మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడూ..

by Ravi |   (  Updated:2025-02-14 01:15:28  IST  )

మధ్యతరగతికి చెందిన వెలమాటి జనార్ధనరావు కష్టించి పారిశ్రామిక సామ్రాజ్యాన్ని స్థాపించి కోట్ల రూపాయలకు పడగలెత్తారు.

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడూ..
X

మధ్యతరగతికి చెందిన వెలమాటి జనార్ధనరావు కష్టించి పారిశ్రామిక సామ్రాజ్యాన్ని స్థాపించి కోట్ల రూపాయలకు పడగలెత్తా రు. దాతృత్వంతో ఎంతో సేవ చేశారు . స్వయంకృషితో జీవితంలో అనేక మెట్లెక్కిన ఆయన చివరకు సొంత మనవడి చేతిలో 73 కత్తిపోట్లకు గురై హత్య గావింపబడ్డారు. ప్రతికూల జీవితాన్ని అనుకూలంగా మార్చుకున్న ఆ పారిశ్రామికవేత్త చివరికి రక్తం బంధం పంచుకున్న మనవడు చేతిలో హత్యకు గురికావడం కంటే విషాదం ఏముంది?

తన భర్తే తన సర్వస్వం అని నమ్మి సర్వస్వం అర్పించుకున్న వెంకట మాధవి అనే మహిళ చివరకు భర్త గురు మూర్తి చేతిలో దారుణాతి దారుణంగా నరకబడింది. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్‌లో ఉడి కించి, ఎముకలు రోట్లో వేసి దంచి పొడి చేసి చెరువులో పడేసిన మానవ మృగం గురుమూర్తి లాంటి భర్త ఈ సమాజానికి ఎటువంటి సందేశాన్ని పంపించాడో తరిచి చూస్తుంటే హృదయం తల్లడిల్లుతుంది. జనగామకు చెందిన కన్నప్ప అనే ఓ కర్కశ కొడుకు తన తల్లి రమణమ్మని ఆస్తి కోసం కిరాతకంగా గొడ్డలితో నరికి చంపి తల, మొండెం వేరుచేసి తలను పట్టుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. నవమాసాలు కని పెంచి పోషిం చిన తల్లికి ఆ కర్కోటకుడు ఇచ్చిన బహుమానం ఇది.

వీరికి ఏం తక్కువైంది..?

ఇటువంటి హృదయ విదారకమైన సంఘటనలు వరు సగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. మనిషి క్రూరత్వ ప్రవర్తనకు పైన చెప్పుకున్న సంఘటనలు కొన్ని ఉదాహరణలు మాత్రమే. తాతను చంపిన మనవడికి ఏం తక్కువ. ఉన్నత కుటుంబం, ఉన్నత చదువులు చదివాడు. ఆర్థికంగా బలమైన నేపథ్యం. అయినా ఇంకా ఏదో చాలని ఆధిపత్య కోరిక అతన్ని మృగాన్ని చేసింది. భార్యను అత్యంత కిరాతకంగా చంపిన గురుమూర్తి నేపథ్యం చూస్తే దేశ భద్రత కోసం పనిచేసిన ఆర్మీ ఉద్యోగి. రిటైర్ అయినా మరో ఉద్యోగం చేసుకుంటున్నాడు. కానీ తన ప్రాణ సమానమైన అర్ధాంగిని ముక్కలు చేసే రాక్షసుడిగా ఎందుకు మారాడు? తండ్రి పోయినా కుమారుడే తనే సర్వం అనుకుని ప్రేమించిన తల్లిని కన్నప్ప తన చేతులతో చేసిన హత్య ఏం పాఠాలు నేర్పుతుంది ఈ మానవ సమాజానికి? ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ దిగజారుతున్న మానవీయ బంధాలు భయోత్పాతాన్ని కలిగిస్తున్నాయి.

గురువులే కబళిస్తున్న వేళ

కొన్ని చోట్ల సొంత కుమార్తెలపై తండ్రులే అత్యాచారాలకు దిగుతున్న సంఘటనలు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే మరోవైపు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానకాంతిని ప్రసరింప చేయాల్సిన గురువులే తమ విద్యార్థినులను చెరబడుతున్న సంఘటనలు మరింతగా ఆందోళన కలిగిస్తున్నాయి. తమిళనాడులో 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ఉపాధ్యాయులు లైంగిక దాడికి పాల్పడి చెరబడ్డారంటే సభ్య సమాజంలో మానవ మృగాలు ఏ ముసుగులో ఉన్నారో అంతుబట్టలేని నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది. అనకాపల్లి దగ్గర్లోని వడ్డాది గ్రామంలో మార్కులు తక్కువ వచ్చాయని ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిని ఉపాధ్యాయుడి దగ్గరకి వెళితే అతడు ప్రవర్తించిన తీరు ఉపాధ్యాయ లోకానికి మాయని మచ్చగా మార్చింది. అనేక ప్రాంతాల్లో ఉపాధ్యాయులు పాఠశాలల్లోనూ, వసతిగృహాల్లోనూ విద్యార్థినుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు, వారి జీవితాలను నాశనం చేస్తున్న వైనం గురువు పట్ల ఉండే దైవభావనను రోజురోజుకూ తగ్గేలా చేస్తుంది. గురువుల నోట జ్ఞాన, విజ్ఞాన విలువలు తెలుసుకోవాల్సిన పిల్లలు వారి చూపించే అశ్లీల దృశ్యాలు, మాటలు, చేతలు పసి హృదయాల జీవితాలపై తీరని గాయాల పరం చేస్తున్నాయి.

