- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దృశ్యం 3 : ఈ కథకు ఇంకా ముగింపు రాలేదు..
'దృశ్యం 3' రివ్యూలో జార్జ్‌కుట్టి కథకు నిజంగా ముగింపు ఉందా? నేరం, న్యాయం, జ్ఞాపకాలు, కుటుంబ బంధాల మధ్య సాగిన ఈ థ్రిల్లర్‌పై పూర్తి విశ్లేషణ, నటీనటుల ప్రదర్శన, కథనం, సాంకేతిక అంశాలపై సమగ్ర సమీక్ష.

ఒకప్పుడు సినిమా చివరలో తెరపై కనిపించే "శుభం" అనే కార్డు కథ ముగిసిందనే సంకేతం మాత్రమే కాదు, ప్రేక్షకుడి అను భవానికి మంగళం పలికే సంప్రదాయం కూడా. కాలం మారడంతో ఆ "శుభం" క్రమంగా అదృశ్యమైంది. దాని స్థానంలో "కొనసాగుతుంది..." అనే భావన వచ్చింది. సీక్వెల్స్, సినిమాటిక్ యూనివర్స్‌ల యుగంలో కథలకు అంతిమ ముగింపు ఉండడం అరుదైపోయింది. ఈ మార్పును అత్యంత ఆసక్తికరంగా ప్రతిబింబించిన చిత్రాల్లో దృశ్యం సిరీస్ ఒకటి.
ఒక కుటుంబాన్ని కాపాడుకోవడానికి చెప్పిన ఒక్క అబద్ధం ఎన్ని కొత్త కథలకు దారి తీస్తుందో చూపించిన ఈ సిరీస్, ప్రతి భాగంతో నేరం, న్యాయం, జ్ఞాపకాలు, అపరాధభావం గురించి కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒక సాధారణ కేబుల్ టీవీ ఆపరేటర్ జీవితంలో జరిగిన అసాధారణ సంఘటనతో ప్రారంభమైన ఈ కథ, నేరం–శిక్ష–న్యాయం అనే సాంప్రదాయ భావనలను ప్రశ్నిస్తూ ప్రేక్షకుల ఆలోచనలను సవాలు చేసింది.
భారతీయ థ్రిల్లర్ సినిమాల్లోనే అరుదైనది..
'దృశ్యం' సినిమా విజయానికి ప్రధాన కారణం ఆ కథను చెప్పిన విధానం. దర్శకుడు జీతూ జోసెఫ్ కేవలం ఓ హత్యా రహస్యాన్ని చెప్పడానికి మాత్రమే ప్రయత్నించలేదు. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక తండ్రి ఎంతవరకయినా వెళ్లగలడని చూపించాడు. అందుకే జార్జ్ కుట్టి ఒక వ్యక్తిగా కాకుండా ఒక ప్రతీకగా మారిపోయాడు. దృశ్యం మొదటి భాగంలో ప్రేక్షకుడు పోలీసుల కంటే ముందుగానే నిజాన్ని తెలుసుకుంటాడు. అయినప్పటికీ ఉత్కంఠత తగ్గదు. ఎందుకంటే ప్రశ్న "హత్య ఎవరు చేశారు?" కాదు. "ఈ కుటుంబం ఎలా బయటపడుతుంది?" అనేదే ఈ కథన వ్యూహం. భారతీయ థ్రిల్లర్ సినిమాల్లోనే చాలా అరుదైన చిత్రమిది.
కుటుంబం ఉనికిపై వస్తున్న సీరీస్
దృశ్యం రెండో భాగం మరింత ఆసక్తికరమైన ప్రయోగంగా చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చిన దృశ్యం–3 చూసినప్పుడు జార్జ్ కుట్టి కథకు నిజంగా ముగింపు ఉంటుందా? ఒక అబద్ధాన్ని దాచడానికి మరో అబద్ధం అవసరం అవుతుంది. ఒక రహస్యాన్ని కాపాడుకోవడానికి మరో రహస్యం పుడుతుంది. ఈ తర్కం ప్రకారం చూస్తే జార్జ్ కుట్టి కథ ఎప్పటికీ ముగియకూడదు. ఎందుకంటే అతడు దాచింది కేవలం ఒక నేరం కాదు. ఒక కుటుంబం ఉనికి.
జర్నలిస్టు తిరగదోడిన కేసు..
