ఈ బ‌డ్జెట్‌లో బీసీల‌కు న్యాయం చేయండి!

by Ravi |   (  Updated:2026-03-10 00:46:06  IST  )

తెలంగాణలో బీసీలు 56 శాతం జనాభా ఉన్నప్పటికీ బడ్జెట్ కేటాయింపులు అదే స్థాయిలో లేవని విమర్శలు వినిపిస్తున్నాయి. 2026–27 బడ్జెట్ నేపథ్యంలో బీసీ సబ్‌ప్లాన్, నిధుల కేటాయింపులు, కామారెడ్డి డిక్లరేషన్ హామీల అమలుపై చర్చ.

ఈ బ‌డ్జెట్‌లో బీసీల‌కు న్యాయం చేయండి!
X

తెలంగాణ రాష్ట్ర 2026–27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమీపిస్తున్న వేళ, బీసీలకు న్యాయం అనే అంశం మళ్లీ ప్రధాన‌ చర్చగా మారింది. 2024లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కులగణన ప్రకారం రాష్ట్ర జనాభాలో బీసీలు 56.33 శాతం ఉన్నారు.. ఈ వాస్తవం రాష్ట్ర సామాజిక నిర్మాణాన్ని స్పష్టంగా చూపుతున్నప్పటికీ, ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల్లో అదే నిష్పత్తి కనిపించకపోవడం బీసీలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

భారీగా హామీలిచ్చినప్పటికీ..

జనాభాలో సగానికి పైగా ఉన్న వర్గానికి అభివృద్ధి నిధులు సమానంగా అందకపోతే, అది కేవలం ఆర్థిక లోపం కాదు.. సామాజిక అసమానతకు నాంది. వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, కార్మిక రంగాలు, వాణిజ్య కార్యకలాపాలు ఈ రంగాలన్నింటికీ బీసీలు వెన్నెముకలా నిలుస్తున్నారు. అలాంటి వర్గం విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారతలో వెనుకబడితే, రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యం కాదు.. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా ఏటా రూ.20,000 కోట్లు కేటాయిస్తామని, ఐదేళ్లలో లక్ష కోట్లు వెచ్చిస్తామని, బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత ఇస్తామని, 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీలు ఇచ్చింది. ఇవి బీసీలలో భారీ ఆశలను రేకెత్తించాయి. అయితే అధికారంలోకి వచ్చి గత రెండేళ్లలో బీసీలకు బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదల గణాంకాలు బీసీల ఆశలకు సరితూగలేదని బీసీ సంఘాలు వాదిస్తున్నాయి. హామీలతో పోలిస్తే కేటాయింపులు తక్కువగా ఉండటం, నిధుల విడుదల మరింత తగ్గిపోవడం విశ్వాస సంక్షోభానికి దారితీస్తోంది.

ఇది రాజకీయ ప్రయోజనం కాదు!

ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లు జనాభా ప్రాతిపదికన అమలవుతున్నాయి. అదే విధంగా బీసీ సబ్‌ప్లాన్‌ను చట్టబద్ధం చేసి, జనాభా దామాషా ప్రకారం కేటాయింపులు చేయాలన్న డిమాండ్ అన్యాయమైనది కాదు. 56 శాతం జనాభాకు తగిన నిధులు ఇవ్వడం సామాజిక సమతుల్యానికి అవసరం. ఇది ఓట్ల రాజకీయమో, పార్టీ ప్రయోజనమో కాదు.. రాజ్యాంగబద్ధ బాధ్యత. బీసీ సబ్‌ప్లాన్ సరైన రీతిలో అమలైతే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, విదేశీ విద్యా అవకాశాలు, స్వయం ఉపాధి పథకాలు, బీసీ బజార్లు, హాస్టళ్లు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు బలోపేతం అవుతాయి. కానీ తగిన నిధులు లేకపోతే పథకాలు కాగితాలపైనే మిగిలిపోతాయి.. నిధుల కేటాయింపు మాత్రమే కాదు, వాటి సకాల విడుదల, పారదర్శక వినియోగం కూడా సమానంగా ముఖ్యమే.

బీసీలను నిర్లక్ష్యం చేస్తే..

ఈసారి 2026–27 బడ్జెట్‌ను ప్రభుత్వం ‘డెలివరీ బడ్జెట్’గా నిలబెట్టుకోవాలంటే, బీసీల హామీలను అమలు చేయడంలో స్పష్టమైన సంకల్పం చూపాలి. కనీసం రూ.25,000 కోట్లు లేదా జనాభా దామాషా ప్రకారం మరింత ఎక్కువ నిధులను కేటాయించాలి. బీసీ కార్పొ రేషన్లు, సహకార బ్యాంకులు బలోపేతం చేయాలి. పథకాల అమలు పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలి. బీసీలు రాష్ట్ర అభివృద్ధికి మూలస్తంభాలు.. వారిని నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి అసమానంగా మారుతుంది. ఈ బడ్జెట్ కేవలం లెక్కల పుస్తకం కాకుండా, న్యాయానికి ప్రతిబిం‌బంగా ఉండాలి. తెలంగాణ అభివృద్ధి అంటే అన్ని వర్గాల సమగ్రాభివృద్ధి. ఆ సూత్రాన్ని ఆచరణలో చూపించాల్సిన సమయం ఇదే. 2026–27 బడ్జెట్ బీసీలకు న్యాయం చేసి, రాష్ట్ర సామాజిక సమరసతకు బలమైన పునాది వేయాలి. అదే నిజమైన ప్రజాపాలనకు పరీక్ష.

- మేకల కృష్ణ,

తెలంగాణ జర్నలిస్టుల ఫోరం

9948556978

Next Story