కామన్ మ్యాన్ డైరీ:కలిసొచ్చిన కరోనా

by Disha edit |
కామన్ మ్యాన్ డైరీ:కలిసొచ్చిన కరోనా
X

కరోనా వైరస్ అంతమైంది. ఐటీ ఆఫీసులు క్రమంగా తెరుచుకుంటున్నాయి. హైబ్రిడ్ సిస్టం కింద పనిచేయాలని ఒక వారం ఆఫీసుకు రావాలని సృజన్‌కు మెయిల్ వచ్చింది. వెంటనే రిప్లయ్ ఇచ్చాడు. 'ఐయామ్ రిజైనింగ్ టు ద జాబ్' అని. కంగుతిన్న కంపెనీ హెచ్‌ఆర్ ఫోన్ చేశాడు. ఆఫీసుకు వచ్చి పని చేయలేనని కరాఖండిగా చెప్పాడు సృజన్. కొత్తగా కొనుగోలు చేసిన రెండెకరాల భూమిలో డెయిరీ ఫారం ఏర్పాటు చేశాడు. ఇద్దరు వర్కర్లను పెట్టుకొన్నాడు. రెండెకరాల భూమిలో కూరగాయలు పండిస్తున్నారు. సౌమ్య బాబును చూసుకుంటూ ఇంటివద్దే ఉంటున్నది. కరోనా మహమ్మారి ఆ కుటుంబం రూపు రేఖలను మార్చేసింది.

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన సృజన్ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగి. హైదరాబాద్​ సీబీఐటీలో బీటెక్ చేసిన సృజన్‌కు 2013లో హైదరాబాద్‌లోని ఓ ఎంఎన్‌సీలో ఉద్యోగం వచ్చింది. నెలకు 30 వేల జీతం. 2014లో వరంగల్ జిల్లాకు చెందిన సౌమ్యతో సృజన్ వివాహం జరిగింది. సౌమ్య ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఉద్యోగ వేటలో ఉండగానే పెళ్లైంది. మాదాపూర్ ప్రాంతంలో మకాం పెట్టారు. సృజన్ తండ్రి పేరు రాజారెడ్డి, తల్లి పేరు లక్ష్మి. ఊళ్లోనే వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నారు. వీళ్ల ఏకైక సంతానమే సృజన్. వార్ధక్యంలో ఉన్నందున వ్యవసాయం చేయలేక ఉన్న రెండెకరాల భూమిని కౌలుకు ఇచ్చారు. జీవితం అలా సాగిపోతున్నది.

పండుగలకు, పబ్బాలకు కొడుకు, కోడలు వచ్చి వెళ్తున్నారు. ఓ రోజు సృజన్‌కు బెంగళూరుకు ట్రాన్స్‌ఫర్ అయ్యింది. పెద్ద కంపెనీలో ఉద్యోగం, ప్రమోషన్‌తోపాటు జీతం కూడా హైక్ చేయడంతో వెళ్లాలనే డిసైడయ్యారు భార్యాభర్తలు. విషయాన్ని తండ్రికి చెప్పాడు సృజన్. తల్లిదండ్రులు వద్దని వారించారు. 'మనకున్నదే తిందాం, ఊళ్లోనే ఉందాం' రమ్మన్నారు. కానీ, ఇంత చదువు చదివి ఊళ్లో ఖాళీగా ఉండటమెందుకంటూ సర్ది చెప్పాడు సృజన్. తల్లి లక్ష్మి వద్దని కన్నీరు పెట్టుకుంది. 'మా ఆరోగ్యాలు బాగా లేకపోతే, మాకేమన్నా అయితే, మీరెప్పుడొస్తారంటూ' వారించింది. తల్లిదండ్రులకు నచ్చజెప్పి బెంగళూరు విమానం ఎక్కారా దంపతులు.

*

నెలకు 1.30 లక్షల జీతం. అత్తామామలు కట్నం కింద ఇచ్చిన డబ్బులు 30 లక్షల వరకు అకౌంట్‌లోనే ఉన్నాయి. భార్య సౌమ్యకూ ఓ ఎంఎన్‌సీలో ఉద్యోగం వచ్చింది. ఆమెకు నెలకు 50 వేల వరకు వస్తున్నది. నెల రోజులకు ఒక సారి స్వగ్రామానికి వచ్చి వెళ్తున్నారు. 'మాకు మనుమడిని ఎప్పుడిస్తున్నారు, వాడితో ఆడుకోవాలని ఉందంటూ' రాజారెడ్డి అడుగుతుంటే 'ఇప్పుడేనా దానికి ఇంకా టైం ఉందంటూ' సర్ది చెబుతున్నారు. అలా కాలం గడిచిపోతోంది.

2018లో బెంగళూరులోనే 50 లక్షలు పెట్టి ఓ ఇల్లు కొనుగోలు చేశారు. ఈఎంఐల జోలికి వెళ్లకుండా ఉన్న డబ్బులు కట్టేసి కొన్నారు. తల్లిదండ్రులను, అత్తామామలను, ఆడబిడ్డలను పిలిచి గృహప్రవేశం కూడా చేశారు. అంతా సాఫీగానే సాగిపోయింది. అందరూ తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. కొన్ని రోజుల తర్వాత వారు ఫార్చునర్ కారు కొన్నారు.

