- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజాస్వామ్యం.. ప్రజల చైతన్యానికి ప్రతిరూపం
ప్రజాస్వామ్యం అనేది కేవలం ఒక రాజకీయ వ్యవస్థ మాత్రమే కాదు.. అది ప్రజల చైతన్యానికి ప్రతిరూపం. ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు వంటిది మన ఓటు హక్కు. ఈ ఓటు హక్కు అనేది భారతదేశంలాంటి వైవిధ్యాలు గల దేశంలో సాధారణ హక్కు మాత్రమే కాదు..

ప్రజాస్వామ్యం అనేది కేవలం ఒక రాజకీయ వ్యవస్థ మాత్రమే కాదు.. అది ప్రజల చైతన్యానికి ప్రతిరూపం. ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు వంటిది మన ఓటు హక్కు. ఈ ఓటు హక్కు అనేది భారతదేశంలాంటి వైవిధ్యాలు గల దేశంలో సాధారణ హక్కు మాత్రమే కాదు, ప్రజల చేతుల్లో ఉన్న సార్వభౌమాధికారం. అంబేద్కర్ లాంటి మహనీయుడు ఓటు హక్కును ఒక ఆయుధంగా అభివర్ణించారు. ‘ఓటు అనేది ప్రజల చేతికి ఒక కత్తి (ఆయుధం) వంటిది. దీని ద్వారా వారు తమ హక్కులను, స్వేచ్ఛను కాపాడుకోవడమే కాకుండా, సమాజంలో సామాజిక, ఆర్థిక మార్పులను కూడా తీసుకురాగలరు’ అని ఆయన విశ్వసించారు.
ప్రజలపై ఉంచిన విశ్వాసం
భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కును కల్పించింది. ఇది రాజ్యాంగ నిర్మాతలు ప్రజలపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనం. చదువు, సంపద, కులం, మతం, లింగం వంటి భేదాలు లేకుండా ప్రతి పౌరుడికి ఒకే ఓటు విలువ ఉండటం భారత ప్రజాస్వామ్యానికి గొప్ప బలం. ఓటు ద్వారా ప్రజలు తమ పాలకులను మాత్రమే కాదు, దేశం, రాష్ట్రాల భవిష్యత్తును నిర్ణయించే అధికారం కూడా తమ చేతుల్లోనే ఉంచుకుంటారు.
ఓటు – హక్కు మాత్రమే కాదు, బాధ్యత
ప్రజల అవసరాలు, ఆకాంక్షలు, సమస్యలు ప్రభుత్వ విధానాల్లో ప్రతిబింబించాలంటే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలి. ‘నా ఓటు ఫలితాలను మారుస్తుందా?’ అని తేలిగ్గా తీసుకోవద్దు. ఒక్క ఓటు తేడాతో ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి గారు అధికారాన్ని కోల్పోయిన సందర్భం చరిత్రలో ఉంది. ‘నేనొక్కడినే ఓటేయకపోతే కొంపలు మునుగుతాయా?’ అని అనుకోవద్దు. నిజంగానే కొంపలు మునుగుతాయి.. ఆ మాటకొస్తే దేశాలు, రాష్ట్రాలే మునుగుతాయి. ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక రోగి మాత్రమే చనిపోతాడు. కానీ ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే లక్షలాది మంది భవిష్యత్తుపై దాని ప్రభావం పడుతుంది. ప్రజలు ఓటు వేయడం వల్లే ప్రభుత్వం ప్రజలకు బాధ్యతగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఓటింగ్ నిర్లక్ష్యం – ప్రజాస్వామ్యానికి ముప్పు
అయినప్పటికీ నేటి సమాజంలో చాలా మంది ఓటు వేయడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఓటు అనేది కేవలం ఒక హక్కు మాత్రమే కాకుండా ఒక బాధ్యత అని ప్రతి ఒక్కరూ భావించాలి. ప్రజలు ఎన్నికల్లో పాల్గొనకపోతే ప్రజాస్వామ్యం బలహీనంగా మారే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో కొద్దిమంది మాత్రమే ఓటు వేయడం వల్ల వారి అభిప్రాయాలే ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.
చరిత్ర చెప్పే సత్యం..
