దక్షిణాదికి అన్యాయం చేయొద్దు!

by Ravi |   (  Updated:2025-03-01 00:45:59  IST  )

జాతీయ హిందీ భాషను బలవంతంగా దక్షిణ భారత రాష్ట్రాలపై రుద్దడం వల్ల స్థానిక భాషలు అంతరిస్తాయని, ప్రస్తుతం తమిళనాడు

దక్షిణాదికి అన్యాయం చేయొద్దు!
X

జాతీయ హిందీ భాషను బలవంతంగా దక్షిణ భారత రాష్ట్రాలపై రుద్దడం వల్ల స్థానిక భాషలు అంతరిస్తాయని, ప్రస్తుతం తమిళనాడు సీఎం స్టాలిన్‌ పేర్కొంటున్నారు. హిందీని తప్పనిసరి చేయడాన్ని కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు. దీనికి తోడుగా 2026లో చేపట్టనున్న డీలిమిటేషన్‌ పూర్తి అయితే దక్షిణ భారత ప్రాంతం అన్యాయానికి గురవుతోందని ఆందోళనలో దక్షిణ భారత పార్టీలు, పౌర సమాజం మునిగి పోతున్నది. దీంతో ఎక్కడ చూసినా డీలిమిటేషన్‌‌పైనే చర్చ జరుగుతున్నది. అయితే ఈ అనుమానాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా కొట్టిపారేసినప్పటికీ దక్షిణాదిలో చాలామంది దీని పట్ల పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి పదేళ్లకు ఒకసారి జనగనణ తర్వాత జనాభా ప్రాతిపదికన రాష్ట్రాల పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలు, నియోజకవర్గ ప్రాంతాలను పునర్విభజన చేసే ప్రక్రియను డీలిమిటేషన్‌ అని పిలుస్తున్నాం. అధిక జనాభా కలిగిన రాష్ట్రాలకు అధిక నియోజక వర్గాలు, తక్కువ జనాభా కలిగిన రాష్ట్రాలకు తక్కువ స్థానాలు కేటాయించడం జరుగుతూ వస్తున్నది. డీలిమిటేషన్‌ ద్వారా ఎస్సీ, ఎస్టీ స్థానాలు కూడా పునర్ నిర్వచించబడతాయి.

2026 వరకు పొడిగించి..

1976లో కుటుంబ నియంత్రణ అమలును పెద్ద ఎత్తున చేపట్టిన నేపథ్యంలో డీలిమిటేషన్‌ ప్రక్రియను 25 ఏండ్ల వరకు పొడిగించారు. ఆ తర్వాత మరో రెండుసార్లు పెంచి మొత్తంగా 1971 తర్వాత డీలిమిటేషన్‌ ప్రక్రియను 50 ఏండ్ల వరకు పొడిగించారు. అయితే ఈ ప్రక్రియ ఇప్పుడు పూర్తి అయితే 141 కోట్ల జనాభాకు పార్లమెంట్‌ స్థానాలు 753 వరకు పెరగవచ్చని అర్థం అవుతున్నది. ఇప్పుడు ఉన్న ఎంపీ స్థానాల కన్న 210 స్థానాలు పెరుగుతాయని, కుటుంబ నియంత్రణ పాటించని అధిక జనాభా కలిగిన యూపీ, బిహార్‌ లాంటి రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు అధికంగా పెరగవచ్చని దక్షిణ భారత్ భయపడుతున్నది. కుటుంబ నియంత్రణను పాటించి జనాభాను నియంత్రించిన దక్షిణ భారత రాష్ట్రాలను డీలిమిటేషన్‌ వల్ల అన్యాయం జరుగుతుందని దక్షిణాది గళం పెంచడం సముచితంగా, సమర్థనీయంగా కనిపిస్తున్నది.

అభ్యంతరాలు ఏమిటి?

ప్రస్తుతం దక్షిణ భారతంలో 24 శాతం అంటే 129 ఎంపీ స్థానాలు (543 మొత్తం స్థానాలు) ఉన్నాయి. తెలంగాణలో 17, ఏపీలో 25, కేరళలో 20, తమిళనాడులో 39, కర్ణాటకలో 28 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ప్రతి ఎంపీ స్థానానికి 20 లక్షల జనాభాను నిర్ణయించి 2026లో డీలిమిటేషన్‌ చేసినట్లయితే తెలంగాణలో 20, ఏపీకి 28, కేరళలో 19, తమిళనాడులో 41, కర్ణాటకలో 36 సీట్లు మాత్రమే కేటాయించడం జరుగుతుంది. అంటే దక్షిణ భారతంలో ఎంపీ స్థానాలు 129 నుంచి 144 వరకు కేవలం 15 సీట్లు మాత్రమే పెరుగుతాయని దక్షిణ భారతం ఆగ్రహిస్తుంది. దేశవ్యాప్తంగా 753 ఎంపీ స్థానాల్లో 19 శాతం నియోజకవర్గాలు మాత్రమే దక్షిణాది రాష్ట్రాల్లో పెరగడం జరగవచ్చు. అదే యూపీలో ఎంపీ స్థానాలు ప్రస్తుత 80 నుంచి 128 వరకు(పెరుగుదల 48), బీహార్‌లో 40 నుంచి 70 వరకు(పెరుగుదల 30), మధ్యప్రదేశ్‌లో 29 నుంచి 47 వరకు(పెరుగుదల 18), మహారాష్ట్రంలో 48 నుంచి 68 వరకు(పెరుగుదల 20), రాజస్థాన్‌లో 25 నుంచి 44 వరకు(పెరుగుదల 19) నియోజకవర్గాలు పెరుగుతాయి.

జనాభాను నియంత్రించిన పుణ్యానికి బహుమతిగా దక్షిణాదికి ఎంపీ సీట్లు తగ్గడం, జనాభాను అదుపు చేయని ఉత్తర భారతానికి అధిక ఎంపీ సీట్లు కేటాయించడం జరిగితే దక్షిణ - ఉత్తర భారతాల మధ్య విభేదాలు పెరిగడం, దక్షిణ భారతాన్ని ఒక దేశంగా విభజించాలని ప్రతిపాదనలు కూడా బలపడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశాభివృద్ధిలో ప్రధాన భూమికను నిర్వహిస్తున్న దక్షిణాది మెడపై డీలిమిటేషన్‌ కత్తి చూపితే రెండు ప్రాంతాల మధ్య ఘర్షణ వాతావరణం మొలకెత్తడం తప్పనిసరి కావచ్చు. దేశ హితం కోరే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ప్రకటించడానికి బదులు డీలిమిటేషన్‌ వేదికగా అన్యాయం చేయడం విచారకరం, అభ్యంతరకరం కూడా.

డా. బుర్ర మధుసూదన్ రెడ్డి

99497 00037

Next Story