బంగారు తెలంగాణలోనూ.. మా బతుకులు ఇంతేనా?

by Disha edit |
బంగారు తెలంగాణలోనూ.. మా బతుకులు ఇంతేనా?
X

సుపరిపాలనను సాధించడం భారత రాజ్యాంగ స్వప్నాల్లో ఒకటి. అది సాకారం కావాలంటే.. ప్రభుత్వాలు పారదర్శకంగా పనిచేస్తూ, ప్రజల పట్ల జవాబుదారీతనంతో మెలగాలి. తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్లు, నిధులు, నియామకాలు, స్వయం పాలనా నినాదాలపై. అది ఆనాడు కొద్దిమందితో ప్రారంభమై, కోట్లమందిని చేరింది. ఈ ఉద్యమం తెలంగాణ అంతటా దావానంలా వ్యాపించింది. ప్రజలందరూ పాల్గొని దీనిని ప్రజా ఉద్యమంగా మార్చారు. ప్రజా ఉద్యమం, అమరుల ఆత్మ బలిదానాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో, రెండుసార్లు అధికారం చేపట్టిన కేసీఆర్ తన ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తామని, 10వ పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచుతామని హామీలిచ్చారు. కానీ ఇంతవరకు అతీగతీ లేదు.

ఆ వ్యవస్థే లేకుండా చేస్తామని..

ప్రపంచీకరణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు 1990 సంవత్సరం నుండి ప్రైవేటీకరణ విధానాలు అమలు జరుపుతూ కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. అందులో భాగంగా రకరకాల చట్టాలను రూపొందించి కాంట్రాక్ట్ వ్యవస్థకు ద్వారాలు తెరిచాయి. దీంతో 1994 నుండి 1999 వరకు కొన్ని ప్రభుత్వ శాఖలకే పరిమితమైన కాంట్రాక్టు వ్యవస్థ 2000 సంవత్సరం నాటికి అన్ని ప్రభుత్వ శాఖలకు విస్తరించింది. ఇప్పుడు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఉంది. అన్ని ప్రభుత్వ శాఖలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, ప్రభుత్వ సొసైటీలు, యూనివర్శిటీలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలలో సుమారు రెండులక్షల మందికి పైగా కాంట్రాక్ట్ ఔట్ ‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు దశాబ్దాల తరబడి పని చేస్తున్నా వీరికి కనీస వేతనాలు అందక, చట్టబద్ద సౌకర్యాలు అమలు కాక, ఉద్యోగ భద్రత లేక నానా సమస్యలతో సతమతమవుతూ పనిచేస్తున్నారు. వీరందరూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి ఉద్యమాలు నడిపిన వారే! కారణం స్వరాష్ట్రం వస్తే తమ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని.. ప్రత్యేకించి 42 రోజుల సకల జనుల సమ్మెలో అన్ని తామై నడిపించారు. ఆశించినట్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, రాష్ట్రం ఏర్పడుతున్న తొలి ఎన్నికలలో అప్పటి టీఆర్ఎస్ పార్టీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థను కూకటి వేళ్ళతో పెకలించి రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు. దీంతో ఆనాటి ఉద్యోగులందరూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. 2014 జూలై 16న జరిగిన మొదటి మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన 43 అంశాలలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ అంశం కూడా ఉంది. కానీ ఉమ్మడి రాష్ట్రంలోని ఉద్యోగుల విభజనకు ముడిపెట్టి 18 మాసాలు కాలం గడిపారు. అనంతరం 2016 లో మరోసారి జనవరి 31 లోపు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేస్తామని చెప్పారు. కానీ నేటికి ప్రభుత్వం నుండి కానీ, సీఎస్ నుండి, శాఖల కార్యదర్శుల నుండి ఈ అంశాలపై ఉత్తర్వులు వెలువడలేదు. ఫలితంగా, ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ఆరు సంవత్సరాల కిందటి 9వ పీఆర్‌సీ ప్రకారం వేతనాలు చెల్లిస్తూ వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ, 8 గంటల పనిదినం, సెలవులు, మెటర్నిటీ లీవులు, గ్రాట్యూటీ, ప్రమాద బీమా లాంటి చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయడం లేదు. దీని వలన ఉద్యోగులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా తీవ్రంగా నష్టపోతున్నారు.