చరిత్రను పరిశీలిస్తే ఓటు హక్కు కోసం అనేక ఉద్యమాలు జరిగాయి. మహిళలు, అణగారిన వర్గాలు చాలా కాలం పాటు తమ హక్కుల కోసం పోరాటం చేశారు. ఓటు ద్వారా సామాజిక మార్పు సాధ్యమని ఈ ఉద్యమాలు స్పష్టంగా నిరూపించాయి. అయినా నేటి యువతలో ఓటు ప్రాధాన్యతపై సరైన అవగాహన లేకపోవడం బాధాకరం. పేదరికం, నిరుద్యోగం, విద్య, ఆరోగ్యం వంటి సమస్యల పరిష్కారానికి సరైన నాయకులను ఎన్నుకోవడం అత్యంత అవసరం. అయినా కొంతమంది ‘ఓటు వేయడం వల్ల ఏమి మారుతుంది?’ అనే భావనతో ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు.
ప్రలోభాలు, కుల, మత రాజకీయాలు
ఎన్నికల సమయంలో ప్రలోభాలు పెరుగుతుండటం ఓటు పవిత్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రజల సంకల్పం కాకుండా ప్రలోభాలే ఫలితాలను నిర్ణయిస్తే పాలనపై విశ్వాసం దెబ్బతింటుంది. కుల, మత రాజకీయాలు కూడా ఓటు సంస్కృతిని దెబ్బతీస్తున్నాయి. అభివృద్ధి, పరిపాలనా సామర్థ్యం కంటే సామాజిక గుర్తింపులే ప్రాధాన్యం పొందడం సమాజాన్ని విభజన దిశగా నడిపిస్తోంది. దీని వల్ల ప్రజాస్వామ్య చర్చల స్థాయి తగ్గిపోతోంది.
భారత ఎన్నికల చరిత్ర.. ఓటర్ల చైతన్యం
1951–52లో జరిగిన తొలి సాధారణ ఎన్నికలు భారత ప్రజాస్వామ్యానికి ఒక చారిత్రక ఘట్టం. అక్షరాస్యత తక్కువగా ఉన్నప్పటికీ సుమారు 45 శాతం ఓటింగ్ నమోదు కావడం రాజ్యాంగంపై ప్రజల విశ్వాసాన్ని చాటింది. 1977 ఎన్నికలు ఓటు శక్తిని దేశానికి మరోసారి గుర్తుచేశాయి. అత్యవసర పరిస్థితి అనంతరం ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొని తమ అసంతృప్తిని బ్యాలెట్ ద్వారా వ్యక్తం చేశారు. 1990లలో ప్రాంతీయ పార్టీల ఉద్భవం, కూటమి రాజకీయాలు ఓటర్ల ఆసక్తిని మరింత పెంచాయి. ఇటీవలి 2014, 2019 ఎన్నికల్లో ఓటింగ్ శాతం చరిత్రాత్మక స్థాయికి చేరింది. మహిళలు, గ్రామీణ ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ప్రజాస్వామ్యానికి సానుకూల సంకేతం.
డిజిటల్ యుగం & సోషల్ మీడియా పాత్ర
ప్రస్తుత డిజిటల్ యుగంలో రాజకీయ చర్చల దిశను మార్చిన ప్రధాన సాధనం సోషల్ మీడియా. ఇది సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా తొలిసారి ఓటు వేయబోయే యువతకు ఇది రాజకీయ ప్రవేశ ద్వారంగా మారింది. అయితే తప్పుడు వార్తలు, అర్థసత్యాలు, ఎడిట్ చేసిన వీడియోలు ఓటర్ల నిర్ణయాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. వైరల్ అయినదే నిజమన్న భావన ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. అల్గారిథమ్ ప్రభావం వల్ల ఓటర్లు ఒకే అభిప్రాయ వలయంలో పరిమితమవుతున్నారు. డబ్బుతో నడిచే డిజిటల్ ప్రచారం, లక్ష్యిత ప్రకటనలు, బాట్ ఖాతాలు ఎన్నికల సమానత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.
ఓటరు చైతన్యమే ప్రజాస్వామ్యానికి కవచం
సోషల్ మీడియా శత్రువూ కాదు, రక్షకుడూ కాదు; అది ఒక సాధనం మాత్రమే. దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నదే అసలు ప్రశ్న. ఎన్నికల కమిషన్‌తో పాటు సోషల్ మీడియా సంస్థలు తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలి. అంతకంటే ముఖ్యంగా ప్రజల్లో మీడియా లిటరసీ పెంపొందించాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి విషయాన్ని నమ్మకుండా ఆలోచించి, పరిశీలించి నిర్ణయం తీసుకునే సంస్కృతి పెరిగినప్పుడే ఈ డిజిటల్ యుగంలో ప్రజాస్వామ్యం బలంగా నిలుస్తుంది.
- డా. బాసాని లావణ్య
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్
కాకతీయ యూనివర్సిటీ
9160975164






