- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కులాల మధ్య చిచ్చు పర్యవసానం..
80-90ల గ్రామీణ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన ‘దూరదర్శని’ సినిమా పాత జ్ఞాపకాలు, కుల రాజకీయాలు, ప్రేమ, భావోద్వేగాలను చూపించే ప్రయత్నం చేసింది. కథ, నటన, సాంకేతిక అంశాలపై సమీక్ష.

చిన్న చిత్రాలకు కథలే ప్రాణం.. వాటి చుట్టూ కాస్త ఎమోషనల్ టచ్ ఉంటే సగం విజయం వచ్చినట్టే. కాకుంటే సింగల్ లైన్ చుట్టూ రెండు గంటలు చిత్రమంటే కష్టం. కథ.. కథనాలు బాగుంటే ఒకే. కానీ విసిగిస్తే మాత్రం ప్రేక్షకులు సమయం తినేసినట్లే. కథల కోసం ఈ మధ్య చిన్న చిత్రాల దర్శకులు పాత జ్ఞాప కాలను తడుముతున్నారు. మొన్న ‘తిమ్మరాజుపల్లి టి.వి.’ నేటి ‘దూరదర్శని’ ఈ కోవకే చెందుతాయి. వారానికి పదిహేను చిన్న చిత్రాలు విడుదలవుతున్న వర్తమానంలో ‘దూరదర్శని’ ఎంతవరకు అలరించిందో చూడవలసిందే.
కులచిచ్చును రేపిన కథ..
‘దూరదర్శని’ - కలిపింది ఇద్దరిని (ఉప శీర్షిక). దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడో ఉప శీర్షిక చెబుతుంది. హరి (సువీక్షిత్ బొజ్జ) వెనుకబడిన కులానికి చెందినవాడు. వాణి (గీతిక రతన్) పెద్దింటి పిల్ల. వీరిద్దరి ప్రేమకి పేకబాబు (భాస్కర్) ఇల్లు వేదిక. కారణం ప్రతిరోజూ టి. వి. చూడటానికి హరి వారింటికి వెళతాడు. హరి, వాణి ప్రేమల విషయం పేకబాబుకు తెలుస్తుంది. వారిద్దరినీ విడ దీయాలనుకొని వాణి అన్నయ్య పరశురామ్ (విజయ్ కృష్ణారెడ్డి)ని పావులా వాడుకుంటాడు. అతనికి లేనిపోనివి చెప్పి గ్రామంలో కులచిచ్చుకు కారణమవుతాడు. అయితే వాణి, హరిల ప్రేమ కథ విషయం పరశురామ్‌కి తెలుస్తుంది. తరువాత పరిణామాలు ఏమిటి? కులాల మధ్య చిచ్చు పర్యవసానం ఎలా ముగిసింది అనేవి తెరపైన చూడాలి. 80 – 90ల నాటి వింటేజ్ ప్రేమకథ ఇది. ప్రస్తుతం ఇదో ట్రెండ్. తీపి జ్ఞాపకాలను గుర్తుకు తెస్తున్నారు. ఆ రోజుల్లో టి. వి. ఉన్నవాడింటికి అందరూ చేరిపోయేవారు. సమస్తమయిన సమస్యలు, చర్చలు, ప్రేమలు, రాజకీయాలు అక్కడే నడిచేవి. ఈ ‘దూరదర్శని’లో కూడా ఇదే విషయం.
కమర్షియల్ పాయింట్స్ లేని కథనం..
కథలో పాయింట్ కొత్తదికాదు. తక్కువ కులం హీరో, పెద్దింటి అమ్మాయి. కుటుంబం వీరి ప్రేమకు అడ్డు. ఘర్షణలు, చివరికి సుఖాంతం. ఇంతే. అయితే కథ, కథనం, పాత్రలు, సంభాషణలు, హృదయాన్ని హత్తుకొనే సన్నివేశాలు అవసరం. ఇవి ఈ సినిమాలో చాలా తక్కువగానే ఉన్నాయి. కనుక ప్రేక్షకుడకి ఎమోషనల్ కనక్టుకావటం కష్టమే. అయితే ఎటువంటి కమర్షియల్ పాయింట్స్ లేకుండా, నిజాయితీగా దర్శకుడు చిత్రాన్ని తీశాడు. కథనం నెమ్మదిగా ఉండటం, ‘తిమ్మరాజుపల్లి టి. వి.’ సినిమా ఛాయలు కనిపించటం కొంత లోపం. ‘విశ్రాంతి’ వరకు లవ్, స్నేహితుల మధ్య నవ్వుల చిత్రం సరదాగా, ఆసక్తిగా సాగుతుంది. తరువాత పరశురాంకి విషయం తెలియటం, హీరోపై దాడి వంటివి కాస్త ఉత్కంఠతను కలిగిస్తాయి. చివరిలో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఎమో షనల్ కు గురిచేస్తుంది. స్క్రీన్‌ప్లేలో జాగ్రత్తలు తీసుకొని ఉంటే మరింత ‘మంచి చిత్రం’ అనిపించేది.
పాత్రలలో సర్దుకున్నారు..
చిత్రంలో నటీనటులంతా కొత్తవారే. అయినా బాగానే పాత్రల్లో సర్దుకున్నారు. హరి పాత్రకి సువీక్షిత్ న్యాయం చేశాడు. పల్లెటూరి అమ్మాయిగా గీతికా రతన్ మంచి నటనతో ఆకట్టుకుంది. పేక బాబుగా భాస్కర్ బాగా చేశాడు. హీరోయిన్ అన్నయ్యగా విజయ్ కృష్ణారెడ్డి బాగున్నా మిగిలిన పాత్రల్లో తేజవిహాన్, బాలరాజు పులుసు, పాండు నవ్వించారు. రాజు పాత్ర నవ్వుతూ ఏడిపిస్తుంది.
పల్లె అందాలను ఆరబోసిన సినిమా
ప్రేమకథకి కావలసిన ఫీల్‌ను ఫొటోగ్రాఫర్ సునీల్ పొన్న తేవ టానికి ప్రయత్నం చేశాడు. పల్లెటూరి అందాలను చక్కగా ఆవిష్కరించారు. ఇటువంటి కథలకు సంగీతం, బి. జి. యమ్ లు ప్రాణాన్ని ఇస్తాయి. ఆనంద్ తడబడ్డాడనిపిస్తుంది. దర్శకుడు కార్తికేయ కొమ్మి తనకున్న వనరుల మేరకు చిత్రాన్ని పూర్తిచేశాడానిపిస్తుంది. సాంకేతికంగా చిత్రం బాగుందనిపిస్తుంది. నిర్మాతలు జయశంకర్ రెడ్డి, సంతోష్ కుమార్లు చిత్రాన్ని తీసి ఆ తరం వారికి కొన్ని జ్ఞాపకాలను గుర్తుచేశారు. ఓ మంచి ప్రయత్నం.
- భమిడిపాటి గౌరీశంకర్
94928 58395






