- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్.. బీజేపీ జాతీయవాదాన్ని ఒప్పుకోదు!
కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ కోల్పోవడానికి కారణాలేమిటి? బీజేపీ వరుస ఎన్నికల విజయాల వెనుక ఉన్న రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణ. కాంగ్రెస్, బీజేపీ సిద్ధాంతాలు, ఓటర్ల తీర్పు, దేశ భద్రత, అభివృద్ధి రాజకీయాలపై సమగ్ర అభిప్రాయ వ్యాసం.

భారత రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య సిద్ధాంతపరమైన పోరు కొత్తది కాదు. అయితే ఇటీవలి కాలంలో కాంగ్రెస్ నాయకులు ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందుత్వ భావజాలంపై చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ విమర్శలను దాటి ద్వేషపూరిత ప్రచారంగా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజలు పదేపదే ఎన్నికల్లో తిరస్కరిస్తున్న కారణాలను ఆత్మపరిశీలన చేసుకోవడం కన్నా, ప్రత్యర్థి పార్టీలను నిందించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
స్వాతంత్ర్య సమరంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల త్యాగాలు బలిదానాలు అసమాన్యమైనవే. స్వాతంత్ర్యం అనంతరం ఎలా తన ప్రజాదరణను కోల్పోయింది? బీజేపీ వరుస విజయాలకు కారణాలేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం రాజకీయ వాస్తవాలను పరిశీలించడం అవసరం.
స్వాతంత్య్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ..
స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్‌లో అధికార దాహం, కుటుంబ రాజకీయాలు పెరిగాయని విమర్శలు ఉన్నాయి. 1967లో పార్టీ చీలికకు ఇందిరా గాంధీ అధికార కాంక్షే కారణమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు. ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్య హక్కులను అణచివేసినా, కాంగ్రెస్‌లో ఇందిరాను ప్రశంసించే సంస్కృతి పెరిగిందనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే, ‘ఇందిరా గాంధీ బతికి ఉంటే బీజేపీని నిషేధించేది’ అనే అశోక్ గెహ్లోత్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. ఆమె ఇంతకాలం బతికి ఉంటుందా? పోనీ బతికున్నా ఇంతకాలం శాశ్వతంగా అధికారంలో ఉంటుందా? 1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఎమర్జెన్సీ విధించి, అనేకమంది నాయకులను జైల్లో పెట్టి, చిత్రహింసలకు గురిచేసింది. ఇందుకు ప్రతిగా జనతా ప్రభుత్వం ఆమెపై, ఆమె పార్టీపై ప్రతీకారం తీర్చుకోవాలి. అలాంటి పని జరగలేదు. ఇక 1952 నుండి జనసంఘ్ పేరుతో బీజేపీ రాజకీయాలను చేస్తుంది అనే విషయం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గెహ్లాత్ తెలియదంటే ఎవరు నమ్ముతారు?
కాంగ్రెస్‌కు ఇది మింగుడు పడటం లేదు!
ఇక బీజేపీలో ముస్లింలకు ప్రాధాన్యత లేదని అస్తమానం కాంగ్రెస్ నాయకులూ, లౌకికవాద ముసుగు వేసుకున్న కుహనా మేధావులు మాట్లాడుతున్న మాటల్లో అర్థం లేదు. బీజేపీని వ్యతిరేకించే అన్ని రాజకీయ పార్టీలలో ముస్లింలకు పెద్ద పీటే వేస్తున్నారు కదా? సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ, ముస్లింల మత హక్కులను కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ చట్టం చేసింది. ఈ దేశ వనరులను ఉపయోగించుకోవడానికి ముస్లింలకు మాత్రమే మొదటి హక్కు ఉంటుందని ఏకంగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్న మాటలు ఈ దేశ ప్రజలకు గుర్తు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ముస్లింల కోసమే పనిచేస్తుందని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా చెప్పిన మాటలు ఈ దేశ హితాన్ని కోరే ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. ముస్లింలను సంతృప్తి పరచడం కోసం దేశాన్ని విడగొట్టి, రెండు ఇస్లామిక్ దేశాలను ప్రపంచపటంలోకి ఎక్కించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ముస్లింలను మతం ఆధారంగా సంఘటిత పరిచినప్పటికీ, బీజేపీ పార్టీ గొడుగు కింద హిందూ ఓటు బ్యాంకు పోలరైజ్ కావడం మింగుడు పడడం లేదు.
ఓటర్ గుర్తించాడు కాబట్టే..
ఇక రాహుల్ గాంధీ... హిందుత్వంపై, హిందువులపై, హిందుత్వ సంస్థలపై, ప్రధాని మోడీపై చేసే వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. అలాగే దేశ వ్యతిరేకంగా ప్రవర్తించే మానసిక స్థితి, మన సైన్యం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం, అంతర్జాతీయ వేదికలపై మన దేశ రాజ్యాంగ సంస్థల పని తీరుపై విమర్శలు గుప్పించడం ఆయనకు అలవాటుగా మారింది. కాంగ్రెస్ నాయకుల దేశ వ్యతిరేక ఆలోచనలను, ముస్లిం సంతుష్టీకరణను, తీవ్రవాద అనుకూల ధోరణిని ఈ దేశ హితాన్ని కోరే ఓటర్ గుర్తించాడు కాబట్టి బీజేపీ మూడుసార్లు పార్లమెంట్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది. శాంతి భద్రత పరిరక్షణలో, దేశాన్ని శక్తివంతంగా మలచడంలో, దేశ అభివృద్ధిని పరుగులెత్తించడంలో, ప్రపంచ దేశాలలో దేశ పరపతి పెంచడంలో మోడీ పరిపాలన భేషుగ్గా ఉందని ప్రజలు నమ్ముతున్నారు.
దేశ భద్రత ముఖ్యమని ప్రకటిస్తేనే..
దేశంలో' హిందూ ఓటు' పోలరైజ్ కావడమే బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమనే విషయం ఎవరూ కాదనలేని సత్యం. అయినా సరే బీజేపీ హిందువుల కోసం ప్రత్యేకమైన ఎటువంటి చట్టాలు అమలు చేయలేదు. అదే సమయంలో ముస్లింల హక్కులకు భంగం కలిగించే విధంగా చట్టాలు చేయలేదు. హిందువులు తిరస్కరించడంతో కాంగ్రెస్ అధికారానికి దూరమైందనే విషయం కాంగ్రెస్ నాయకులకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల తర్వాత బాగా అర్థమై ఉంటుంది. కాబట్టి బీజేపీని తిట్టడం వల్ల ఆ పార్టీకి ఒరిగేది ఏం లేదు. ఈ దేశ భద్రత, అభివృద్ధి విషయంలో వారి పార్టీ ఆలోచన విధానాన్ని దేశ ప్రజల ముందు ఉంచడం వారు చేయవలసిన మొదటి కర్తవ్యం. ఈ పనిని ఎంత త్వరగా మొదలుపెడితే, దేశానికి అంత మంచి జరుగుతుంది.
- ఉల్లి బాలరంగయ్య,
రాజకీయ విశ్లేషకులు
94417 37877






