దశాబ్దాల నిర్లక్ష్యం.. కన్నీటి మడుగుగా మారింది!

by Ravi |   (  Updated:2025-11-06 00:30:58  IST  )

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మరణించారు. అయితే ఈ ప్రమాదం వెనక ఎన్నో కారణాలు ఉన్నాయి.

దశాబ్దాల నిర్లక్ష్యం.. కన్నీటి మడుగుగా మారింది!
X

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మరణించారు. అయితే ఈ ప్రమాదం వెనక ఎన్నో కారణాలు ఉన్నాయి. కారణాలపై పోలీసు, రవాణా శాఖల అధికారుల దర్యాప్తు మొదలైంది. అసలు ఒక రాష్ట్ర రాజధానికి వెళ్లే 100 కి.మీ. మార్గం, ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మీదుగా వెళ్లే రోడ్డు ఇలాగేనా ఉండేది? రోడ్డు కోసం దశాబ్దాల కాలంగా ఎన్నో ఆశలతో ఎదురుచూస్తే.. చివరికి ఆ ప్రాంత ప్రజల ప్రాణాలనే పొట్టన పెట్టుకున్నారు. ఏమి చేసి రాజకీయ నాయకులు ఈ పాపాన్ని కడిగేసుకుంటారు? ఇది ప్రాయశ్చిత్తం లేని తప్పు. ఇందుకు కారణమైన వారిని ఎప్పటికీ క్షమించలేని తప్పు చేశారు. ఈ ప్రమాదంలో అస్తిత్వం కోల్పోయి నిర్వీర్యం అయిపోయిన అనాధల పరిస్థితి ఏమిటి? ఏమి చేసి బలి తీసుకున్న ప్రాణాలకు శాంతి చేస్తారు? మొదటి నుండి నాపరాయి.. సిమెంట్.. కందిపప్పు.. ప్రధాన వ్యాపారంగా నిత్యం కొన్ని వేల సంఖ్యలో లారీలు తిరుగుతున్నా.. ప్రజలు గెలిపించుకున్న రాజకీయ నాయకులు మాత్రం దశాబ్దాలుగా రోడ్లు వేయడానికి ఎందుకు నిర్లక్ష్యం? రెవెన్యూ రూపంలో తాండూరు ప్రాంతం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా.. ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు నిషేధమా? మా నాయకులుగా మిమ్మల్ని నమ్మడమే.. మా పాలిట శాపమా? రోడ్డు విస్తరించడానికి వీలుగా.. అడ్డంగా ఉన్న చెట్లను తొలగించడానికి వెళ్తే.. ఒకరు పర్యావరణ పరిరక్షణ కింద కోర్టులో పిటిషన్ వేస్తారు. మనుషుల ప్రాణాల కంటే మీకు చెట్ల ప్రాణాలు ఎక్కువైపోయాయా? మనుషుల ప్రాణాలే పోతుంటే పర్యావరణ పరిరక్షణ ఇంకెవరి కోసం? ఒక జాతీయ రహదారి అంటే ఎలా ఉండాలి? కానీ ఎన్.హెచ్ 163 ఎలా ఉంది? స్థాయికి మించిన కంకర లోడ్ బరువును అధికారులు పరిశీలించకుండా.. అసలు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకుండా రోడ్డు పైకి వదిలేయడం. సమాజంలోని మనుషుల ప్రాణాలకు మౌలిక భద్రత లేదా? అసలు మనుషుల ప్రాణాలకే విలువ లేదా? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రహదారి నాణ్యతకు దృష్టి పెట్టాలి.

-కోటం త్రిశూల్,

85230 05678

Next Story