కాంగ్రెస్ ప్రతిష్ట, బీఆర్ఎస్ భవిష్యత్తు.. జూబ్లీహిల్స్‌లో ఎవరికి బలం?

by Ravi |   (  Updated:2025-11-09 01:15:35  IST  )

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం ఒక నియోజక వర్గం పరిమితిని దాటి, రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును సూచించే దిశగా మారింది. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఏర్పడిన ఈ ఉపఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలోని

కాంగ్రెస్ ప్రతిష్ట, బీఆర్ఎస్ భవిష్యత్తు.. జూబ్లీహిల్స్‌లో ఎవరికి బలం?
X

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం ఒక నియోజక వర్గం పరిమితిని దాటి, రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును సూచించే దిశగా మారింది. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఏర్పడిన ఈ ఉపఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలోని శక్తి సామర్థ్యాన్ని పరీక్షించే వేదికగా నిలిచింది. సానుభూతి, వ్యూహాలు, మైనారిటీ ఓట్లు, పట్టణ మూడ్ అన్నీ కలసి ఓటు లెక్కలకన్నా పెద్ద రాజకీయ సంకేతాలుగా రూపుదిద్దు కుంటున్నాయి. కాంగ్రెస్ అధికార పీఠాన్ని బలపరచుకోవాలనుకుంటుంటే, బీఆర్ఎస్ తన పునరుజ్జీవనాన్ని నిరూ పించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఫలితం కేవలం ఓ సీటు గెలుపో ఓటమో కాదు.. తెలంగాణ రాజకీయాల్లో దిశను నిర్ణయించే సూచీగా నిలవబోతోంది.

జూబ్లీహిల్స్ అనే ప్రాంతం పేరు 1963లో పరిగణనలోకి వచ్చినప్పటికీ, 1967లో చల్లగళ్ల నర్సిహం అనే ఐఏఎస్ అధికారి గుట్టలుగా ఉన్న ఈ ప్రాంతంలో నివాసం ఏర్ప ర్చుకొని అభివృద్ధి చేయగా 1980 నాటికి గాను దాదాపు 350 ఆవాసాలతో వృద్ధిలోకి వచ్చింది. 2001 జనాభా లెక్కల ప్రాతిపదికన, నియోజకవర్గ పునర్విభజన చట్టం -2002 ద్వారా జూబ్లీహిల్స్ నియోజకవర్గంగా 2008లో ఏర్పడింది. మొదటిసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గం పేరుతో 2009 సాధారణ ఎన్నికలు మొదలయ్యాయి.

వేర్వేరు ఎన్నికల్లో వేరువేరు తీర్పులు..

ఈ ఉపఎన్నికలో అన్ని పార్టీల ఎన్నికల ప్రచార శైలిని గమనిస్తూ, కాస్త గ్రౌండ్ రియాల్టీని తెలుసుకుంటే గెలుపు ఎవరిదో అంచనా వేయడం పెద్ద కష్టమేమీ కాదు. నిత్యం సోషల్ మీడియాలో వస్తున్న తీర్పులను నిజమని నమ్మలేం, అబద్ధమని తీసిపారేయ్యాలేం. సానుభూతితో, సోషల్ మీడియాతో రాష్ట్రం మొత్తం గందరగోళం సృష్టించే స్ట్రాటజీ ఒకవైపు, పదునైన వ్యూహలతో, అధికార బలంతో, ఎంఐఎం మద్దతు ఉందన్న ఆత్మవిశ్వాసం మరోవైపు ఆ పార్టీలకు ఉంది. మొత్తం 3,90,877 ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో అసెంబ్లీ, పార్లమెంట్, జీహెచ్ఎంసీ వేరు వేరు ఎన్నికల్లో ఒక్కో రకంగా తీర్పులిస్తూ వస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ పల్లెలన్నీ కాంగ్రెస్ వైపు ఉంటే హైదరాబాద్ ఓటర్లు బీఆర్ఎస్ వైపు నిలబడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం పార్టీలకు మొగ్గు చూపిన ఓటరు, ఓ వైపు సెంటిమెంట్, మరోవైపు పాలన పరమైన వైఫల్యాలు, అధికార పార్టీ పథకాల ప్రచారం మధ్యలో ఓటరు నాడి అంతుపట్టలేక సర్వే సంస్థలు తలలు పట్టుకుంటున్నాయి. అందుకే అన్ని పార్టీలు భయం గుప్పిట్లో గల్లీ గల్లీ గాలిస్తున్నాయి.

పార్టీల బలాలు, బలహీనతలు..

