మాండలిక రచనల మాధుర్యం.. యాసే!

by Ravi |   (  Updated:2025-03-24 01:00:54  IST  )

Dialectical writings are sweet.. slang!

మాండలిక రచనల మాధుర్యం.. యాసే!
X

నేడు భాషపై జరుగుతున్న అనేక చర్చల్లో మాండలికం ముందు వరుసలో ఉంటుంది. ఎవరికి వారు తమ మాండలికమే గొప్పది అనే వాదనకు సైతం వెనుకాడరు. తెలుగు భాషలోనూ వివిధ మాండలికాలు ఉన్నాయి. అసలు ఈ మాండలికం అంటే ఏమిటి?

ప్రధాన భాషలో భాగమే అయిన ఉప భాష లేదా ప్రాదేశిక భాషే మాండలికం. అలాగే ఒకే ప్రాంతంలో ఒకే భాషలో మాట్లాడే వివిధ యాసలు. తెలుగు భాషలో కూడా ఎంతోమంది మాండలికంలో తమ కలాన్ని కదిలిస్తూనే ఉన్నారు. ఈ మాండలిక భాష ద్వారా మనం ఆ పుస్తకాన్ని చదువుతున్నంత సేపు మనం కూడా వారి వారి ప్రాంతాల్లో విహరింప చేస్తూ, వాళ్ల సంస్కృతిలో పాఠకులను లీనం చేయడం ద్వారా ఎంతగానో ఉత్సాహపరుస్తుంది. మాండలిక భాషలో చదవడం కష్టమైనప్పటికీ ఇష్టాన్ని పెంచే సౌందర్యం, మమకారం దీని సొంతం. అందుకే మాండలికంలో రాసిన ప్రతి పుస్తకం ఒక మహా అద్భుతం.

శప్తభూమి, తెలుగు వీరుడు

ఈ మధ్యకాలంలో రాయలసీమ మాండలికంలో రాసిన "శప్తభూమి" అనే బండి నారాయణ స్వామి రాసిన నవలకి 2019లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం మనందరికీ తెలిసిన విషయమే. ఇది చారిత్రిక నవల. 18వ శతాబ్దపు రాయలసీమ చరిత్ర నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అనేక గ్రంథాలు మాండలిక భాష ద్వారా పాఠకులకు దగ్గరైనాయి. అలాగే తెలంగాణ మాండలికంలో బిరుదురాజు రామరాజు సేకరించి రచించిన "తెలుగు వీరుడు" అనే చారిత్రాత్మక కథ కూడా అలాంటిదే.

చిన్న పుస్తకమే కానీ సమగ్ర చరిత్ర

తెలుగులో జానపద సాహిత్యం మీద ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొట్టమొదటి పరిశోధనను బిరుదురాజు రామరాజు 1954లో చేశారు. ఆయన సేకరించిన చారిత్రక వీరుడు సదాశివరెడ్డి ఆధారంగా "తెలుగు వీరుడు" పేరిట తానే ఓ నవల రాశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ దీన్ని పునర్ ముద్రించింది. ఈ నవలను సరళ తెలంగాణ పదబంధాలతో, సహజ వర్ణనలతో తీర్చి దిద్దారు. పుటల దృష్ట్యా రచన చిన్నదైనా, ఓ సమగ్ర చరిత్ర వ్యక్తమవుతుంది. సంస్థాన పాలనలోని ఎత్తులు పై ఎత్తులు, కుట్రలు, కుతంత్రాలు ఇందులో విరివిగా కనపడతాయి. కొంతమంది దృష్టిలో వేట అంటే క్రూరజంతువులను చంపడం కాదు.. స్వార్థం కోసం మనుషులను వేటాడటమని అర్థమవుతుంది. రచయిత ఈ నవలలో వందల సామెతలను ప్రయోగించారు. అందుకే ఈ రచన అల్ప పదాల్లో అనల్పార్థ లతో ఆసక్తికరంగా కొనసాగింది. చదవడంలో మాండలిక భాష కావడం కొద్దిగా ఇబ్బంది పెట్టినా ముర్రుపాలలోని కమ్మదనం మదిలో మెదులుతుంది. చదువుతున్నంతసేపు ఆసక్తిగొలిపే అద్భుతమైన రచన, చివరికి నాయకుడు చనిపోయినప్పటికీ మన మనసులో అతని ధీరత్వం తొణికిసలాడుతుంది. ఒక అద్భుతమైన అనుభూతిని ఈ నవల ద్వారా పొందవచ్చు.

పల్లీయుల నిసర్గ సౌందర్యం.. గోపల్లె

ప్రాచీనకాలం నుంచి తమిళనాడులో లక్షలాదిగా తెలుగు వారు నివసిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జిల్లాకొక తీరున మాండలికం ఉన్నట్లే తమిళనాడులో కూడా దాదాపు ప్రతి జిల్లాలోను తెలుగు మాండలికాలు వేరుగా ఉంటాయి. తమిళనాడు తెలుగులో మనకు తెలియని అనేక పల్లె కథలతో పాటు మనకు వినబడిన తెలుగు కథలు కూడా వారు చెప్పే కథల్లో ఉంటాయి. 500 ఏళ్ల క్రితం నాటి తెలుగు మాండలిక భాషలో రాసిన అత్యద్భుతమైన నవల "గోపల్లె". రచయిత కి.రాజనారాయణ్. ఈ పుస్తకం రెండు సంపుటాలుగా వెలువడ్డది. దీనిని తెలుగు భాషలోకి అనువాదం చేసినవారు నంద్యాల నారాయణ రెడ్డి. ఇందులో అక్కడి ప్రజల సంస్కృతి సంప్రదాయాలను అద్భుతంగా వివరించారు. ముఖ్యంగా వలస జీవితానికి సంబంధించిన ఒక కుటుంబం కథను తీసుకొని రచయిత ఈ గోపల్లె, గోపల్లె జనాలు అనే నవలల ద్వారా వివరించారు. తమిళనాట తెలుగువారి నోళ్ళలో నానుతున్న కథలను ఉన్నది ఉన్నట్టే, విన్నది విన్నట్టే ఈ కథలలో ప్రధానంగా పొందుపర్చారు.

మన యాసే - మన భాష

ఇలా ప్రతి భాషలో వారి వారి మాండలిక పరమైన యాస, సంస్కృతి సంప్రదాయాలు పాటించిన రచనలు చేయడం ద్వారా భాషకు సంబంధించిన అసలు సిసలు మాధుర్యం సంస్కృతి తెలుస్తుంది. ఈ రచనలు చదవడం ద్వారా వివిధ భాషల్లోని ప్రజల స్వచ్చమైన జీవితాలను ఆస్వాదించవచ్చు. ఇలాంటి రచనలు ఆయా భాషలకు జీవనాడుల వంటివి. అందుకే ప్రజల కవి కాళోజీ 'మన యాసే - మన భాష' అని నినదించారు.

తోట ప్రశాంత్ కుమార్

పరిశోధక విద్యార్థి

96420 28045

Next Story