- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పక్క రాష్ట్రంతో లొల్లి వద్దు.. నీళ్లు కావాలి!
తెలుగు నేల మీద ప్రవహించే కృష్ణా, గోదావరి నదులు కేవలం నీటి ప్రవాహాలు కావు.. అవి కోట్ల మంది రైతుల కళ్లల్లోని కలలు, గుండెల్లోని సెగలు!

‘తెలుగు నేల మీద ప్రవహించే కృష్ణా, గోదావరి నదులు కేవలం నీటి ప్రవాహాలు కావు.. అవి కోట్ల మంది రైతుల కళ్లల్లోని కలలు, గుండెల్లోని సెగలు! దశాబ్దాలుగా ఈ నీటి కంటే ఎక్కువగా పాలకుల రాజకీయ విమర్శలే ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఒకవైపు పొరుగు రాష్ట్ర పాలకుల వ్యూహాత్మక చాణక్యం, మరోవైపు తెలంగాణ పాలకుల ఆత్మాభిమాన పోరాట పటిమ మధ్య సామాన్య రైతు మాత్రం తన పొలం ఎండిపోకుండా గంగమ్మ ఎప్పుడు వస్తుందా అని ఆకాశం వైపు చూస్తున్నాడు...
తాజాగా ఇప్పుడు తెరపైకి వచ్చిన 'సయోధ్య' మంత్రం జల వివాదాలకు శాశ్వత విముక్తిని ప్రసాదిస్తుందా? లేక కొత్త చిక్కుముడులకు దారితీస్తుందా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. లొల్లి వద్దు నీళ్లు కావాలన్న రేవంత్ రెడ్డి మాటల్లోని ఆంతర్యం.. నల్లమల సాగర్ పూర్తి చేస్తామన్న చంద్రబాబు పట్టుదల మధ్య అసలు ప్రయోజనం ఎవరిది? చట్టబద్ధమైన హక్కుల రక్షణలో రాజీ పడితే చరిత్ర అస్సలు క్షమించదు. ఈ జల జగడం రాజకీయాలకు అతీతంగా పరిష్కారమైతేనే తెలుగు నేల సుభిక్షంగా ఉంటుంది."
దశాబ్దాల దగా...
2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతపు సాగునీటి హక్కులు తీవ్రమైన వివక్షకు, అణచివేతకు గురయ్యాయి. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుల నుండి బచావత్ కమిటీ నివేదికల వరకు ప్రతి అంశంలోనూ తెలంగాణకు దక్కాల్సిన వాటా నీటిని అప్పటి పాలకులు మళ్లించారన్నది చారిత్రాత్మక సత్యం. ఉమ్మడి పాలనలో ప్రాజెక్టుల అనుమతులు ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్ల తెలంగాణలోని మెట్ట ప్రాంతాలు ఎడారిగా మారాయి. ఈ అన్యాయమే మలిదశ తెలంగాణ ఉద్యమానికి నీళ్లు అనే నినాదాన్ని ప్రధాన అస్త్రంగా మార్చింది. పదేళ్ల కిందట ఉన్న దుర్భర పరిస్థితుల నుండి బయటపడటానికి జలవనరుల విభజన అనేది చట్టబద్ధమైన హక్కుగా మారింది.
తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడ్డాకా..
తెలంగాణ ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వం 2016లో సాగునీటి ప్రాజెక్టులను పునర్నిర్మించడం ఒక సాహసోపేతమైన నిర్ణయం. కాళేశ్వరం వంటి అతిపెద్ద ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ఒడిసిపట్టి చట్టబద్ధమైన హక్కులను స్థిరపరచుకోవడానికి పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనికి తోడు డిసెంబర్ 2014లో ప్రభుత్వం 46,000 చెరువులను పునరుద్ధరించడం పల్లెల్లో భూగర్భ జల నిధిని పెంచింది. భారతీయ సాగు సూచీ ప్రకారం తెలంగాణలో సాగు విస్తీర్ణం 240 శాతం పెరగడం వెనుక పటిష్టమైన చట్టబద్ధమైన వ్యూహం ఉంది. గత దశాబ్ద కాలంలో సాధించిన ఈ విజయాలు కేవలం రాజకీయ ఫలితాలు కావు. ఇవి తెలంగాణ రైతులకు కల్పించబడిన శాశ్వతమైన జల ఆస్తి. ప్రస్తుత ప్రభుత్వం కూడా సంక్షేమ ఫలాలను మరింత సమర్థవంతంగా అందించడానికి అవసరమైన చర్యలు చేపడుతోంది. ఈ పథకాల కొనసాగింపు రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. అయితే నేటికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని తొమ్మిదవ షెడ్యూల్ ప్రకారం కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో ఇప్పటికీ స్పష్టత లేకపోవడం సమస్యను మరింత క్లిష్టతరం చేస్తోంది.
