ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విధానాల వర్గీకరణ

by Ravi |   (  Updated:2026-04-29 22:01:04  IST  )

ప్రభుత్వ ఉద్యోగులకు అందుబాటులో ఉన్న వివిధ రకాల పెన్షన్ పథకాలు, కుటుంబ పెన్షన్, అశక్తత పెన్షన్, స్వచ్ఛంద విరమణ నిబంధనలు వంటి అంశాలపై పూర్తి అవగాహన ఇచ్చే విశ్లేషణ.

ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విధానాల వర్గీకరణ
X

ఉద్యోగి తన విద్యుక్త ధర్మాలను నిర్వహించే సందర్భంలో ప్రభుత్వం నిర్దేశించిన కాలపరిమితి వరకు సుదీర్ఘకాలం ప్రజలకు ప్రభుత్వానికి సేవలందించినందినందుకు ప్రతి ఫలంగా, సాంఘిక భద్రత/సంక్షేమ పద్ధతిలో చెల్లించేదే పెన్షన్ పథకం. పెన్షన్ పొందటం ఉద్యోగి ప్రాథమిక హక్కు. పదవీ విరమణ తర్వాత తన జీవితాంతం వరకు నియమ నిబంధనల మేరకు ఉద్యోగి పింఛను సౌకర్యం పొందుతాడు. వారి తదనంతరం తనపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులు కూడా నిర్దేశిత నియమ నిబంధనల మేరకు పింఛను పొందవచ్చు. ప్రస్తుతం పెన్షన్ చెల్లింపు పద్ధతులు రెండు రకాలుగా ఉన్నాయి. 1-9-2004 కన్నా ముందు కాలంలో ఉద్యోగంలో చేరిన వారికి సవరించబడిన పింఛను నియమావళులు వర్తిస్తాయి. అటు తర్వాతి కాలంలో గానీ ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారికి క్రొత్త చందాలతో కూడిన పింఛను పథకం వర్తిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు విభిన్న రకాల పెన్షన్‌లు మంజూరు చేయబడతాయి. వాటిపై ఉద్యోగు‌లకు తప్పనిసరిగా అవగాహన ఉండాలి.

కుటుంబ & వయోపరిమితి పెన్షన్..

పెన్షన్ దారుడు మరణించిన తర్వాత అతని కుటుంబానికి ఇచ్చే పెన్షన్‌ను కుటుంబ పెన్షన్ అంటారు. సవరించిన పెన్షన్ నియమాలు-1980 రూల్ 50 ప్రకారం అర్హుల వివరాలు, విధానం నిర్ణయించబడింది. ఉద్యోగంలో ఉన్నప్పుడే మరణించినా లేదా రిటైర్మెంట్ తర్వాత మరణించినా కుటుంబానికి పెన్షన్ ఉంటుంది. ఉద్యోగంలో ఉండి మరణిస్తే మొదటి 7 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చే వరకు (ఏది ముందైతే అది) చివరి బేసిక్ జీతం 50% ఇస్తారు. తరువాత 30% చెల్లిస్తారు. రూల్స్ 32, 33, 34 ప్రకారం రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా ఈ పెన్షన్ వర్తిస్తుంది.

ఉద్యోగ తగ్గింపు - తాత్కాలిక పెన్షన్ నిబంధనలు..

సవరించిన పెన్షన్ నియమాలు-1980 రూల్ 39, 40 ప్రకారం ప్రభుత్వం ఉద్యోగిని నిర్బంధంగా రిటైర్ చేస్తే పెన్షన్ ఇస్తారు. ఇది ఇన్‌వాలిడ్ పెన్షన్, గ్రాట్యుటీ మొత్తంలో 2/3 కంటే తక్కువగా ఉండాలి, కానీ కనీస పెన్షన్ కంటే తక్కువ కాదు. 2001 నుంచి కమ్యుటేషన్ కూడా ఉంది. ఇక ఉద్యోగి పనులు చేయలేనంతగా శాశ్వతంగా అశక్తుడని వైద్యులు ధృవీకరిస్తే అశక్తత పెన్షన్ మంజూరు చేస్తారు. అలాగే ఉద్యోగాలు తగ్గించినప్పుడు ఇతర పోస్టు ఇవ్వలేకపోయినా లేదా ఉద్యోగి తక్కువ స్థాయి పోస్టు అంగీకరించకపోయినా రూల్ 38 ప్రకారం పెన్షన్ మంజూరు చేస్తారు. ఇక శాఖాపర లేదా న్యాయ విచారణలు పూర్తి కాకముందే రిటైర్ అయితే, జీవో.నం.1097 (22-06-2010) ప్రకారం కనీసం 75% పెన్షన్‌ను తాత్కాలికంగా చెల్లిస్తారు.

ఉద్యోగ విరమణ అనంతర పెన్షన్ నిబంధనలు..

ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ మంజూరులో ఆలస్యం జరిగినప్పుడు, ఉద్యోగికి రావలసిన పెన్షన్‌లో 90% వరకు ముందస్తుగా చెల్లించవచ్చు. 1980 సవరించిన పెన్షన్ నియమావళి రూల్ 43 ప్రకారం, ఉద్యోగి కనీసం 20 సంవత్సరాల అర్హతా సేవ పూర్తి చేసి ఉంటే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పొందవచ్చు. అలాగే పెన్షన్ లెక్కింపులో గరిష్టంగా 5 సంవత్సరాల వెయిటేజ్‌ను కూడా కలుపుతారు. ఇక అసాధారణ పెన్షన్ ప్రమాదవశాత్తు చనిపోయిన లేక హింసాత్మక చర్యల వల్ల చంపబడిన వారికి ఇట్టి పెన్షన్ మంజూరు చేస్తారు.. దీనిని మంజూరు చేయు అధికారం ప్రభుత్వానికి మాత్రమే ఉన్నది. అట్టి సందర్భాలలో ఉద్యోగి స్వయం కృతాపరాధం వల్ల, నిర్లక్ష్యం వల్ల ప్రమాదం లేదా చంపబడిన విషయాలను గాని పరిగణలోకి తీసుకుంటారు.

- సుధాకర్.ఏ.వి

రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, STUTS

90006 74747

Next Story