వారి వ్యథలను అర్థం చేసుకొని..

తెలంగాణ రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి ఆందోళన పోరాటాలు అవసరం లేదని ఆర్జీలు ఇస్తే సరిపోతుందని ఆనాడు ప్రభుత్వ పెద్దలు చెప్పారు. కానీ టీఆర్ఎస్ పాలనలో 9 సంవత్సరాలుగా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. ఆర్‌టీసీ, గ్రామీణా ఉపాధి హామీ, 108, దేవాలయ పూజారులు, ఆరోగ్యశ్రీ, వీఆర్ఏలు, ఆశాలు, గ్రామ పంచాయతీ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులందరూ సంఘటితంగా పోరాడారు. కొన్ని సమస్యలు పరిష్కారం అయితే కీలకమైన రెగ్యులరైజేషన్ కోసం యాక్ట్ 2 / 94‌ను ఆడాప్ట్ చేసుకొని సవరించాలని అసెంబ్లీ తీర్మాణం చేయాలని, ఎన్నికల కోడ్ ఉందని, ఇతరాత్ర కారణాలతో సాకుగా చూపి వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. ఈ విధానానికి స్వస్తి పలికి అందరిని వెంటనే పర్మినెంట్ చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. గత ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 8వ, 9వ, పీఆర్సీ వర్తింపజేసి ఆయా క్యాడర్లకు సంబంధించిన కనీస మూల వేతనాన్ని (బేసిక్ పే) అమలు చేసి చెల్లించడం జరిగింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం 10వ పీఆర్సీ వర్తింప చేయకుండా స్లాబులు పద్ధతిని అనుసరించి వేతనాలు పెంచుతూ జి.వో. నెం 14 విడుదల చేసింది. ఇది కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీవ్రమైన ఆర్థిక నష్టం కలిగిస్తుంది. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండవ ధనిక రాష్ట్రమని చెప్పిన పాలకులు కాంట్రాక్ట్ బౌట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులేషన్, 10వ పీఆర్సీ అమలు ఎందుకు చేయడం లేదు?

ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో 80 వేల మంది కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారని తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణలకు వేసిన అధ్యయన కమిటీ 25549 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులున్నారని తేల్చింది. కానీ ప్రభుత్వం 17 వేల లోపు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామంటుంది. ఇందులో ఏది వాస్తవం? ఏది అవాస్తవం? అర్థం కాక ఉద్యోగులు ఆందోళన పడుతున్నారు. పైగా రెగ్యులరైజేషన్‌కు ఎవరు అర్హులో? ఎవరు అర్హులు కాదో? తేల్చకుండా ప్రభుత్వమే నాన్చుతుంది. ఫలితంగా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మధ్య ఒకే ప్రభుత్వ శాఖలోని ఒకే క్యాడర్ ఉద్యోగుల మధ్య ఘర్షణను రాజేసి ప్రభుత్వం పక్కకు తప్పుకోవాలని చూస్తుందనే అనుమానం సర్వత్ర వ్యక్తమవుతుంది. కాంట్రాక్టు వ్యవస్థ ప్రారంభంలో ఉద్యోగుల వయసు 30 సంవత్సరాలలోపు. ఇప్పుడు కొందరి వయసు సుమారు 58 సంవత్సరాలు. వారి సర్వీస్ తక్కువగా ఉండటంతో ఆశించిన స్థాయిలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందవు. కావున ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పర్మినెంట్ చేయడం చాలా అవసరం. ఎన్నికల మేనిఫెస్టోలో అందరినీ పర్మినెంట్ చేస్తామని చెప్పి రకరకాల కారణాలు, నిబంధనలు పెట్టి వీరిని పర్మినెంట్ చేయలేదు. అందుకే వీరి బాధలను అర్థం చేసుకుని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో ఈ అంశం కచ్చితంగా పెట్టాలి. కొత్తగా ఏ ప్రభుత్వం ఏర్పడిన ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందర్నీ బేషరతుగా పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలి. అప్పుడే బంగారు తెలంగాణకు బాటలు పడుతాయి.

మన్నారం నాగరాజు

తెలంగాణ లోక్‌సత్తా పార్టీ, అధ్యక్షుడు

95508 44433


Next Story

Most Viewed