- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మందులు మేలా? ముప్పా?
మందులు ప్రాణాలను కాపాడగలవు.. కానీ వాటి దుర్వినియోగం ప్రాణాలకు ముప్పు. తెలంగాణ హెల్త్ వీక్ సందర్భంగా డ్రగ్ కంట్రోల్ చర్యలపై విశ్లేషణతో పాటు, ఔషధ భద్రతపై అవగాహన అవసరాన్ని తెలుసుకోండి.

ఒక మాత్ర ప్రాణాన్ని కాపాడగలదు. అదే మాత్ర తప్పుడు వినియోగం ప్రాణాన్ని తీయగలదు కూడా. ఆరోగ్యాన్ని రక్షించాల్సిన ఔషధాలు నియంత్రణ లేకపోతే ప్రమాదంగా మారే ఈ విరుద్ధ పరిస్థితి మన సమాజం ఎదుర్కొంటున్న నిశ్శబ్ద సంక్షోభం.. వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినా, మందుల వినియోగంపై అవగాహన, నియంత్రణ లేకపోతే ఆ పురోగతి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడలేకపోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఏప్రిల్ 6 నుంచి 11 వరకు నిర్వహించిన హెల్త్ వీక్‌లో, ఏప్రిల్ 11ను 'డ్రగ్ కంట్రోల్ రెగ్యు లేటరీ స్ట్రెంగ్తెనింగ్ డే' గా నిర్వహించడం గమనార్హం.
సరైన ఔషధం సరైన మోతాదులో..
మందుల భద్రత అంటే కేవలం నాణ్యత మాత్రమే కాదు. సరైన ఔషధం సరైన రోగికి, సరైన మోతాదులో, సరైన సమయంలో అందుబాటులో ఉండాలి. కానీ వాస్తవ పరిస్థితు ల్లో నకిలీ మందులు, గడువు ముగిసిన ఔషధాలు, నియంత్రణలో లేని విక్రయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత, అవగాహన లోపం, ఫార్మసీ నియంత్రణ బలహీనతలు సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేస్తున్నాయి. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ చేప డుతున్న తనిఖీలు, అనధికార విక్రయాలపై చర్యలు, కఠిన నిబంధనలు వంటి చర్యలు సానుకూల సంకేతాలే.. అయితే, ఇవి నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్నాయా? లేక ప్రత్యేక కార్యక్రమాలకే పరిమితమవుతున్నాయా? అన్న ప్రశ్న కీలకం. తాత్కాలిక చర్యలు కాకుండా, వ్యవస్థాగత మార్పులు లేకపోతే ప్రజల నమ్మకం నిలబడదు.
మందుల దుర్వినియోగం పెద్ద ప్రమాదం!
ఇక నియంత్రణ పేరుతో చిన్న ఫార్మసీలపై అనవసర ఒత్తిడి పడకూడదు.. గ్రామీణ ప్రాంతాల్లో అవే ప్రాథమిక ఆరోగ్య సేవలకు ఆధారం. కాబట్టి నియంత్రణ వ్యవస్థ కఠిన తతో పాటు సమతుల్యతను పాటిస్తూ, చిన్న ఫార్మసీలను కేవలం తనిఖీలకు లోబడి ఉన్న యూనిట్లుగా కాకుండా, ప్రజారోగ్య వ్యవస్థలో బాధ్యతాయుత భాగస్వాములుగా గుర్తించాలి. ముఖ్యంగా అలవాటుగా మారే మందుల దుర్వినియోగం ఒక పెద్ద ప్రమాదంగా మారుతోంది. నిద్ర మాత్రలు, నొప్పి నివారణ మందులు వంటి ఔషధాలు ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా సులభంగా లభ్యమవుతున్నాయి. యువతలో వీటి వినియోగం పెరుగుతుండటం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబ, సామాజిక స్థిరత్వానికి కూడా ముప్పు..
మందుల భద్రతపై విశ్వాసం ముఖ్యం!
ఈ పరిస్థితుల్లో ప్రజల బాధ్యత కూడా అంతే ముఖ్యం. వైద్యుడి సలహా లేకుండా మందులు వాడకూడదు.. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవాలి. అలాగే ఆరోగ్య రంగంలో నైతికత అత్యంత ప్రాముఖ్యం. ఒక సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే, మందుల భద్రతపై ప్రజలకు విశ్వాసం కలగాలి. ఆ విశ్వాసం పారదర్శక చర్యలు, కఠిన అమలు, నిరంతర పర్యవేక్షణ ద్వారానే వస్తుంది. ఈ దిశగా ‘డ్రగ్ కంట్రోల్ రెగ్యులేటరీ స్ట్రెంగ్తెనింగ్ డే’ ఒక ప్రారంభ సంకేతం మాత్రమే.. దాన్ని నిరంతర సంస్కరణ ప్రక్రియగా మార్చగలిగితేనే ప్రజారోగ్య పరిరక్షణకు నిజమైన అర్థం చేకూరుతుంది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ప్రాణాలను కాపాడాల్సిన మందులే ప్రమాదంగా మారే పరిస్థితిని మనం అంగీకరిద్దామా? లేక నియంత్రణను కఠినతరం చేసి, బాధ్యతను పంచుకుని, ఒక సురక్షిత ఆరోగ్య వ్యవస్థను నిర్మిద్దామా? సమాధానం స్పష్టమే. ప్రజారోగ్యం అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత కాదు, కేవలం వ్యక్తిగత జాగ్రత్త కూడా కాదు, అదొక సమిష్టి నిబద్ధత. ఆ నిబద్ధత చర్యగా మారినప్పుడే, మందులు సమస్యగా మారకుండా నిజంగా ఉపశమనం కలిగిస్తాయి.
- యండి. ఉస్మాన్ ఖాన్
99125 80645






