కపుల్ ఫ్రెండ్లీ... ఆధునిక ప్రేమకథ

by Ravi |   (  Updated:2026-05-02 01:15:23  IST  )

ఆధునిక ప్రేమలో కలయికలు, విరహం, జ్ఞాపకాల భావోద్వేగాలను హృదయాన్ని తాకేలా చూపించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా సమీక్ష. జీవితం, ప్రేమ, స్వప్నాల మధ్య సంఘర్షణను సున్నితంగా ఆవిష్కరించిన కథనం.

కపుల్ ఫ్రెండ్లీ... ఆధునిక ప్రేమకథ
X

కపుల్ ఫ్రెండ్లీ సినిమాలో ప్రేమ కథ కొత్తది కాకపోయినా కథనం పరిపక్వతతో ఆధునికంగా ఉంటుంది. హృదయాన్ని తాకేలా ఉంటుంది. చెన్నై వానలో తడిసిన ప్రేమకథ ఇద్దరూ దగ్గరయ్యే క్షణాల కంటే, దూరమయ్యే వాస్తవ పరిస్థితుల్నే ఎక్కువగా వినిపిస్తాయి. ప్రేమ కథలు సాధారణంగా “ఎలా ఎప్పుడు ఏ సందర్భంలో కలిశారు” అని మొదలవుతాయి. కపుల్ ఫ్రెండ్లీ మాత్రం “ఎలా మారిపోయారు” అని ప్రశ్నిస్తుంది.

నిజానికి సినిమాల్లో ప్రేమ కథలు మనకు కొత్తవి కావు. కానీ ఆధునిక కాలంలో ‘ప్రేమ’ కొత్త ప్రశ్నలతో, కొత్త బాధలతో, కొత్త ఆశలతో మలుపులు తిప్పుతోంది. జీవన సంఘర్షణలు ఆసక్తులు ఆర్ధిక స్థితులు ఆ కథల్ని ప్రభావితం చేస్తున్నాయి.. అలాంటి ఆధునిక ప్రేమ భావజాలాన్ని మృదువుగా, నిజాయితీగా తెరపై ఆవిష్కరించిన చిత్రం ఈ ‘కపుల్ ఫ్రెండ్లీ’. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ సున్నితమైన కథనం సినిమాకి పెద్ద బలం.

చెన్నై నగరమే ఒక పాత్రలా మారి...

ఏ పనీ చేయకుండా ఇంటీరియర్ డిజైనర్ కోర్సు చేసి ఖాళీగా ఉంటున్నాడని, తన సంపాదనతో కనీసం ఒక సుత్తి లేదా ఒక మేకునయినా కొన్నాడా? అన్న తండ్రి మాటలు పడలేక శివ చెన్నై చేరుకుంటాడు. నెల్లూరులో సంప్రదాయ కుటుంబంలో పుట్టిన శివగా సంతోష్ శోభన్ బాగా నటించాడు.. చెన్నైలో ఒక గదిలో అద్దెకుంటూ బైక్ పూలింగ్ చేస్తూ ఉంటాడు. కర్నూలుకు చెందిన అమ్మాయి మిత్ర. ఆమె తన ఇంట్లో చేస్తున్న పెళ్లి ఒత్తిడి తప్పించుకోవడానికి చెన్నైలో హాస్టల్లో ఉంటూ ఐ టి. జాబ్ కోసం ఉచ్యోగ ప్రయత్నాల్లో వుంటుంది. ఇక అప్పుడు చెన్నై ఈ కథలో ఒక నగరంగా మాత్రమే కాదు.. ఒక పాత్రలా మారుతుంది.

వరిచయం స్నేహంగా, ప్రేమగా..

ఈ సినిమా నగరజీవన శైలిలో తేలియాడుతున్న ఇద్దరు యువ మనసుల ప్రయాణాన్ని చెబుతుంది. భిన్న కలలతో వచ్చిన శివ, మిత్రల కలలు వేరు, కానీ వారి ఒంటరితనం సంఘర్షణ ఒకటే. శివ బైక్ టాక్సీ నడుపుతున్న ప్రయాణంలో అనుకోకుండా ఒక రోజు మిత్రను కలుస్తాడు. పరిస్థితులు ఇద్దరినీ దగ్గర చేస్తాయి.. హాస్టల్ సీటు లేక మిత్రకు ఉండటానికి చోటు లేని స్థితి వస్తుంది. శివకేమో అద్దె కట్టలేని స్థితి, ఇద్దరమూ తన గదిని షేర్ చేసుకుందామని అడుగుతాడు. అలా అవసరార్థం మొదలైన పరిచయం స్నేహంగానూ, ప్రేమగానూ, ఆ తర్వాత సహజీవనంగానూ మారుతుంది.

కెరీర్‌లో ఒత్తిడులు, అపార్థాలు..

