బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పునరాలోచించాలి!

by Ravi |   (  Updated:2025-11-25 00:45:44  IST  )

బీసీల హక్కుల కోసం, మండల్ ఉద్యమం తర్వాత మరోసారి సామాజిక న్యాయం కేంద్రంగా మలి మండల్ ఉద్యమం తెలంగాణ గడ్డపై రూపుదిద్దుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పునరాలోచించాలి!
X

బీసీల హక్కుల కోసం, మండల్ ఉద్యమం తర్వాత మరోసారి సామాజిక న్యాయం కేంద్రంగా మలి మండల్ ఉద్యమం తెలంగాణ గడ్డపై రూపుదిద్దుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా బీసీలకు అన్ని రంగాల్లో 42% రిజర్వేషన్ల అమలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక ఆయుధం..

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో బిల్లు పెట్టి తన బాధ్యతను ప్రదర్శించుకుంది. కానీ కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాలను అన్వేషిస్తూ బీసీ బిల్లు అంశాన్ని పెడచెవిన పెడుతున్నది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కావాలంటే ఉన్నవి రెండే మార్గాలు.. ఒకటి‌ పార్లమెంట్ ద్వారా చట్టం చేసి 9వ షెడ్యూల్‌లో చేర్చడం, రెండవది న్యాయస్థానాలు విధించినటువంటి 50% సీలింగ్‌ని పూర్తిగా ఎత్తివేసి రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం. అయితే కేంద్ర ప్రభుత్వ చొరవ లేకుండా ఇందులో ఏ ఒక్క విధానం ముందుకు వెళ్లే అవకాశం ఇప్పటికి లేదు, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ కొన్ని రోజులుగా ప్రవచి స్తున్నటువంటి ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం అమలు జరిగి తమ పార్టీ తిరిగి అధికారం చేపట్టాలంటే ఇప్పుడు వారికి అనువైన ఒకే ఒక్క యుద్ధ క్షేత్రం తెలంగాణ. వారికున్న ఏకైక ఆయుధం 42% రిజర్వేషన్లు.

తెలంగాణ మోడల్ ఆదర్శం కావాలి!

అటువంటి ప్రయత్నం ఏ మాత్రం చేయకుండా మొత్తం 50% లోపు రిజర్వేషన్లు అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఈ నెల 22న జీవో నెం.46ను విడుదల చేసింది. హైకోర్టులో డెడికేషన్ కమిషన్ రిపోర్ట్, ఎక్సపర్ట్ కమిటీ రిపోర్ట్ ప్రాతిపదికన బలమైన వాదనలు వినిపించే అవకాశం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పాత రిజర్వేషన్‌తో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవడం బీసీలను అవమా నించడమే.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అయినా కాంగ్రెస్ పునరాలోచన చేసుకుని దేశంలో సామాజిక న్యాయానికి ‘తెలంగాణ మోడల్’ ఆదర్శంగా చూపించాల్సిన అవసరం ఉన్నది.

కేంద్రాన్ని నిలదీయడమే మార్గం!

ఒక సమయంలో కుల గణనకు కూడా ససేమిరా అన్న కేంద్ర ప్రభుత్వం ప్రజా బాహూళ్యంలో బలంగా వినపడుతున్న అభిప్రాయానికి తలొగ్గక తప్పలేదు. ఇదే అదునుగా మెజారిటీ ప్రజల ప్రయోజనార్థం బీజేపీ కలిగించుకుని పార్లమెంట్ సమావేశాలలో 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి తెలంగాణలో అధికారానికి రూట్ క్లియర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బీసీ బిల్లు ప్రవేశ పెట్టకపోతే ఇండియా కూటమి తరపున ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టాలి, ఇటువంటి చిత్తశుద్ధి కలిగిన ఆచరణ కాంగ్రెస్ భవిష్యత్ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబిస్తుంది.

పార్టీ పరమైన రిజర్వేషన్లు తప్పు!

ఇంతటి కీలక సమయంలో రాష్ట్ర మంత్రివర్గం స్థానిక సంస్థల ఎన్నికలపై తీసుకున్న పార్టీ పరమైన రిజర్వేషన్ల తొందరపాటు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. చట్టపరంగా ఈ రిజర్వేషన్ల అమలుతో తరతరాలుగా రాజకీయ అధికారానికి దూరంగా ఉంటున్న అనేక బీసీ కులాలకు కనీస ప్రాతినిధ్యం కల్పించాలి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ఏది విడుదలైన 42% రిజర్వేషన్ల అమలుతో జరగకపోతే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్‌లో కూడా బీహార్ ఎన్నికల ఫలితాలే కొనసాగే ప్రమాదం ఉన్నది.

-నూకల మధు యాదవ్

బీసీ స్టూడెంట్స్ జేఏసీ

63033 43359

Next Story