- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Come Back India: ప్రపంచాన్ని గెలిచారు.. ఇక మాతృభూమిని నడిపించండి!
అమెరికాలో హెచ్-1బి ఆంక్షల నేపథ్యంలో భారతీయ మేధావులను ఇండియాకు రమ్మని పిలవడం మాత్రమే సరిపోదు. స్థిరమైన పారిశ్రామిక విధానాలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉంటేనే భారత్ నిజమైన గ్లోబల్ టాలెంట్ హబ్‌గా ఎదగగలదు.

‘అమెరికా ఫస్ట్’ నినాదంతో విదేశీయుల వల్ల స్థానికులకు ఉద్యోగాలు దక్కడం లేదనే వాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలంగా వినిపిస్తుంటారు. ఈ క్రమంలోనే హెచ్-1బి వీసా నిబంధనలను కఠినతరం చేయడం, గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియలో జాప్యం వంటి నిర్ణయాలతో ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులను ఇబ్బందులకు గురిచేసే వ్యూహాన్ని అమెరికా అమలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో, అమెరికాలో స్థిరపడిన భారతీయ మేధావులను, ప్రముఖ కంపెనీల సీఈవోలను ‘తిరిగి భారత దేశానికి వచ్చేయండి.. ఇక్కడే అద్భుతాలు సాధించండి’ అంటూ మన రాజకీయ శ్రేణుల నుంచి, సామాజిక మాధ్యమాల నుంచి పిలుపులు అందుతున్నాయి. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సహా పలువురు గ్లోబల్ కంపెనీల సీఈవోలు ఇకనైనా ఇండియాకు రండి అని ఒక సీనియర్ పాత్రికేయుడు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలిస్తే ఇవన్నీ భావోద్వేగపూరితమైన భ్రమలుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే, విదేశాల్లోని మేధావులను ఆకర్షించడమనేది కేవలం పిలుపులతోనే సాధ్యం కాదు.. దానికి తగ్గ పారిశ్రామిక, పరిపాలనా పరమైన ఎకో సిస్టమ్ ఇక్కడ సిద్ధంగా ఉండాలి.
చరిత్ర నేర్పిన పాఠాలు.. మారుతున్న కాలం
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో విదేశాల్లో చదువు కున్న, స్థిరపడిన అనేకమంది మేధావులు మాతృభూమిపై మమకారంతో భారతదేశానికి తిరిగి వచ్చారు. నాటి హోమీ జహంగీర్ బాబా, విక్రమ్ సారాభాయ్ వంటి దిగ్గజాలు ఇక్కడికి వచ్చి అణుశక్తి, అంతరిక్ష రంగాలకు పునాదులు వేశారు. నాటి ప్రభుత్వాలు కూడా వారి ఆలో చనలకు పూర్తి స్వేచ్ఛను, గౌరవాన్ని ఇచ్చి ప్రోత్సహించాయి. అయితే, ఆ తర్వాత దశాబ్దాలలో దేశంలో పెరిగిన రెడ్ టేపిజం, లైసెన్స్ రాజ్ మౌలిక వసతుల లేమి, రాజకీయ జోక్యం కారణంగా దేశంలో ‘మేధోవలస’ భారీగా పెరిగింది. లక్షలాది మంది మేధావులు అమెరికా బాట పట్టారు. నేడు అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో లేదా గ్లోబల్ కంపెనీలలో భారతీయుల హవా నడుస్తున్నదంటే దానికి కారణం వారి ప్రతిభతో పాటు అమెరికా కల్పించిన స్థిరమైన వాతావరణం. నాడు వారు దేశాన్ని వదిలి వెళ్లడానికి కారణమైన సమస్యలను మనం పరిష్కరించామా? లేదా అనే ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంది.
బలిపశువులవుతున్న పెట్టుబడిదారులు..
ఇండియాలో పెట్టుబడిదారులను తీవ్రంగా భయపెట్టే ప్రధానాంశం ‘పాలసీ అస్థిరత’. మన దేశంలో ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారుతుంటాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా మునుపటి ప్రభుత్వం తెచ్చిన పారిశ్రామిక విధానాలు, పన్ను నిబంధనలు, సబ్సిడీలు కూడా మారిపోతుంటాయి. డాలర్లలో సంపాదిస్తూ, అంతర్జాతీయ ప్రమాణాలతో వ్యాపారాలు చేసే ఎన్‌ఆర్‌ఐలు, పెట్టుబడిదారులు ఇలాంటి అనిశ్చితిని అస్సలు భరించలేరు. అమెరికాలో ఆంక్షలకు భయపడి లక్షల రూపాయల ప్యాకేజీలను వదులుకుని ఇండియాకు వచ్చేసిన తర్వాత.. ఇక్కడ పాలసీలు తారుమారైతే వారు లీగల్ చిక్కుల్లో పడి, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ గ్లోబల్ మేధావులను ఇక్కడికి రమ్మనడం వారిని బలిపశువులను చేయడమే అవుతుంది. కనీసం 20 ఏళ్ల పాటు మారని స్థిరమైన పారిశ్రామిక విధానాన్ని చట్టబద్ధంగా మనమూ హామీ ఇస్తేనే ఎన్నారైలు ఇటువైపు చూడగలరు.