రేవంత్ రెడ్డి కొత్త వ్యూహం..
ఈ నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానం వివాదాల కంటే పరిష్కారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. రంగారెడ్డి వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త చర్చకు దారితీశాయి. ‘పంచాయతీలు కావాలా.. నీళ్లు కావాలా.. అంటే నీళ్లే కావాలి’ అని చెప్పడం ద్వారా ఆయన రాజకీయ ఘర్షణలకు స్వస్తి పలకాలని చూస్తున్నారు. కేంద్రం నుండి నిధులు, బ్యాంకుల నుండి రుణాలు పొందాలంటే ప్రాజెక్టులపై ఉన్న అడ్డంకులు తొలగిపోవడం అత్యవసరమని ఆయన భావిస్తున్నారు. తెలంగాణకు ఓడరేవు అనుసంధానం వంటి భారీ లక్ష్యాలు నెరవేరాలంటే పొరుగు రాష్ట్రంతో స్నేహపూర్వక సంబంధాలు అవసరమన్నది ప్రస్తుత ప్రభుత్వ వాదన.
ఆంధ్రా చాణక్యం..
తెలంగాణలో సయోధ్య చర్చలు నడుస్తున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నల్లమల సాగర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాయలసీమను రతనాల సీమగా మార్చడమే లక్ష్యమని ఆయన చెబుతుండటం తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రయోజనాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. శ్రీశైలం నుండి నీటి తరలింపు విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలు ఇప్పటికీ పరిష్కారం కాకుండానే కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు రావడం ఆందోళనకరం. ఏడు మండలాల విలీనం వల్ల పోలవరం పనులకు మార్గం సుగమమైందని పొరుగు రాష్ట్రం భావిస్తోంది. ఇది భౌగోళికంగా తెలంగాణకు జరిగిన నష్టంగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రం వేసే ఒక అడుగుకు ప్రతిగా తెలంగాణ పది అడుగులు వేస్తుందన్న రేవంత్ మాటలు ఏ మేరకు కార్యరూపం దాల్చుతాయో చూడాలి.
పక్క రాష్ట్రాల సహకారం అవసరమే కానీ..
జల జగడం రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కావాలంటే కేవలం భావోద్వేగాలు సరిపోవు. చట్టబద్ధమైన, శాస్త్రీయమైన పంపిణీ అవసరం. కృష్ణా నది యాజమాన్య బోర్డు పరిధి, నికర జలాల వాటా తేలకముందే ప్రాజెక్టుల అనుమతుల విషయంలో రాష్ట్రాలు రాజీ పడటం ప్రమాదకరమైన పరిణామం కావచ్చు. అంతిమంగా తెలంగాణ రైతు ప్రయోజనాలే పరమావధిగా చర్చలు సాగాలి. ఓడరేవుల అనుసంధానం, పారిశ్రామిక అభివృద్ధికి పొరుగు రాష్ట్రాల సహకారం అవసరమే. అది నీటి వాటా విషయంలో బలహీనత కాకూడదు. సంక్షోభం నుండి సమృద్ధికి చేరిన తెలంగాణ వ్యవసాయం రాజీ మార్గంలో దెబ్బతినకుండా చూడటమే నేటి పాలకుల ముందున్న అతిపెద్ద సవాలు.
-ఫిరోజ్ ఖాన్,
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
96404 66464






