- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డైట్ కాలేజీ లెక్చరర్.. రెండు పీజీలు చేయాలా..?
తెలంగాణ డైట్ లెక్చరర్ నియామకాలలో ఎంఈడీని తప్పనిసరి అర్హతగా పేర్కొనడంపై చర్చ కొనసాగుతోంది. సంబంధిత సబ్జెక్టులో పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించాలనే డిమాండ్ పెరుగుతోంది. విద్యా విధానం, ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ యువత సమస్యలపై విశ్లేషణ.

ప్రస్తుతం ఉన్నత విద్య, పరిశోధనలకు యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రతిభావంతు లైన అభ్యర్థులు అవకాశాలకు దూరమయ్యే పరిస్థితి ఉండకూడదు. ఒకవైపు పరిశోధనలను ప్రోత్సహిస్తూనే మరోవైపు ఆ పరిశోధన చేసినవారికి ఉద్యోగ అవ కాశాల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడం విధానపరమైన వైరుధ్యంగా కనిపిస్తోంది.
పీజీతోపాటు ఎంఈడీ అర్హత తప్పదా?
తెలంగాణలో ఇటీవలే పాఠశాల విద్యాశాఖ పరిధిలోని డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (DIET) కాలేజీల్లో 86 లెక్చరర్ల పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 19 రకాల పోస్టులుండగా దాదాపు అన్ని పోస్టుల్లో అర్హతగా సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీ ర్ణతతో పాటు ఎంఈడీ అర్హత ఉండాలని పేర్కొన్నారు.
30 ఏళ్లు చదువు.. ఉద్యోగ జీవితం?
డిగ్రీ పూర్తి చేసే సరికి ఒక వ్యక్తికి దాదాపుగా 22 ఏళ్ల వయసు ఉంటుంది. ఆ తర్వాత ఎంఈడీ .. ఇలా డిగ్రీ పట్టా పొందిన తర్వాత పీజీ, బీఈడీ, ఎంఈడీ పూర్తిచేసే సరికి దాదాపు 28 నుండి 30 ఏళ్ల వయస్సు వస్తుంది. పేరుకేమో పెద్ద చదువు.. దానికి సమానంగా జీతభత్యాలు ఉండవు. డిగ్రీ కళాశాల, యూనివర్సిటీ స్థాయి అధ్యాపకుల నియామక ప్రక్రియలో అభ్యర్థి కనీస అర్హతగా యూజీసీ నిబంధనల ప్రకారం సంబంధిత సబ్జెక్టులో పీజీ, పీహెచ్డీ, నెట్/సెట్ వంటి విద్యార్హతలు ఉంటే చాలుకదా?
రెండు పీజీలెందుకు స్వామీ?
అయితే టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌లోని 3.4 నిబంధన ప్రకారం, నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతకు సమానమైన (Equivalent) అర్హత కలిగిన అభ్యర్థుల విషయంలో నిపుణుల కమిటీ సిఫారసు మేరకు కమిషన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు విద్యారంగంలో ఉన్నత పరిశోధన చేసిన పీహెచ్‌డీ అభ్యర్థులను కూడా సమాన అర్హత పరిధిలో పరిగణించే అవకాశాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పీహెచ్‌డీ అనేది కేవలం మరో డిగ్రీ మాత్రమే కాదు, ఒక నిర్దిష్ట అంశంపై లోతైన అధ్యయనం, పరిశోధన, బోధనా సామర్థ్యాలకు నిదర్శనం. మరి డైట్ లెక్చరర్లకు అర్హతగా రెండు పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లు (పీజీలు) ఎందుకు అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది.
నిరుద్యోగులుగా వందలాది పీహెచ్‌డీలు..
తెలంగాణలో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులు భర్తీ కాకుండా పుష్కరకాలం గడిచింది. వందలాది మంది విద్యార్థులు ఏటా ఆయా సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ పూర్తి చేసి అవకాశాలు లేక నిరుద్యోగులుగా మిగిలి ఉన్నారు. కనీసం ఇటువంటి నోటిఫికేషన్లు విడుదల చేసినపుడైనా సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణతతో పాటు ఎంఈడీ లేదా పీహెచ్డీ పూర్తి చేసిన వారికి కూడా అవకాశం కల్పించడం వల్ల వేలాది మంది నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.
అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరగాలి!
ప్రభుత్వం, టీజీపీఎస్సీ వంటి నియామక సంస్థలు మానవతా దృక్పథంతో పాటు విద్యా వ్యవస్థ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డైట్ లెక్చరర్ నియామక పరీక్షకు అర్హతగా ఎంఈడీతో పాటు సంబంధిత సబ్జెక్టులో పీజీ, పీహెచ్‌డీ చేసిన వారికి కూడా అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తాయని ఆశిద్దాం. నోటిఫికేషన్‌లోని సమాన అర్హత నిబంధనను సానుకూలంగా వినియోగించి అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటే విద్యావ్యవస్థకు, నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుంది.
-డా. అక్కెనపల్లి వెంకట్రాంరెడ్డి
ఉస్మానియా యూనివర్సిటీ
97002 06444






