- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూ హక్కుల పరిరక్షణలో పౌరుల చైతన్యమే అసలైన భద్రత!
భూ వివాదాల పరిష్కారంలో తహశీల్దార్ నుంచి సీసీఎల్ఏ వరకు రెవెన్యూ వ్యవస్థ పాత్ర, పౌరుల హక్కులు, భూ రికార్డుల ప్రాముఖ్యత, సివిల్ కోర్టుల అధికార పరిధి, చట్టపరమైన మార్గాలపై సమగ్ర విశ్లేషణ. భూ హక్కుల పరిరక్షణకు అవగాహన, పారదర్శకత, జవాబుదారీతనం ఎందుకు అవసరమో తెలుసుకోండి.

భూమి కేవలం ఆస్తి మాత్రమే కాదు. అది వ్యక్తి సామాజిక హోదాను, జీవనోపాధిని నిర్ణయించే కీలక శక్తి. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ నేపథ్యంలో భూమి విలువ ఆకాశాన్ని తాకుతుండటంతో భూ వివాదాలు నిరంతరం పెరుగుతున్నాయి. పౌరులు తమ భూమి హక్కులను రక్షించుకోవాలంటే రెవెన్యూ యంత్రాంగం పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి.
అయితే, క్షేత్రస్థాయిలో అధికారుల చుట్టూ తిరగడం, వారి నిర్లక్ష్యం, అవినీతి వంటి అంశాలు సామాన్యుడి ఓపికను పరీక్షిస్తున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం కేవలం చట్టాల్లోనే కాకుండా, పౌరుల చైతన్యంలో కూడా ఉందని గుర్తించాలి.
మార్పులు రికార్డుల నిర్వహణకే...
ప్రతి భూసమస్యకు ప్రాథమిక వేదిక మండల కార్యా లయం. భూమి సరిహద్దు వివాదాలు తలెత్తినా, పట్టాదారు పాస్ పుస్తకాలు లేదా 1బి (ఆర్ఓఆర్) రికార్డుల్లో తప్పులు దొర్లినా తక్షణమే తహశీల్దార్‌ను ఆశ్రయించాలి. క్షేత్ర స్థాయిలో భూమిని కొలవడానికి మండల సర్వేయర్ సహాయం తీసుకోవడం తప్పనిసరి. పొరుగు భూ యజమానులతో ఘర్షణలు నివారించి, శాంతియుతంగా ఎఫ్.ఎమ్.బి (Field Measurement Book) ప్రకారం సరిహద్దులు నిర్ధారించుకోవడానికి ఈ వ్యవస్థ వీలు కల్పిస్తుంది. అయితే, రెవెన్యూ అధికారులు చేసే మార్పులు కేవలం రికార్డుల నిర్వహణకు మాత్రమే పరిమితమని, అవి యాజమాన్య హక్కులను (De jure titles) సృష్టించలేవని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.
ఆర్డీఓ పాత్ర అత్యంత కీలకం!
మండల స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం వల్ల జాప్యం జరిగితే బాధితులు విధిగా డివిజన్ స్థాయికి వెళ్లాలి. ఇక్కడ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) అప్పీలేట్ అథారిటీగా బాధ్యతలు నిర్వహిస్తారు. మండల స్థాయి ఆర్డర్లపై అభ్యంతరం ఉన్నా, సర్వే నిర్వహణలో లోపాలు కనిపిస్తున్నా ఆర్డీఓ కోర్టులో అప్పీల్ దాఖలు చేయాలి. డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే (డి.ఐ.ఎస్) ద్వారా వివాదాస్పద భూమిని పునర్విచారణ చేయించే అధికారం వీరికి ఉంటుంది. ప్రభుత్వ భూముల పరిరక్షణలోనూ, అసైన్డ్ భూముల వివాదాల పరిష్కారంలోనూ ఆర్డీఓ పాత్ర అత్యంత కీలకం. కేవలం కార్యాలయాల చుట్టూ తిరగడం కంటే, సమాచార హక్కు చట్టం (RTI) వంటి సాధనాలను ఉపయోగించి జాప్యాన్ని ప్రశ్నించడం మంచి మార్గం.
సాంకేతిక సమస్యలే సవాల్!