ఇద్దరూ కలిసి జీవితం నిర్మించుకోవడం మొదలు పెడతారు. మిత్ర ప్రోత్సాహంతో శివకి ఇంటీరియర్ ప్రాజెక్టులు రావడం మొదలవుతుంది. మంచి ఇంటికి మారుతారు. బంధం మరింత గాఢమవుతుంది. ఈ దశలో సినిమా చాలా సహజంగా, ఇవాల్టి యువత జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మిత్ర తండ్రి ఆమె పెళ్లి కోసం ఒత్తిడి చేస్తాడు. శివ కెరీర్‌లో ఒత్తిళ్లు వస్తాయి. చిన్న అపార్థం ఇద్దరినీ దూరం చేస్తుంది. ప్రేమ ఉన్నా పట్టుదలకు పోయి విడి పోతారు.. ఇవ్వాళ వున్న వృత్తి జీవితాల్లోని ఒత్తిడుల నేపధ్యంలో ఎంత త్వరగా కలుస్తారో, ఎంత త్వరగా విడిపోతారో దర్శకుడు ఇక్కడ చెబుతాడు. ఇక్కడే కథ ఒక గంభీర మలుపు తీసుకుంటుంది.

ప్రతి క్షణాన్ని నిలుపుకోవాలని...

మిత్రకు జ్ఞాపకశక్తి కోల్పోయే వ్యాధి వస్తుంది. ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. శివ మాత్రం ఆమెను వదలడు. ఆమెతో గడిపే ప్రతి క్షణాన్ని ప్రేమగా నిలుపుకోవాలని ప్రయత్నిస్తాడు. మిత్ర రాసిన డైరీ, ఆమె మాటలు శివకు మార్గదర్శకం అవుతాయి. ఆమె లేకపోయినా, ఆమె ప్రేమ అతనిలో మిగిలి ఉంటుంది. ఇదే ఈ సినిమాకు ఆత్మ. కపుల్ ఫ్రెండ్లీ మనకు చెప్పే విషయం చాలా సున్నితమైనది ప్రేమ అనేది శాశ్వతం కాకపోవచ్చు, కానీ అది మనలో మిగిల్చే అనుభూతి శాశ్వతం. జీవితంలో కలవడం విడిపోవడంలో వుంటుంది. అందుకే ఇవ్వాళ ఉన్న క్షణాలను నిజంగా జీవించడం నేర్చుకోవాలి. ఈ సినిమా చాలా తేలికగా మొదలై, లోతుగా ముగుస్తుంది. ఇది కేవలం ఒక ప్రేమ కథ కాదు, ఇది జ్ఞాపకాల కథ, కోల్పోయిన అనుబంధాల కథ, మనిషి మనసు తట్టుకునే శక్తి గురించి ధ్వనించే ఒక నిశ్శబ్ద గీతం. అంతేకాదు ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఒక ప్రశ్నను మన ముందుంచుతుంది.

ప్రేమలో ఇద్దరూ సమానంగా ఉండగలరా?

శివకు ప్రేమ ఒక ఆశయం. మిత్రకు జీవితంతో పాటు ప్రేమ ఒక భాగం మాత్రమే. ఇక్కడే విభేదం మొదల వుతుంది. ఒకరు ప్రేమలో పూర్తిగా మునిగిపోతే, మరొకరు తన స్వప్నాలను కోల్పోకుండా నిలబడాలని చూస్తారు. అట్లని ఇద్దరిదీ తప్పు కాదు. కానీ ఆశయం, స్వప్నం రెండూ కలిసినప్పుడు ఆ అనుబంధం ఒక సున్నిత మైన దారిపై నడుస్తుంది. ఈ సినిమా హాయిగా సాగే ప్రేమకథ కాదు. అనేక ప్రశ్నల్ని లేవనెత్తే సినిమా. ప్రేమలో ఎంతవరకు మారాలి? ఒకరి కోసం మరొకరు తన స్వప్నాలను వదులుకోవాలా? లేక ప్రేమను వదిలేసి తన స్వప్నాలను నిలబెట్టుకోవాలా? ఈ ప్రశ్నలకు సినిమా సమాధానం ఇవ్వదు.. వీక్షకుల్ని ఆలోచింపజేస్తుంది. కపుల్ ఫ్రెండ్లీ మనకు ఒక నిశ్శబ్ద సత్యాన్ని చెబుతుంది. ప్రేమ అనేది కలిసి జీవించడం మాత్రమే కాదు కొన్నిసార్లు విడిపోయిన తర్వాత కూడా ఒకరి లోపల ఇంకొకరు మిగిలి పోవడం. కొన్ని ప్రేమ కథలు వివాహంతో ముగుస్తాయి. కొన్ని కథలు దుఖంతో ముగుస్తాయి. కపుల్ ఫ్రెండ్లీ రెండో రకం. మిత్ర జ్ఞాపకాల్లో శివ అట్లా నిలిచిపోతాడు.


సమీక్షకులు

-వారాల ఆనంద్

94405 01281

Next Story