేటి కంప్యూటర్ యుగంలో మాదిగ సమాజం అనుసరించాల్సిన మార్గం ఇదేనా? ఒకసారి మేధావి వర్గం ఆలోచన చేయాలి. అసలు వర్గీకరణ కావాలా.. వద్దా? ఒకవైపు వర్గీకరణ చేయడానికి ముందడుగు పడుతుంటే, మాదిగలకు 11 శాతం బదులు 9 శాతం వచ్చిందని వర్గీకరణ వ్యతిరేక శక్తులు మరోవైపు చర్చ పెడుతున్నారు. రెండు శాతం తగ్గిందనే కారణంతో లక్ష డప్పుల కళ ప్రదర్శనను స్వాగతిద్దామా? మన అస్తిత్వానికి ప్రతీక డప్పులే అని భావిస్తే అదే డప్పుని కొట్టుకుంటూ జీవిస్తే ఈ సమాజంలో మనకు విలువ ఉందా? అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇప్పుడిప్పుడే ఆధునికంగా ముందుకు పోతున్న మాదిగ జాతి యువకులకు లక్ష డప్పుల కార్యక్రమంతో గ్రామాలలో యువత మళ్లీ డప్పులు కొని, ఆట నేర్చుకునే పరిస్థితి ఏర్పడింది. పాటలతో కళాబృందాలు మోత మొదలైంది. ఇదే ఆట, పాట, డప్పులతో ఎన్ని రోజులు జీవిద్దామని ఒకసారి మాదిగ సమాజం ఆలోచించాలి.

భారత రాజ్యాంగ ప్రదర్శన చేయాలి!

నిజానికి ఈ ఉప వర్గీకరణ ద్వారా కేవలం 15 నుంచి 20 శాతం మాత్రమే లబ్ధి జరుగుందని మేధావులు భావన. ఇదే ఈ జాతి అంతిమ లక్ష్యంగా భావించడం పొరపాటు. ఒకవైపు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తగ్గుతున్నాయి, మరోవైపు ప్రైవేటీకరణతో రిజర్వేషన్‌కు గండిపడుతుంది. ఇప్పుడు డప్పులే మన అస్తిత్వానికి ప్రతికగా అనుకుంటే మనం బాగుపడలేం. బాగా చదివి విద్యా, ఉద్యోగాలలో రాణించాల్సిన అవసరం ఉన్నది. ప్రజాప్రతినిధులుగా మన జాతి గౌరవాన్ని నిలబెట్టాలి. కానీ డప్పుల ప్రదర్శన వంటి అసంబద్ధమైన, అశాస్త్రీయమైన కార్యక్రమాల ద్వారా జాతిని వెనక్కి నెట్టవద్దు. వర్గీకరణ అనేది ఒక జాతి సామాజిక న్యాయానికి సంబంధించిన సమస్య. దీనికి ఎమ్మార్పీఎస్ చేసిన కృషి కాదనలేం. కానీ ఇదే అంతిమ లక్ష్యం కారాదు. రాజకీయ యుద్ధమే మాదిగ జాతి అంతిమ లక్ష్యం కావాలి. ఇందులో మాలలను కూడా కలుపుకొని సమైక్యంగా ముందుకెళ్లాలి. ఏ పార్టీలకు లొంగక స్వశక్తితో మాదిగ సమాజం సాంస్కృతిక నిర్మాణం జరగాలి. సంత్ రవిదాస్ సాంస్కృతిక మార్గాన్ని తెలుసుకొని ముందుకు వెళ్లాలి. బుద్ధుడు, పూలే, అంబేడ్కర్, కాన్సిరాం మార్గంలో నడవాలి. అనేక కులాలు తమ కులవృత్తులను వదిలి సమాజంలో ఉన్నతంగా జీవించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో మాదిగ నాయకులు ఆదిమ కాలం నాటి సంస్కృతిని ప్రోత్సహించడం సరైనది కాదు. యువతను విద్యా, ఉద్యోగాల్లో రాణించమని చెప్పాలి. రాజకీయ వాటా కోసం ప్రశ్నించాలి. ఏనాడైనా అంబేడ్కర్ ఈ డప్పుల ప్రదర్శనలతో, ఆటపాటలతో మీటింగ్‌లు పెట్టాడా? చేతిలో చిల్లి గవ్వ లేకున్నా సూట్ ధరించి ఆత్మ గౌరవంతో ప్రపంచం ముందు నిలుచున్నాడు. కావున ఇప్పుడు మాదిగల అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే లక్ష డబ్బులు వదిలి, లక్ష భారత రాజ్యాంగాలను పట్టుకొని ప్రదర్శన చేయించాలి. ఎందుకంటే సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రశ్నించే అవకాశాన్ని రాజ్యాంగం ఇచ్చింది. ఇదే నిజమైన సాంస్కృతిక అస్తిత్వానికి నిదర్శనం.

సంపతి రమేష్ మహారాజ్

సామాజిక విశ్లేషకులు

79895 79428

Next Story