దృశ్యం–3 లో జార్జ్ కుట్టి (మోహన్‌లాల్) గతంలో జరిగిన విషయాల్ని పక్కనపెట్టి కుటుంబంతో సాధారణ జీవితం గడుపుతూ, సినిమా నిర్మాతగా మారతాడు. తన జీవితంలోని చేదు అనుభవాల ఆధారంగా 'దృశ్యం' అనే సినిమాను నిర్మిస్తాడు, అది సూపర్ హిట్ అయి అతని పేరు దేశమంతా మార్మోగేలా చేస్తుంది. కానీ ఒక జర్నలిస్ట్ జార్జ్ కేసును సీరియస్‌గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఆధారాలు సేకరిస్తూనే ఉంటుంది, దీంతో కథ మళ్లీ మొదటికి వస్తుంది. తెలుగు ప్రేక్షకులకు ఇది కొంచెం ఇబ్బందికరంగానే మొదలవుతుంది. ఎందుకంటే తెలుగు దృశ్యం సిరీస్‌కి అలవాటు పడిన వారికి ఇందులో పాత్రలు చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి, వాటిపై క్లారిటీ వచ్చేసరికి సగం సినిమా అయిపోతుంది. మొదటి సగం నెమ్మదిగా, పెద్దగా ఆసక్తికర మలుపులు లేకుండా సాగిపోతుంది.
కొనసాగింపు కథే సానుకూలాంశం
ఇంతకుముందు వాటిల్లా కాకుండా, ఈసారి మొదటి రెండు భాగాలకు ఇది నేరుగా కొనసాగింపుగా రాసుకున్నారు అన్నది ఒక సానుకూల అంశం. మోహన్‌లాల్ జార్జ్ కుట్టి పాత్రలో ఎప్పట్లానే ఒదిగిపోయాడు, మీనా, అన్సీబా, ఎస్తర్ కుటుంబ సభ్యులుగా పాత్రలకు పర్వాలేదనిపించుకున్నారు, అయితే సిద్దిఖీ పాత్రకు సరైన కారణం ప్రేరణ లేకపోవడంతో అతని క్రిమినల్ ప్లానింగ్ సన్నివేశాలు పేలవంగా అని పిస్తాయి. సతీష్ కురుప్ ఛాయాగ్రహణం బాగుంది. కొన్ని షాట్‌లు గొప్పగా ఉంటాయి. అనిల్ జాన్సన్ నేపథ్య సంగీతం దృశ్యాలకు బలాన్నిచ్చింది. అయితే తెలుగు డబ్బింగ్ సరిగా కుదరలేదనే చెప్పాలి.
జ్ఞాపకాలను పాతిపెట్టడం సాధ్యమా?
దృశ్యం–3 కథ ముగింపు ఎట్లా వున్నా అది నేరం గురించిన కథ కాదు. అది జ్ఞాపకాల గురించి అపరాధభావం గురించి సాగుతుంది. కాలం మనిషిని ఎలా వెంబడిస్తుందో చెప్పే కథ. ఎందుకంటే శవాన్ని దాచవచ్చు. ఆధారా లను నాశనం చేయవచ్చు. కానీ జ్ఞాపకాలను పాతిపెట్టడం సాధ్యం కాదు కదా. ఈ సిరీస్‌లో జార్జ్‌కుట్టి పాత్రను పోషించిన మోహన్ లాల్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అతని కళ్లలో కనిపించే భయం, నిశ్శబ్దంలో వినిపించే ఆందోళన, కుటుంబం కోసం ప్రాణం పెట్టే తండ్రి ప్రేమ ఇవి అన్నీ పాత్రను సజీవంగా మార్చాయి. అతను కేవలం ఒక హీరో కాదు. సాధారణ మనిషి. అందుకే అసాధారణంగా గుర్తుండిపోతాడు.
న్యాయం, చట్టం మధ్య చిక్కుకున్న మనిషి విషాదం..
దృశ్యం సిరీస్ మనకు మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. చట్టం ఎప్పుడూ న్యాయాన్ని సూచించకపోవచ్చు. న్యాయం ఎప్పుడూ చట్టం పరిధిలోనే ఉండకపోవచ్చు. ఈ రెండింటి మధ్య చిక్కుకుపోయిన మనిషి విషాదమే ఈ కథ యొక్క అసలు పాయింట్. కానీ ఫిలిం ఎడిటింగ్‌లో వున్న గందరగోళం ప్రేక్షకుల్లో కొంత సంక్లిష్టతని అస్పష్టతని కలిగిస్తుంది. జార్జ్ కుట్టి కథ ఇంకా ముగియలేదు. కొనసాగిస్తే బహుశా అది ఎప్పటికీ ముగియకపోవచ్చు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో, ప్రతి మనిషిలో, ప్రతి జ్ఞాపకంలో ఒక "దృశ్యం" ఇంకా మిగిలే ఉంటుంది.
-వారాల ఆనంద్
94405 01281






