ప్రమాదంలో ప్రజాస్వామ్యం!

by Ravi |   (  Updated:2026-02-18 00:30:37  IST  )

ప్రస్తుతం రాజకీయాలను చూస్తుంటే రౌడీయిజానికి తేడా లేకుండా కనిపిస్తుంది. నేతల స్థితిగతులను గమ నిస్తుంటే అసలు ప్రజాస్వామ్యంపై ఒకింత భయం కలుగుతుంది.

ప్రమాదంలో ప్రజాస్వామ్యం!
X

ప్రస్తుతం రాజకీయాలను చూస్తుంటే రౌడీయిజానికి తేడా లేకుండా కనిపిస్తుంది. నేతల స్థితిగతులను గమ నిస్తుంటే అసలు ప్రజాస్వామ్యంపై ఒకింత భయం కలుగుతుంది. తమకు న్యాయం చేస్తారని పవిత్రమైన, ఉన్నత మైన చట్టసభలకు నాయకులను పంపిస్తే, ప్రజల నమ్మకాన్ని తాకట్టు పెట్టే విధంగా నేటి రాజకీయ నాయకుల వ్యవహార శైలి జుగుప్సాకరంగా మారింది. ప్రభుత్వాలు సగటు మనిషి జీవన విధానానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా, దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించే పనులు కూడా చేయాలి. కానీ అవేమీ పట్టనట్లుగా కేవలం ఎన్నికల సమయంలోనే అనేక హామీలను ప్రజల ముందుంచి వారిని బలి పశువులుగా మార్చడం తప్ప నాయకులు చేసే పని శూన్యంగా కనిపిస్తోంది. అధికారం కోసం ఎంతకైనా దిగజారడానికి, ఎంతైనా డబ్బులు ఖర్చు చేయడానికి సిద్ధపడే కోణంలోనే నేటి రాజకీయాలు కొనసాగుతున్నాయి. ‘రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రత్వం ఉండదు’ అనే మాట ఒక సందర్భంలో సరిపోవచ్చు గానీ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు అది పూర్తిగా సరిపోదు.. ఆయా పార్టీల నాయకుల కుహనా రాజకీయాలు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలకే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో, ఏ పార్టీ నాయకులు ఎవరిని విమర్శిస్తారో తెలియని అగమ్య గోచరమైన పరిస్థితి నెలకొంది. ఎన్నికలే ధ్యేయంగా, అధికారమే లక్ష్యంగా సాగుతున్న ఈ రాజకీయ నాటకీయ పరిణామాలు ప్రజాస్వామ్యంలో ఎంతకాలం నిలుస్తాయి అనేది ఆలోచించాల్సిన విషయం. ఇది అధికార పక్షానికైనా, ప్రతిపక్షానికైనా సమానంగా వర్తిస్తుంది. ఇప్పటికైనా రాజకీయ నాయకులు ఓటు బ్యాంక్ రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తుపై దృష్టి సారించి భావితరాలకు నూతన రాజకీయ ఒరవడిని సృష్టించాలని ఆశిద్దాం. ఆ దిశగా నాయకుల్లో సానుకూలమైన పరివర్తన చోటు చేసుకోవాలని కోరుకుందాం.

- తాళ్లపెల్లి సురేందర్

94407 15635

Next Story