కాంగ్రెస్‌కు, సీఎం రేవంత్ రెడ్డి ఉండే ప్రాంత పరిధి ఎన్నికలు అంతే కాకుండా ఆంధ్రావాళ్లతో ఆయనకు ప్రత్యేకంగా ఉన్న పరిచయాలు, నవీన్ యాదవ్ ఒకసారి ఎంఐఎం, మరోసారి ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓటర్లకు సూపరిచితమైన అభ్యర్థిని ఎంపిక చేసుకోవడంలో ఆ పార్టీ చాణక్యం ప్రదర్శించింది. కానీ పార్టీపై వ్యతిరేకత నవీన్ యాదవ్‌కు ఉన్న బలాన్ని బలహీన పరచనున్నదా? అనేది బేరీజు వేసుకోవాలి. ఇది గనుక బ్యాలెన్స్ అయినప్పటికీ ప్రచారంలో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తోన్న ఓవైసీ బ్రదర్స్ వైఖరి వల్ల ఎంఐఎం ఓట్లన్ని కాంగ్రెస్‌కే పడుతాయన్న గ్యారెంటీ లేని గందరగోళం ఏర్పడింది. బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ అయినప్పటికీ పెద్దగా ప్రభావితం చేయలేక ప్రచారంలోనే వెనుకంజ పడిపోయినట్టు క్షేత్ర స్థాయిలో అర్థం అవుతుంది. బీఆర్ఎస్ సెంటిమెంట్, ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లో తీసుకుపోవడంలో కొంత ముందంజలో ఉన్నా లోకల్ లీడర్లకు ప్రాధాన్యం ఇవ్వక పోవడం బయట నుండి వచ్చిన నాయకుల హడావుడితో లోకల్ కారు కేడర్ బేజారులో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాక అభ్యర్థికి కుటుంబ పోరుతో ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు.

స్థానిక ఎన్నికలపై ప్రభావం..

ముస్లిం ఓట్లు, బస్తీ ఓట్లు, సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టుల ఓటర్లపై పైన మాత్రమే అన్ని పార్టీలు ఆధారపడి ఉన్నాయి. కానీ సంపన్న వర్గాల ఓట్లపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ నియోజకవర్గం ఒక రకంగా మినీ ఆంధ్రను తలపిస్తుంది. కాకపోతే టీడీపీ మద్దతు తటస్థంగా ఉండటం మూలాన టీడీపీ అభిమానులు ఎటువైపు మొగ్గు చూపుతారనేది సంక్లిష్టత నెలకొంది. మొత్తం మీద రేసులో బీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రమే ఉన్నట్టుగా గ్రౌండ్ రియాల్టీలో తెలిసొస్తుంది. ఇదే నిజమైతే భారీ మొత్తంలో బీజేపీ, ఎంఐఎం ఓట్లు ఎటువైపు డైవర్ట్ అవుతాయనేది ఆలోచించాల్సి ఉంది. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం. అట్లా అని ప్రభుత్వం పడిపోయేంత ప్రమాదం కూడా లేదు. కానీ మొత్తం రాష్ట్ర రాజకీయ సమీ కరణాలు మారి వీటి ప్రభావం లోకల్ బాడీ ఎన్నికపై పడే ప్రమాదం ఉంది.

ఈ గెలుపు తాత్కాలికమే..

ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీకి వెయ్యి ఏనుగులు బలాన్ని ఇచ్చే ఎన్నిక ఇది. వలసల నియంత్రణకు, కింది స్థాయి కేడర్ ఇంకో మూడేండ్లు పార్టీనే పట్టుకుని ఉండేందుకు ఇది దోహదపడుతుంది. కానీ అధికారం కోల్పోయి రెండేడ్లు అయినా సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టని పార్టీ అధిష్టానం, ఇదే గాలివాటపు గెలుపుపై ఆధారపడి అహంభావం పెరిగి, వచ్చే అధికారం మాదే అని కేడర్‌ను విస్మరించే ప్రమాదం ఉంది. ఇరు పార్టీలకు ఈ ఎన్నికల గెలుపు అనేది తాత్కాలిక ఆనందమే తప్ప తమ తమ తప్పొప్పులను పోస్ట్ మార్టం చేసుకునే వీలు అయితే కల్పించదు. ఇక్కడి ఓటర్లలోని విభిన్నతను గమనించాక ఇలాగే రాష్ట్రం మొత్తం ట్రెండ్ ఉన్నదని, ఉంటుందని చెప్పలేం. సరైన రాజకీయ పరిజ్ఞానం లేకపోతే ప్రతీ ఎన్నికల్లోనూ గెలిచేది కేవలం పార్టీలే, ఓడిపోయేది మాత్రం ప్రజలే..

- ముఖేష్ సామల

97039 73946

Next Story