భారత క్రీడా రంగానికి ‘క్రికెట్’ గ్రహణం

by Bhoopathi Nagaiah |

క్రికెట్ ను ఆదరించడం తప్పు కాదు. అయితే క్రికెట్ మాత్రమే ఆట అనుకోవడం తప్పిదమే అవుతుంది. భారత్ నిజంగా క్రీడా శక్తిగా మారాలంటే విధానపరమైన మార్పులు అవసరం.

భారత క్రీడా రంగానికి ‘క్రికెట్’ గ్రహణం
X

భారత క్రీడా రంగానికి ‘క్రికెట్’ గ్రహణం పట్టుకున్నది. ఈ ఒక్క ఆటకు ఉన్న క్రేజ్.. దేశంలో ఇతర క్రీడల అస్తిత్వాన్నే ప్రశ్నార్థకంగా మారుస్తున్నది. పత్రికలు, న్యూస్ టీవీ చానల్స్, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ చానల్స్.. సోషల్ మీడియా.. దశాబ్దాల కాలంగా ఏ వేదిక చూసినా.. క్రికెట్ జపమే తప్పా.. ఇతర ఆటలకు కనీస స్థానం దక్కడం లేదు. కార్పొరేట్ మార్కెటింగ్ మాయాజాలం వల్ల భారతదేశ 140 కోట్ల జనాభాలో అధిక శాతం ఉన్న యూత్ లో క్రికెట్ కే క్రేజ్ ఎక్కువగా ఉంటున్నది. బ్యాడ్మింటన్, టెన్నిస్, చెస్, ఫుట్ బాల్ వంటి క్రీడలకు ఇప్పుడిప్పుడే దేశంలో కాస్త ఆదరణ దక్కుతున్నా.. ప్రపంచవ్యాప్తంగా ఆ ఆటలకు ఉన్న ఆదరణతో పోల్చుకుంటే చాలా తక్కువ. ఈ స్థితి నుంచి బయట పడాలంటే ఇంకో అర శతాబ్దం పట్టేలా ఉన్నది.

డజను దేశాలకే ఐసీసీ పూర్తిస్థాయి సభ్యత్వం

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక భారత్ లో హాకీ, ఫుట్ బాల్ కు కూడా కాస్త ఆదరణ ఉండేది. అయితే 1983లో కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు వరల్డ్ కప్ గెలిచాక.. ఇక్కడ క్రీడారంగం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. క్రికెట్ కు ఫుల్ క్రేజ్ ఏర్పడి క్రికెటర్లు ‘దేవుళ్లు’గా మారిపోయారు. మార్కెటింగ్ మాయాజాలంలోని వెలుగు జిలుగుల వెనక.. ఇతర క్రీడలు చీకట్లో ఉండిపోయాయి. అసలు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడే దేశాల సంఖ్య చాలా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాలు ఉంటే.. ఐసీసీలో పూర్తిస్థాయి సభ్యత్వం కలిగినవి డజను దేశాలు మాత్రమే. అంటే ఇతర దేశాల్లో క్రికెట్ కు ఏ మేరకు ఆదరణ ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.

ఇతర క్రీడలకు ప్రోత్సాహం కరువు..

క్రికెట్ మోజులో ఇతర క్రీడలకు లభించాల్సినంత ప్రోత్సాహం లభించడం లేదు. ఫుట్ బాల్ అసోసియేషన్ అయిన ఫిఫాలో 211 దేశాలకు సభ్యత్వముండగా.. అందులో భారత ర్యాంక్ 142. ఇప్పటికీ ప్రపంచకప్ నకు అర్హత సాధించలేకపోతున్నది. మరోవైపు ప్రతి నాలుగేళ్లకోసారి వచ్చే ఒలింపిక్స్ లో చైనా, అమెరికాలు పతకాల పంట పండిస్తే.. ఒకటీ, రెండు మెడల్స్ తోనే ఇండియా సరిపెట్టుకోవాల్సి వస్తున్నది. ఏ క్రీడాకారుడైనా వ్యక్తిగత కృషితో పతకం తెస్తే.. దేశమంతా పండుగ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. టెన్నిస్, షటిల్, బ్యాడ్మింటన్ వంటి ఆటల్లో సైనా నెహ్వాల్, పీవీ సింధు, సానియా మిర్జా, పుల్లెల గోపీ చంద్ వంటి వారు అంతర్జాతీయ స్థాయిలో మెరిసినా.. అవి వ్యక్తిగత విజయాలే తప్పా.. వ్యవస్థాగత విజయాలు కావనేది అందరికీ తెలిసిందే. క్రికెట్ ఉన్న మీడియా కవరేజీలో కనీసం పది శాతం కూడా ఇతర క్రీడలకు దక్కడం లేదు. ఈక్రికెట్ మేనియాలో జాతీయ క్రీడగా చెప్పుకుంటూ.. ఎన్నో స్వర్ణ పతకాలు సాధించిన హాకీ సైతం ప్రస్తుతం ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి నెలకొన్నది.

కార్పొరేట్ స్పాన్సర్... ప్రధాన కారణం

భారతదేశంలో ఇతర క్రీడల వెనకబాటుకు ప్రధాన కారణం కార్పొరేట్ స్పాన్సర్స్ షిప్స్ అనేది విశ్లేషకుల అభిప్రాయం. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే టీవీల్లో వచ్చే రేటింగ్స్, యాడ్స్ ద్వారా వచ్చే పబ్లిసిటీ కార్పొరేట్ సంస్థలను ఆకర్షిస్తుంది. దీంతో కంపెనీలు తమ ప్రధాన ప్రచార వనరుగా క్రికెట్, క్రికెటర్లనే ఎంచుకుంటున్నాయి. దీంతో ఇతర క్రీడలకు నిధుల కొరత ఏర్పడుతున్నది. ఆర్చరీ, బాక్సింగ్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడల్లో గ్రామీణ క్రీడాకారులకు అపారమైన ప్రతిభ ఉన్నా.. సరైన శిక్షణ, పౌష్టికాహారం లేక.. వారు అంతర్జాతీయస్థాయికి ఎదగలేక మరుగునపడిపోతున్నారు.

కచ్చితంగా మారాల్సిందే..

క్రికెట్ ను ఆదరించడం తప్పు కాదు. అయితే క్రికెట్ మాత్రమే ఆట అనుకోవడం తప్పిదమే అవుతుంది. భారత్ నిజంగా క్రీడా శక్తిగా మారాలంటే విధానపరమైన మార్పులు అవసరం. పాఠశాల స్థాయి నుంచే అన్ని క్రీడలకు సమ ప్రాధాన్యమివ్వాలి. స్థానికస్థాయిలో మౌలిక వసతులు కల్పించాలి. క్రీడాకారులకు ఆర్థిక భద్రత కల్పించాలి. మీడియా సైతం బాధ్యతాయుత పాత్ర నిర్వహించాలి. ఇవన్నీ కలిస్తేనే భారత క్రీడా రంగంలో మార్పు వస్తుంది. క్రికెట్ తోపాటు హాకీ, ఫుట్ బాల్, అథ్లెటిక్స్, ఇతర క్రీడలు కూడా తమ స్థానాన్ని సంపాదించుకోగలుగుతాయి. అప్పుడే భారత్ క్రికెట్ కింగ్ గా మాత్రమే కాకుండా నిజమైన క్రీడాదేశంగా ఎదుగుతుంది.

-మహమ్మద్ ఆరిఫ్,

96184 00190

Next Story