జిల్లా స్థాయిలో కలెక్టర్ భూపరిపాలనకు సర్వాధికారిగా వ్యవహరిస్తారు. సర్వే రికార్డుల సవరణలో గల సాంకేతిక సంక్లిష్టతలను తొలగించడానికి అసిస్టెంట్ డైరెక్టర్ (సర్వే) పర్యవేక్షణలో విచారణ జరుగుతుంది. కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్ల లేదా పాత రికార్డులైన సేత్వార్, ఖాస్రా పహానీల్లోని తప్పుల వల్ల నష్టం వాటిల్లితే జిల్లా యంత్రాంగం పరిష్కారం చూపుతుంది. రాష్ట్ర స్థాయిలో భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) అత్యున్నత నిర్ణయాధికారి. భూమి రికార్డుల డిజిటలైజేషన్, భూ భారతి వంటి పోర్టల్స్ నిర్వహణ, రాష్ట్రవ్యాప్త భూ విధానాల అమలును సీసీఎల్ఏ పర్యవేక్షిస్తుంది. వ్యవస్థలో అవినీతిని అరికట్టడానికి ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చినా, సాంకేతిక సమస్యలు పౌరులకు మరో సవాలుగా మారుతున్నాయి.
రెవెన్యూ రికార్డులు పన్ను వసూలుకే..
ఈ పరిపాలనా వ్యవస్థను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రసిద్ధ కోర్టు తీర్పులను పరిశీలించాలి. థమ్మాడ రామారావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో న్యాయస్థానం స్పష్టమైన తీర్పు ఇచ్చింది. రెవెన్యూ రికార్డులు కేవలం పన్ను వసూలు సౌలభ్యం (Fiscal purpose) కోసమే తప్ప, అవి యాజమాన్య హక్కులకు అంతిమ సాక్ష్యాలు కావు. రికార్డుల్లో పేరున్నంత మాత్రాన ఆ వ్యక్తికి భూమిపై పూర్తి యాజమాన్యం ఉన్నట్లు చట్టం భావించదు. టైటిల్ వివాదాలను తేల్చే అధికారం కేవలం సివిల్ కోర్టుకు మాత్రమే ఉంటుంది. రెవెన్యూ యంత్రాంగం కేవలం స్వాధీన అనుభవాలను (Possessory rights) నమోదు చేయడానికి మాత్రమే పరిమితం కావాలి.
అధికారుల నిర్లక్ష్యం వల్ల హక్కులు కోల్పోతే...
జాయింట్ కలెక్టర్, రంగారెడ్డి జిల్లా వర్సెస్ డి. నరసింహారావు కేసులో సుప్రీంకోర్టు కాలపరిమితి (Limitation) ప్రాధాన్యతను నొక్కి చెప్పింది. దశాబ్దాల క్రితం జరిగిన రికార్డుల మార్పును ఇప్పుడు సవాలు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది. బాధితులు సహేతుకమైన కాల వ్యవధిలోపు మాత్రమే అప్పీల్ చేసుకోవాలి. రాజ్యాంగంలోని 300 ఏ అధికరణ ప్రకారం, చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించకుండా ఏ వ్యక్తిని తన ఆస్తి నుండి దూరం చేయలేరు. రికార్డు మార్పు చేసే ముందు సంబంధిత వ్యక్తికి నోటీసు ఇవ్వడం, విచారణ జరపడం వంటి సహజ న్యాయ సూత్రాలు (Principles of Natural Justice) పాటించడం అనివార్యం. అధికారుల నిర్లక్ష్యం వల్ల హక్కులు కోల్పోతే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కూడా పౌరులకు ఉంది.
నిజమైన భూ భద్రత అప్పుడే..!
భూమి హక్కుల పరిరక్షణ కేవలం అధికారుల బాధ్యత కాదు. అది పౌరుల చైతన్యంపై ఆధారపడి ఉంటుంది. అధికారుల చుట్టూ తిరగడం ఓపికతో కూడిన పనే అయినా, చట్ట పరమైన మార్గాల ద్వారా వారిని బాధ్యులను చేయవచ్చు. తహశీల్దార్ నుండి సీసీఎల్ఏ వరకు గల క్రమానుగత వ్యవస్థను బాధితులు సమర్థవంతంగా వినియోగించుకోవాలి. చట్టపరమైన చిక్కులు తలెత్తినప్పుడు కార్యాలయాల చుట్టూ తిరగడం కాకుండా, సంబంధిత రెవెన్యూ డాక్యుమెంట్లను (లింక్ డాక్యుమెంట్స్, పాత పహానీలు) భద్రపరచుకోవాలి. రికార్డుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారితనం పెరిగినప్పుడే సామాన్యుడికి నిజమైన భూ భద్రత లభిస్తుంది. పౌరులకు వ్యవ స్థపై నమ్మకం కలగడమే సామాజిక సుస్థిరతకు పునాది.
-డా. కట్కూరి
పాలసీ విశ్లేషకులు