వర్క్‌షాపులు.. పబ్లిక్ డొమైన్‌లో సమాచారం!
విదేశాల్లో ఉన్న నిపుణులను దేశానికి రప్పించాలనే సంకల్పం ప్రభుత్వాలకు ఉంటే, ముందుగా ఒక పద్ధతి ప్రకారం హోంవర్క్ చేయాలి. దేశంలో ప్రస్తుతం ఏ రకమైన పరిశ్రమలను ప్రభుత్వం తీవ్రంగా ప్రోత్సహించాలనుకుంటోంది? ఏయే రంగాలలో శాస్త్రవేత్తలు, సాంకేతిక మేధావుల కొరత తీవ్రంగా ఉంది? అనే అంశాలపై స్పష్టమైన సర్వేలు చేయాలి. దేశంలో ఉన్న అవకాశాలను ఒక శ్వేతపత్రం రూపంలో పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలి. అమెరికాలో సరైన వీసా అవకాశాలు లేక, నిరంతరం గ్రీన్ కార్డ్ టెన్షన్‌తో గడుపుతూ తిరిగి వచ్చేయాలని భావించే మధ్యతరగతి నిపుణులు వేలల్లో ఉన్నారు. ఇక్కడ ఏ రంగంలో అవకాశాలు ఉన్నాయో అధికారికంగా స్పష్టత ఇస్తే, కనీసం ఈ వర్గం వారైనా ధైర్యంగా ఇండియాకు వచ్చి స్థిరపడేందుకు వీలవుతుంది.
సీఈవోలు కాదు.. జీసీసీలు కావాలి!
అంతేకానీ, గ్లోబల్ టాప్ కంపెనీ సీఈవోలను తమ ఉద్యోగాలు, బోర్డు పదవులు వదిలేసి ఇండియాకు వచ్చే యమనడం అవగాహన లేమి లేదా మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే వారు గ్లోబల్ కార్పొరేట్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీల షేర్ హోల్డర్లకు జవాబుదారీగా ఉంటారు. వారు ఇండియాకు రావడం వల్ల దేశానికి వచ్చే లాభం కంటే, వారు ఉన్నత స్థానాల్లో ఉంటూ భారతదేశానికి లబ్ధి చేకూర్చే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం ఉత్తమం. దీనికి ప్రస్తుతం ఉన్న అత్యంత ఆచరణాత్మకమైన మార్గం ‘గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. అమెరికాలోని ప్రముఖ కంపెనీల సీఈవోలు వారి కంపెనీల తరఫున హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలలో భారీ ఎత్తున గ్లోబల్ సెంటర్లను ఏర్పాటు చేసేలా మనం ప్రోత్సాహకాలు ఇచ్చి ఆహ్వానించవచ్చు. ఈ జీసీసీల ద్వారా అమెరికా కంపెనీలు తమ అత్యున్నత సాంకేతిక పరిశోధనలను ఇక్కడి నుంచే నిర్వహిస్తాయి. మనుషులు దేశం దాటి వెళ్లకుండానే, ఇక్కడి టాలెంట్‌కు అంతర్జాతీయ స్థాయి ఉపాధి లభిస్తుంది.
నేటికీ యువతలో డాలర్ కలలు..
మన సామాజిక వైరుధ్యాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. మనవాళ్లకు క్షేత్రస్థాయిలో అమెరికా మోజు ఏమాత్రం తగ్గలేదు. నేటికీ అమెరికా నుంచి ఎవరైనా బంధువులో, మిత్రులో భారతదేశానికి వస్తే, వారిని కలిసే వంద మందిలో కనీసం తొంభై మంది ‘మా అబ్బాయికో, అమ్మాయికో అమెరికాలో ఏదైనా అవకాశం ఉంటే చూడండి’ అని అడుగుతున్నారనేది నగ్నసత్యం. ఒకవైపు ఇక్కడి సమాజంలో అమెరికా వీసా పట్ల ఇంతటి తీవ్రమైన వ్యామోహం, ఆరాటం ఉంచుకుని, మరోవైపు అమెరికాలో ఉన్నవారిని ఇక్కడికి వచ్చేయ మనడం ద్వంద్వ నీతి అవుతుంది. భారత్ నిజంగానే గ్లోబల్ లీడర్ కావాలంటే, విదేశాల్లో ఉన్నవారిని భౌతికంగా రమ్మని కోరడం కంటే.. వారి పెట్టుబడులను, మేధస్సును, డిజిటల్ ఐడియాలను సులువుగా ఆకర్షిం చగలిగే లీగల్, పరిపాలనాపరమైన బలమైన ఎకో సిస్టమ్‌ను నిర్మించడమే ఏకైక మార్గం.
- హరీశ్ ఎస్పీ