కుటుంబ విలువలే శ్రీరామరక్ష!

మనుషులలో సాత్విక స్వభావాన్ని పెంచి మృగ లక్షణాలకు దూరంగా ఉంచాలంటే కుటుంబ విలువలే ప్రధానం. ఇల్లే ఒక దేవాలయంగా మారి తల్లిదండ్రులు, పెద్దలు తమ మాటలు, చేతలతో పిల్లలను తీర్చిదిద్దిన నాడే మనుషుల్లో మార్పును కొంతమేరకు ఆశించగలుగుతాం. పిల్లలకు చిన్ననాటి నుండే కుటుంబ విలువలు, మానవీయ బంధాలు, చదువుల సారాంశాన్ని, జ్ఞానం గొప్పతనాన్ని, పరస్పర ప్రేమ, సహాయం సహకారంలో ఉన్న మాధుర్యాలను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థల్లో ఇటువంటి అవ్యాజమైన అనుబంధాలు బలంగా కొనసాగడంతో కుటుంబ బంధాలు బలంగా తయారు కావడంతో పాటు మానవ సంబంధాలు మెరుగుపడ్డాయి. రానురానూ మానవ బంధాల కంటే ఆర్థిక బంధాలకే విలువ పెరగడం, తల్లిదండ్రులు సంపాదన పోరులో పిల్లలకు సరైన టైం కేటాయించక పోవడం, పిల్లల పట్ల పర్యవేక్షణ లేకపోవడంతో వ్యవస్ధ మొత్తం గాడి తప్పుతుంది. చిన్న వయస్సు నుండి పిల్లలను రాయల్ లైఫ్‌లో ఉంచి డబ్బు మత్తులో పరిగెట్టించడం కూడా పిల్లలు ఎదిగే కొద్ది ఉన్మాద ప్రవృత్తిలోకి మారిపోతున్నారు. మద్యం, గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు బానిసలై విచ్చలవిడి జీవితాలకు అలవాటు పడుతున్నారు. తొలి నుండి తల్లిదండ్రులు పిల్లల అలవాట్లను పరిశీలించకపోవడంతో పాటు వారి స్నేహలపైనా దృష్టి సారించి సన్మార్గంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో నేర్పించిన విలువలు, ఆత్మ విశ్వాసం, వారికి వారు ఉన్నతంగా వ్యక్తిత్వాలను తీర్చిదిద్దుకునే విధంగా తీసుకొచ్చే మార్పులు వారిని మానవత్వం ఉన్న మనిషిగా తీర్చిదిద్దడంలో తోడ్పడతాయి.

మనిషిలో మృగ లక్షణాలు ప్రవేశించినప్పుడు..

సామాజిక మాధ్యమాల్లో విద్యార్థుల భవిష్యత్‌కు హాని చేసే అంశాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాఠశాలలు, కాలేజీల్లో తమ పిల్లలు వ్యవహరిస్తున్న తీరుతో పాటు వారిపట్ల మిగిలిన పిల్లులు, ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్న తీరుపై తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు స్నేహపూర్వకంగా అడిగి తెలుసుకోవడం మంచి సూచనలతో వారిని మేల్కొల్పడం ద్వారా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక బంధాలు, అనైతిక సంబంధాలు, వ్యసనాలు మనిషిని మృగంగా మారుస్తున్నాయి. రక్త బంధాలు, మానవీయ సంబంధాలు కంటే పైన చెప్పిన మూడు అంశాలు మనిషి ప్రవర్తనను దిగజారుస్తున్నాయి. ఒక మనిషికి విధ్వంసం వచ్చినపుడు అతని స్వంత తెలివితేటలు చెడిపోతాయి. ప్రేమ, కృతజ్ఞత, అనురాగం, అప్యాయతలు ఇవన్నీ మనిషిలో మృగ లక్షణాలు ప్రవేశించినప్పుడు కవి అందెశ్రీ చెప్పినట్లు మనిషన్నవాడు మాయయైపోతున్నాడు. మనిషి ఎంత సాంకేతిక ప్రజ్ఞ సాధించినా.. సమాజం పట్ల ప్రేమ, దయ, కృతజ్ఞత లాంటి మానవీయ సంబంధాలు లేనపుడు అన్ని బంధాలు విధ్వంసమే కదా…!

- అడపా దుర్గ

సీనియర్ జర్నలిస్ట్

90007 25566

Next Story