*

2019 ఏప్రిల్‌లో కరోనా విలయం మొదలైంది. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీల యాజమాన్యాలు గజగజా వణికిపోతున్నాయి. ప్రపంచస్థాయి ఉపద్రవం కావడంతో అమెరికాలో ఉన్న కంపెనీలు 'వర్క్ ఫ్రం హోం' అవకాశం కల్పించాయి. అందరూ ఎవరి ఇండ్లకు వాళ్లు వెళ్లిపోతున్నారు. సృజన్, సౌమ్య కూడా ఊరెళ్లిపోదామని డిసైడయ్యారు. ఫ్లయిట్ లేకపోవడంతో ఆ రాత్రికే బెంగళూరు నుంచి కారులో బయల్దేరారు. మరుసటి రోజు ఉదయం ఇంటికి చేరుకున్నారు.

రాజారెడ్డి, లక్ష్మి సంతోషానికి అవధులు లేవు. కొన్ని రోజులైనా కొడుకు, కోడలు తమతోనే ఉంటారనే సంతోషం వారి ముఖంలో కనిపిస్తున్నది. వారి ఇళ్లు పాతకాలం నాటి పెద్ద భవంతి కావడంతో గదులకు, వసతులకు ఏం ఢోకా లేదు. దానిని కొంత మోడిఫై చేయించారు. ఇద్దరూ ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారు. తమ పొలంలో వండిన కూరగాయలు, వడ్లు (బియ్యం), అమ్మ చేతి వంటకు ఫిదా అయిపోయాడు సృజన్. సౌమ్యను అత్త లక్ష్మి కన్నకూతురులా చూసుకుంటున్నది. కొడుకుకు ఏ కష్టం రానీయడం లేదు తండ్రి. ఇంతలో సౌమ్య గర్భవతి అయ్యింది. కరోనా కారణంగా దవాఖానాకు వెళ్లేందుకు భయపడ్డారు. డాక్టర్ అయిన దూరపు చుట్టాల అమ్మాయి వద్దే చూపిస్తున్నారు. డెలివరీ అయి మగబిడ్డ పుట్టాడు. తాతా, నాయనమ్మ అయ్యామని సంబరపడ్డారు.

*

ఏడాదిన్నర గడిచింది. కరోనా తగ్గడంతో లాక్‌డౌన్ ఎత్తేసేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. వ్యాపారాలు యథాతథ పరిస్థితికి చేరుతున్నాయి. తమ పొలం పక్కనే ఉన్న కిష్టారెడ్డి తన భూమి ఎకరం 50 లక్షల చొప్పున నాలుగెకరాలు అమ్మేందుకు రెడీ అయ్యాడు. 'మనమే రెండెకరాలు కొందాం నాన్నా' అన్నాడు సృజన్. 'అంత డబ్బు నా దగ్గర లేదురా' అన్నాడు రాజారెడ్డి. 'నా దగ్గర ఉన్నాయి. ఇక్కడికి వచ్చాక బెంగళూరు పోవాలనిపిస్తలేదు నాన్నా. మీ ప్రేమ, మీ అందరితో కలిసి ఊళ్లోనే ఉండటం మస్తు అనిపిస్తుంది నాన్నా.

అక్కడి ఇల్లు అమ్మేస్తే కోటి రూపాయల వరకు వస్తాయి. నా దగ్గర కోటి రూపాయలున్నాయని' చెప్పాడు. 'మేము అక్కడ పెద్దగా ఖర్చు పెట్టలేదు నాన్నా, ఇక్కడికి వచ్చాక నేను నయా పైసా ఖర్చు పెట్టలేదు. మీరు పెట్టిన తిండే తిన్నం. బయట హోటళ్లు లేవు. మీ దగ్గరకు వచ్చేందుకు ఫ్లైయిట్ టిక్కెట్లు కొనాల్సిన పనిలేదు. వీకెండ్ టూర్లు కూడా లేవు. ఇంటిపట్టునే ఉండటంతో నాలుగు రూపాయలు మిగిలాయని' అన్నాడు. తెల్లవారే కోటి రూపాయలు కట్టేసి రెండెకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇంటి పక్కనే ఉన్న 700 గజాల ఖాళీ స్థలంలో అధునాతన వసతులతో భవంతిని నిర్మించుకున్నారు. 'బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ' అంటారు. కరోనా వచ్చిన వేళ ఈ సాఫ్ట్‌వేర్ దంపతులకు బాగా కలిసొచ్చింది. బాబుతో పాటు రెండెకరాల భూమి, ఊళ్లో పెద్ద ఇల్లు ఇవన్నీ ప్లస్.

*

ఇంతలో కరోనా వైరస్ అంతమైంది. ఐటీ ఆఫీసులు క్రమంగా తెరుచుకుంటున్నాయి. హైబ్రిడ్ సిస్టం కింద పనిచేయాలని ఒక వారం ఆఫీసుకు రావాలని సృజన్‌కు మెయిల్ వచ్చింది. వెంటనే రిప్లయ్ ఇచ్చాడు. 'ఐయామ్ రిజైనింగ్ టు ద జాబ్' అని. కంగుతిన్న కంపెనీ హెచ్‌ఆర్ ఫోన్ చేశాడు. ఆఫీసుకు వచ్చి పని చేయలేనని కరాఖండిగా చెప్పాడు సృజన్.

కొత్తగా కొనుగోలు చేసిన రెండెకరాల భూమిలో డెయిరీ ఫారం ఏర్పాటు చేశాడు. ఇద్దరు వర్కర్లను పెట్టుకొన్నాడు. రెండెకరాల భూమిలో కూరగాయలు పండిస్తున్నారు. సౌమ్య బాబును చూసుకుంటూ ఇంటివద్దే ఉంటున్నది. కరోనా మహమ్మారి ఆ కుటుంబం రూపు రేఖలను మార్చేసింది.

ఎంఎస్‌ఎన్ చారి

79950 47580


Next Story

Most Viewed