- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంగ్రాట్స్ త్రిష!
దక్షిణాఫ్రికాతో జరిగిన మహిళల అండర్ 19 టి-20 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్‌ని విజేతగా నిలిపిన భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిషకి

దక్షిణాఫ్రికాతో జరిగిన మహిళల అండర్ 19 టి-20 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్‌ని విజేతగా నిలిపిన భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిషకి, మిగతా టీం సభ్యులకు అభినందనలు.. టోర్నమెంట్ మొదటి నుండి చివరివరకు అద్భుతంగా ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన త్రిష "ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్" అవార్డ్ గెలుచుకుంది. ఐతే చిత్రమేమంటే బలమైన షాట్స్‌తో ఎంతో దూకుడైన బాటింగ్‌తో పాటు ఉపయుక్తమైన స్పిన్ బౌలింగ్ చేసే ఈ యంగ్ ఆల్ రౌండర్‌ని గతేడాది విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో కనీస ధర ఐన 10 లక్షలకి కూడా ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు! తెలంగాణలో పుట్టిన మట్టి బిడ్డలు మాణిక్యాలుగా తయారవుతున్న చరిత్రకు క్రీడారంగంలో మన క్రీడాకారిణులు సాధిస్తున్న అద్భుత విజయాలే తార్కాణంగా చెప్పవచ్చు.
ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన 19 ఏళ్ల త్రిష జనవరి 28న జరిగిన అండర్ 19 వరల్డ్ కప్‌లో అద్భుతమైన సెంచరీ చేసి భారత్‌ని సెమీ ఫైనల్స్‌కి తీసుకెళ్లింది. త్రిష చేసిన సెంచరీ మహిళల అండర్ 19 టీ-20 ప్రపంచ కప్ చరిత్రలోనే మొట్టమొదటిది. లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ ఐన త్రిష ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు కూడా తీసింది. తన సెంచరీని కేవలం 53 బంతుల్లోనే బాది పడేసింది. మొత్తం 59 బంతుల్లో 110 పరుగులు చేసింది ఈ తెలంగాణ బిడ్డ. జనవరి 31న జరిగిన సెమీ ఫైనల్స్‌లో భారత్ ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించి ఫైనల్స్‌కి చేరింది. ఈ మ్యాచ్‌లో కూడా త్రిష తన బాట్‌తో మంచి ప్రదర్శన చేసింది.
ఆమె అవార్డు తండ్రికే అంకితం
ఇక ఫైనల్స్‌లో కూడా బ్యాట్‌తో 44 రన్స్, బాల్‌తో 3/15 ఆల్ రౌండ్ ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. అంతకు మునుపు ఆసియా కప్ మ్యాచెస్‌లోనూ, 2023 సీనియర్స్ ప్రపంచ కప్ టోర్నమెంట్‌లోనూ ఎంతో మంచి ప్రదర్శన ఇచ్చింది. త్రిష తండ్రి ఒక జిం ట్రెయినర్. త్రిష కెరీర్ కోసం వారి కుటుంబం మొత్తం భద్రాచలం నుండి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యారు. త్రిష అనేక ఇంటర్వ్యూలలో తన తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పుకున్నది. ముఖ్యంగా తన కోసం తండ్రి పడ్డ కష్టాల గురించి చెప్పింది. వరల్డ్ కప్‌లో త్రిష సెంచరీ చేసినప్పుడు ఆమె తండ్రి రాంరెడ్డి కూడా ప్రేక్షకుల్లో వుండి తన కుమార్తె ఘనతని స్వయంగా వీక్షించారు. తాను సాధించిన "ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ" అవార్డుని తన తండ్రికే అంకితమిచ్చింది.
కౌసల్యా కృష్ణమూర్తి సినిమా సారాంశం?
మహిళా క్రికెట్లో త్రిష సాధించిన ఘన విజయాల్ని చూస్తుంటే 6 సంవత్సరాల క్రితం వచ్చిన "కౌసల్య కృష్ణమూర్తి" సినిమా గుర్తొచ్చింది. కమర్షియల్ ఫార్మాట్‌లో వచ్చిన ఓ మంచి సినిమా అది. ఈ సినిమా విశిష్టత ఏమిటంటే కూతురు క్రికెట్ కెరీర్‌లో ఎదగడానికి అడ్డంకుల్ని అధిగమించడానికి శ్రమిస్తుంటే రైతైన తండ్రి వ్యవసాయంలో అంతకు రెట్టింపు కష్టాల్ని, అడ్డంకుల్ని ఎదుర్కొంటుంటాడు. ఇద్దరి వ్యధాభరిత జీవితాలు సమాంతరంగా సాగుతుంటాయి. చివరికి కూతురు భారత్‌కి ప్రాతినిధ్యం వహించి జట్టుని గెలుపు బాట పట్టిస్తుంది. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అందుకుంటూ ఆమె క్రికెట్ గురించి మాట్లాడదు. దేశంలో వ్యవసాయం గురించి, దుర్బలమైపోతున్న రైతు గురించి మాట్లాడుతుంది. ఏ బ్యాంక్ అయితే టోర్నమెంట్‌ని వాణిజ్య దృక్పథంతో స్పాన్సర్ చేసి, ఆమెకి నగదు బహుమతిని అందిస్తుందో అదే బ్యాంక్ ఆమె తండ్రి ఇంటిని, ఇంట్లో సామానుని ఋణం కింద జప్తు చేస్తుంది.
క్రీడారంగంలో ఆడపిల్లలు ఎదగాలంటే..?
ఆ విషయం గురించి కౌసల్య మాట్లాడుతుంది. "క్రికెట్లో జట్టుకి కష్టాలు వస్తే కోహ్లినో, టెండూల్కరో వచ్చి గట్టెక్కిస్తాడు. కానీ రైతు కష్టాల్లో వుంటే ఏ హీరో కూడా రైతుకి మద్దతుగా ముందుకొచ్చి కష్టాల నుండి బైట పడేయడు" అంటుంది. క్రికెట్లో విజయం సాధించినంత తేలిక కాదు వ్యవసాయంలో విజయం సాధించటమనే సందేశం ఈ సినిమా ఇస్తుంది. ఈ సినిమాలో క్రీడారంగంలో ఆడపిల్లలు ఎదగటానికి ఎంత మానసిక వ్యధ భరించాలో ప్రభావవంతంగా చూపాడు దర్శకుడు. ఒక కమిట్మెంట్‌తో తీసిన సినిమా ఇది.
కౌసల్యగా ఐశ్వర్య రాజేష్, ఆమె తల్లిదండ్రులుగా రాజేంద్ర ప్రసాద్, ఝాన్సీ తమ పాత్రలకి ప్రాణం పోసారు. ఎన్నో చోట్ల డైలాగ్స్ గుండెల్ని సూటిగా తాకుతాయి. సినిమా మొత్తం మంచి మూడ్ క్రియేట్ చేసిన బాక్ గ్రౌండ్ స్కోర్, ఫోటోగ్రఫీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంత మంచి సినిమా రిలీజ్ ఐన వెంటనే మంచి పేరు తెచ్చుకోగానే ప్రభాస్ నటించిన "సాహో" అనే సినిమా కోసం థియేటర్లను వీడాల్సి వచ్చింది. ఇంతా చేసి ఆ "సాహో" అట్టర్ ఫ్లాప్. అందుకే అనేది "మన సినిమా హీరోలందరూ తెర మీదనే కాదు పరిశ్రమకే విలన్లు" అని!
అరణ్య కృష్ణ
98499 01078






