కర్రీ పాయింట్లలో.. నాణ్యతను పరీక్షించాలి!

by Ravi |   (  Updated:2025-07-05 00:30:17  IST  )

ఒకప్పుడు ఇండ్లకు బంధువులు వస్తే ఇంట్లోనే సొంతంగా వంటలు వండి వడ్డించేవారు.. కానీ నేడు ఇంటికొచ్చిన

కర్రీ పాయింట్లలో.. నాణ్యతను పరీక్షించాలి!
X

ఒకప్పుడు ఇండ్లకు బంధువులు వస్తే ఇంట్లోనే సొంతంగా వంటలు వండి వడ్డించేవారు.. కానీ నేడు ఇంటికొచ్చిన వారికి సొంతంగా కర్రీలు తయారు చేసి పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇళ్లకు బంధు మిత్రులు వస్తే, వెంటనే కర్రీ పాయింట్‌కు వెళ్లి కావాల్సినవి తెచ్చుకుంటున్నారు.. పట్టణ ప్రజలతో పాటు పల్లెవాసులు కూడా నేడు కర్రీ సెంటర్ల వద్ద క్యూ కడుతున్న పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. అందుకే నేడు ఏ గ్రామంలో చూసినా కర్రీల అమ్మ కాలు క్రమంగా పెరుగుతున్నాయి.. దీంతో ఈ బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్‌కు మంచి అవకాశంగా మారింది. అయితే ఇటీవల కాలంలో పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటల్స్, ఇతర వ్యవస్థలలో ఆహార భద్రత విషయమై స్థానిక సంస్థల అధికారులు పర్యవేక్షణ వల్ల, వాటిలో శుచి, శుభ్రత నాణ్యత లేని పదార్థాలతో ఆహారం తయారు చేస్తున్నారని తెలిసింది. ఇప్పుడు పట్టణాల్లో, మండల కేంద్రాల్లో, చివరికి గ్రామాల్లో కూడా కర్రీ పాయింట్స్ ఏర్పాటు కావడంతో.. ఇందులో వండే కూరలు, పప్పులు ఇతర ఆహార పదార్థాలను తయారు చేసే విధానంలో నాణ్యత, శుభ్రత పాటిస్తున్నారా? అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది. ఈ కర్రీ పాయింట్లలో ఎప్పుడు చూసినా గిన్నెల నిండా కూరలు పప్పులు నిల్వగా కనిపిస్తుంటాయి.. వీటిని ఎప్పుడు తయారు చేస్తారు అనేది తెలీదు. వీటి విక్రయాలలో ధరల పట్టికలు ఏర్పాటు చేయడం లేదు. వీటి తయారీలో ఉపయోగించే నూనె ఇతర పదార్థాలలో సరియైన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా? అనే సంశయం సైతం కలుగుతోంది. ప్రజల్లో ఈ కల్చర్ పెరుగుతుండంతో ప్రజలకు శుచి శుభ్రత నాణ్యమైన పప్పులు కూరలు అందించేందుకు ఆహార భద్రత స్థానిక సంస్థల అధికారులు తరచుగా పర్యవేక్షణ చేసి సరసమైన ధరలకు నాణ్యతతో కూడిన పదార్థాలను కస్టమర్లకు అందచేసేలా తగు ఏర్పాటు చేయాలి.

- దండంరాజు రాంచందర్ రావు

98495 92958

Next Story