ఎమర్జెన్సీని ఎదిరించి నిలిచిన ప్రజాస్వామ్యం

by Ravi |   (  Updated:2025-06-25 01:01:05  IST  )

రాజ్యం తలచుకుంటే ప్రజాస్వామ్య విలువలు ఎంత వేగంగా ధ్వంసం కాగలవో, అధికార కేంద్రీకరణ కారణంగా ప్రజాస్వామ్యం

ఎమర్జెన్సీని ఎదిరించి నిలిచిన ప్రజాస్వామ్యం
X

రాజ్యం తలచుకుంటే ప్రజాస్వామ్య విలువలు ఎంత వేగంగా ధ్వంసం కాగలవో, అధికార కేంద్రీకరణ కారణంగా ప్రజాస్వామ్యం ఎంత పెళుసుగా మారుతుందో స్పష్టంగా నిరూపించింది 1975లో అమలయిన అత్యవసర పరిస్థితి. నాడు నేడు పరిస్థితు లకు మధ్య స్పష్టంగా కనిపించే సారూప్యతలలో ఒకటి అధికార కేంద్రీకరణ.. పద్ధతులు భిన్నంగా ఉన్నప్పటికీ, బలమైన మెజారిటీ ప్రభుత్వంతో కార్యనిర్వాహక వ్యవస్థలో అధికార కేంద్రీకరణ గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి..

1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ "అంతర్గత అల్లర్ల" సాకుతో విధించిన ఎమర్జెన్సీ 21 నెలల 15 రోజుల కాలం దేశాన్ని చీకటి రాత్రుల్లో‌కి నెట్టివేసింది. ప్రజల ప్రజాస్వామిక హక్కులైన ప్రాథమిక హక్కులను కాలరాసి, పౌర స్వేచ్ఛను నియంత్రించి, సెన్సార్షిప్ పేరుతో మీడియా స్వేచ్ఛపై నియంత్రణ విధించి, అసమ్మతిని అణచివేయడం, (నాసా) జాతీయ భద్రతా చట్టం, (మీసా) అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం కింద అమాయక ప్రజలను జైళ్లలో నిర్బంధించడం, న్యాయ వ్యవస్థపై ఆంక్షలు, బలవంతపు కుటుంబ నియంత్రణ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగం వంటి ప్రజా కంటక చర్యలు నాటి కాలాన్ని అంధకారంగా మార్చాయి. ఎమర్జెన్సీ విధించి అర్థ శతాబ్దం గడిచిన ప్పటికీ, అది అందించిన పాఠాలు నేటికీ మన కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి..

అధికార కేంద్రీకరణ..

ఎమర్జెన్సీ కాలం భారత రాజ్యాంగ అమలుకు, రాజ్యాంగ స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగించింది. కార్య నిర్వాహక వ్యవస్థ సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించింది. పార్లమెంటరీ వ్యవస్థల పర్యవేక్షణ పూర్తిగా కుంటుపడింది. న్యాయ వ్యవస్థ సైతం కార్యనిర్వాహక వ్యవస్థకు పూర్తి అనుకూలంగా మారింది. ఈ నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) నాయకత్వంలో బలమైన ప్రజాఉద్యమం ప్రారంభమైంది. "సంపూర్ణ క్రాంతి" నినాదంతో బీజేపీ దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేయగలిగారు. ఆయనతో పాటు, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ, జార్జ్ ఫెర్నాండెజ్, చరణ్ సింగ్, మధు దండావతే, రామ్ విలాస్ పాశ్వాన్ వంటి ఎందరో రాజకీయ నాయకులు, సామాజిక కార్య కర్తలు జైళ్లలో నిర్బంధించబడ్డారు..

ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఓ గుణపాఠం..

నాడు ఎన్ని నిరంకుశ చర్యలు ఉన్నప్పటికీ, ప్రతిఘటన స్పూర్తి చివరికి విజయం సాధించింది. 1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఏక ఛత్రాధిపత్యం కొనసాగించిన కాంగ్రెస్ ఓటమి చెందడం, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన రాజకీయ పక్షాలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ప్రజలు తమ ప్రజాస్వామ్య స్వేచ్ఛకు ఎంత విలువనిస్తారో, నాయకులను తమ హక్కుల రక్షణకు జవాబుదారీగా ఎలా ఉంచగలరో నిరూపించింది. ఇది భారత ప్రజల లోతైన ప్రజాస్వామ్య స్పృహకి నిదర్శనం.

అసమ్మతిని గౌరవించే కాలం ఎప్పుడు?

ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఇది కేవలం చారిత్రక స్మరణోత్సవం మాత్రమే కాదు.. ఇది నేడు భారతదేశ ప్రజాస్వామ్యం యొక్క తీరుతెన్నులను నిశితంగా అంచనా వేయడానికి ఒక ఆవశ్యకత. మన వ్యవస్థలు సంభావ్య ఒత్తిళ్లను తట్టుకోవడానికి తగినంత బలంగా ఉన్నాయా? అసమ్మతి నిజంగా గౌరవించబ డుతుందా? బహిరంగ చర్చ విభిన్న అభిప్రాయాలతో ప్రజా పరిధి బలంగా ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు 1975 పాఠాలు నిజంగా నేర్చుకున్నారా? లేదా అనేదాన్ని నిర్ణయిస్తాయి. తద్వారా అలాంటి చీకటి అధ్యాయం భారతదేశ శక్తివంతమైన ప్రజాస్వామ్య ప్రయాణంలో మళ్లీ ఎన్నటికీ పునరావృతం కాదు. దేశ ప్రజాస్వామ్యం ఈ సవాళ్లను అధిగమించి మరింత బలోపేతం అవుతుందని ఆశిద్దాం. ఎమర్జెన్సీ సమయంలో పోరాడిన వీరుల త్యాగాలు ఈ దేశ ప్రజాస్వామ్యానికి పునాదులని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు..

మీడియాపై నేటికీ సవాలక్ష ఆంక్షలు..

సమకాలీన భారతదేశంలో, అధికారిక సెన్సార్‌షిప్ లేనప్పటికీ, మీడియా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తుందని ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే జర్నలిస్టులపై కేసులు పెట్టడం, మీడియా సంస్థల ఆర్థిక స్వాతంత్య్రంపై ప్రభావం, "ట్రోల్ ఆర్మీల" ద్వారా జరుగుతున్న ప్రచారం వంటివి మీడియా విశ్వసనీయతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నిజమైన ప్రజాస్వామ్య సమాజం విభిన్న స్వరాలు, విమర్శనాత్మక పరిశీలనలతోనే అభివృద్ధి చెందుతుంది. మీడియాపై ఏ విధమైన ఒత్తిడి అయినా సమాజ మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తుంది. ఇది భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే అవుతుంది.

(ఎమర్జెన్సీ ప్రకటించి నేటికి 50 సంవత్సరాలు)

డా. రావుల కృష్ణ

అసిస్టెంట్ ప్రొఫెసర్, హెచ్‌సీయూ

94929 09371

Next Story